Top-10 Higher Education Institutions: ఐఐఎం–అహ్మదాబాద్ యూనివర్సిటీకి దేశంలోనే టాప్ ర్యాంకు
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్)లో 65 భారతీయ వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలో మొత్తం రెండువేల విశ్వవిద్యాలయాలకు సీడబ్ల్యూయూఆర్–2024 ఎడిషన్‌లో ర్యాంకులు ప్రకటించింది.
గతేడాదితో పోలిస్తే భారత్‌కు చెందిన 32 ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులు మెరుగవ్వగా.. మరో 33 సంస్థల ర్యాంకులు స్వల్పంగా క్షీణించాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్–అహ్మదాబాద్ (ఐఐఎం–ఏ) దేశంలోనే అగ్రశేణి విద్యా సంస్థగా నిలిచింది. అంతర్జాతీయంగా గతేడాది 419వ ర్యాంకు నుంచి ప్రస్తుతం 410కి చేరుకోవడం విశేషం.
తగ్గిన ర్యాంకులు..
20,966 విద్యా సంస్థల నుంచి అత్యుత్తమ విద్యా సేవలందించే రెండువేల వర్సిటీలను గుర్తించి సీడబ్ల్యూయూఆర్ ర్యాంకులు ప్రకటించింది. టాటా ఇన్‌స్టిట్యూట్‌తో సహా దేశంలోని టాప్–10 ఇన్‌స్టిట్యూట్లలో ఏడింటి ర్యాంకులు క్షీణించాయి. ఐఐఎం–అహ్మదాబాద్ తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) నిలిచింది.
TS EAPCET 2024: ఎంసెట్‌లో ఆ ర్యాంకు వస్తే CSE సీటు ఈజీనే..
గతేడాది 494వ ర్యాంకు నుంచి 501కు, ఐఐటీ–ముంబై 554 నుంచి 568వ ర్యాంకు, ఐఐటీ–మద్రాస్ 570 నుంచి 582, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వర్సిటీ 580 నుంచి 606కు, ఐఐటీ–ఢిల్లీ 607 నుంచి 616, ఢిల్లీ వర్సిటీ 621 నుంచి 622, పంజాబ్ వర్సిటీ 759 నుంచి 823కు క్షీణించాయి. మరోవైపు.. ఐఐటీ–ఖరగ్‌పూర్ తన స్థానాన్ని 721 నుంచి 704కు, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ 866 నుంచి 798కు మెరుగుపర్చుకుంది.
టాప్‌లో అమెరికా వర్సిటీలు..
సెంటర్ ఫర్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్–10లో అన్నీ అమెరికా విశ్వవిద్యాలయాలే నిలిచాయి. అమెరికాకు చెందిన 90 విద్యా సంస్థలు ర్యాంకుల్లో మెరుగుదలను సాధించగా 23 స్థిరంగా, 216 వర్సిటీల ర్యాంకులు క్షీణించాయి. అలాగే, యూకేలో కేవలం 28 సంస్థలు మాత్రమే స్థానాలను మెరుగుపర్చుకోగా, 57 సంస్థల ర్యాంకులు పడిపోయాయి.
జర్మనీకి చెందిన మ్యూనిచ్ విశ్వవిద్యాలయం 46వ స్థానంలో ఉన్నా జర్మనీలోని 55 వర్సిటీల ర్యాంకులు దిగజారాయి. వీటికి విరుద్ధంగా చైనాలో 95% వర్సిటీలు గతేడాది కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాయి. సింఘువా వర్సిటీ 43వ స్థానంలో నిలిచింది.
వెయ్యిలోపు భారత్‌లోని వర్సిటీల ర్యాంకులు..
పంజాబ్ వర్సిటీ (823), ఐఐటీ–కాన్పూర్ (842), ఎయిమ్స్–ఢిల్లీ (874), ఐఐటీ–రూర్కీ (880), బెనారస్ హిందూ వర్సిటీ (891), హోమీబాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ (903), జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ (927), జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ (951), ఐఐటీ–గౌహతి (966) ర్యాంకులు సాధించాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 1,299, ఐఐటీ–హైదరాబాద్‌కు 1,327 ర్యాంకులు వచ్చాయి.
టాప్–10 వర్సిటీలు అమెరికావే..
» హార్వర్డ్ వర్సిటీ
» మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
» స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం
» యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి
» యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్
» ప్రిన్స్టన్ వర్సిటీ
» కొలంబియా విశ్వవిద్యాలయం
» యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా
» యేల్ వర్సిటీ
» కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ