Skip to main content

UGC Biannual Admission Plan: ఏటా రెండుసార్లు ప్రవేశాలు సాధ్యమేనా?..ఆ వర్సిటీల్లో అమలు ఎలా?

UGC Biannual Admission Plan  University Grants Commission vacant seats due to teaching staff shortagesadmission system

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కొత్తగా తీసుకురానున్న ఏటా రెండు సార్లు ప్రవేశాల విధానంపై రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు తర్జన భర్జన పడుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాకపోయినా, ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలనే యూజీసీ ఆదేశాలు ఎలా సాధ్యమనే వాదన వినిపిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో భారీగా బోధన సిబ్బంది ఖాళీలున్నాయి. 

ఏడాదికి రెండు బ్యాచ్‌లకు ఒకే అధ్యాపకుడు బోధించడం ఎలా సాధ్యమనే వాదన ఉంది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు చేపట్టాలని ఇటీవల యూజీసీ నిర్ణయించింది. ఇప్పుడు జూలై–ఆగస్టు మధ్య మాత్రమే ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ సెషన్‌ కాకుండా జనవరి–ఫిబ్రవరి మధ్య మరో దఫా అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరంలోనే దీన్ని అమలు చేయాలని భావించడంపై వర్సిటీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.  

అమెరికానే ఆదర్శం... 
అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలు ద్వైవార్షిక ప్రవేశాల విధానాన్ని అమలు చేస్తున్నాయి. దేశ విద్యా విధానంలోనూ మార్పులు తెచ్చారు. మార్కులు కాకుండా క్రెడిట్లు ఇవ్వాలని నూతన విద్యా విధానం పేర్కొంటోంది. విదేశాల్లోనూ ఇదే విధానం ఉండటం వల్ల డిగ్రీ గుర్తింపు తేలికగా ఉంటుందని భావిస్తున్నారు. అడ్మిషన్లు కూడా ఏడాదికి రెండుసార్లు ఉంటే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని యూజీసీ చెబుతోంది. 

Centre Warning To Its Employees: ఆఫీసులకు లేటుగా వెళ్తున్నారా? ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక

వివిధ కారణాలతో తొలి దశలో ప్రవేశం పొందలేని వారికి జనవరి– ఫివ్రబరిలో తేలికగా అడ్మిషన్‌ పొందే వీలుంది. ఏడాదిపాటు ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉండబోదని యూజీసీ వర్గాలు అంటున్నాయి. పారిశ్రామిక వర్గాలు కూడా ఏడాదికి రెండు దఫాలు క్యాంపస్‌ సెలెక్షన్‌ చేసే వీలుందని చెబుతున్నాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశిస్తున్నారు.  

సన్నద్ధత ఎలా? 
ద్వైవార్షిక ప్రవేశాలపై సన్నద్ధతను కోరుతూ దేశంలోని అన్ని వర్సిటీలు, ఉన్నత విద్యా మండళ్లకు యూజీసీ లేఖలు రాస్తోంది. దీనిపై ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రెండుసార్లు అడ్మిషన్ల వల్ల ఒకే కోర్సును రెండు సెషన్లుగా నిర్వహించాల్సి ఉంటుంది. మొదటి సెషన్‌ సెపె్టంబర్‌లో మొదలైతే, రెండో సెషన్‌ మార్చిలో మొదలవుతుంది. అప్పటికే మొదటి సెషన్‌ విద్యార్థులు ఒక సెమిస్టర్‌ పూర్తి చేసి ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు సెషన్ల నిర్వహణకు అవసరమైన ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, తరగతి గది రూపంలో అవసరమైన వనరులు వర్సిటీలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వర్సిటీలతో మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. 

NEET Controversy: 'నీట్‌' ఒక కుంభకోణం, కోచింగ్‌ సెంటర్లు, స్కూల్‌ ప్రిన్సిపల్‌కు ఇందులో హస్తముంది.. సీఎం సంచలన వ్యాఖ్యలు

ఈ కారణంగా అదనపు క్లాసుల నిర్వహణ తేలికగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులకు విదేశీ వర్సిటీలు తోడ్పాటును అందిస్తాయి. అయితే, ఇందుకు తగ్గ వనరులు, ఫ్యాకల్టీ, మౌలిక వసతుల ఏర్పాటుపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అరకొరగా ఉన్న ఫ్యాకల్టీ కారణంగా నిర్వహణ ఏమేర సాధ్యమనే వాదన వినిపిస్తోంది. ఉన్నత విద్యా సంస్థల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెంచడం, స్వయంగా ఆర్థికంగా బలపడే కొన్ని కోర్సులు తెచ్చే ఆలోచన కూడా యూజీసీ చేసే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి.  

మార్గదర్శకాలు రావాల్సి ఉంది: ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 
ద్వైవార్షిక ప్రవేశాలపై యూజీసీ కసరత్తు చేస్తోంది. అయితే, ఇది ఎలా నిర్వహించాలనే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అవి వచ్చిన తర్వాతే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. అన్ని స్థాయిల్లో చర్చించాల్సి ఉంటుంది. 

ఎన్‌రోల్‌మెంట్‌ పెరుగుతుంది: ప్రొఫెసర్‌ ఎన్‌వీ రమణారావు, నిట్‌ డైరెక్టర్, రాయపూర్‌ 
ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల హాజరు పెరుగుతుంది. ఇప్పటికే విదేశాల్లో ఇది నడుస్తోంది. ఇది విద్యార్థులకు ఉపయుక్తంగానే ఉంటుంది. కాకపోతే వనరుల సమీకరణ సవాల్‌గా ఉంటుంది. 

విద్యార్థులకు ప్రయోజనమే: ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి 
అమెరికా వంటి దేశాలు అమలు చేస్తున్న తరహాలో భారత్‌లోనూ ద్వైవార్షిక ప్రవేశాలు ఉంటే విద్యార్థులకు ఉపయోగమే. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడొచ్చు. ఒకసారి ప్రవేశ పరీక్ష పాసైతే రెండోసారి అడ్మిషన్లకూ ఇది అర్హతగానే ఉంటుంది. కాబట్టి సాంకేతికపరమైన సమస్యలు ఉండొకపోవచ్చు.  

Published date : 18 Jun 2024 11:38AM

Photo Stories