TS EAPCET 2024: ఎంసెట్‌లో ఆ ర్యాంకు వస్తే CSE సీటు ఈజీనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు మరో 20 రోజుల్లో వెలువడే అవకాశముంది. ఇప్పటికే కీ విడుదల చేశారు. దీన్ని బట్టి ఎన్ని మార్కులు వస్తాయనేది విద్యార్థులకు ఓ అంచనా ఉంది. ఈ మార్కుల ఆధారంగా ఏయే ర్యాంకులు వస్తాయి? ఆ ర్యాంకుకు అనుకున్న కాలేజీలో సీటు వస్తుందా? అనే ఉత్కంఠ విద్యార్థుల్లో కన్పిస్తోంది.
అయితే ఇంజనీరింగ్ ప్రశ్నపత్రం కష్టంగా లేదని, ఎక్కువ మంది అర్హత సాధించే వీలుందని నిపుణులు అంటున్నారు. సాధారణ విద్యార్థి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ సబ్జెక్టుల నుంచి 40 ప్రశ్నలకు జవాబులు ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. 160 ప్రశ్నల్లో ఎక్కువ మంది 50 శాతానికి పైగానే కరెక్టు సమాధానాలు రాయవచ్చని అంచనా వేస్తున్నారు. 100 మార్కులొస్తే టాప్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చే అవకాశముందని నిపుణులు విశ్షిస్తున్నారు.
సీఎస్‌సీ సీటు ఈజీనే
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 80 వేల వరకూ సీట్లు అందుబాటులో ఉండే వీలుంది. ఇందులో 58% కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సు సీట్లు ఉంటాయి. గత ఏడాది సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్ బ్రాంచిల్లోని సీట్లు కాలేజీలు రద్దు చేసుకోవడం, కొత్తగా పెరిగిన సీట్ల వల్ల కంప్యూటర్ కోర్సుల సీట్లు అదనంగా 14 వేలు పెరిగాయి. కాబట్టి ఈసారి కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పొందడం తేలికేనని నిపుణులు అంటున్నారు. గత ఏడాది ఆఖరి దశ కౌన్సెలింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటే టాప్ కాలేజీల్లో సీఎస్‌సీ సీటు 4 వేల ర్యాంకు వరకూ వచ్చింది.
ఈ ఏడాది కూడా ఇంచుమించు ఇదే ర్యాంకు వరకూ ఉండే వీలుందని తెలుస్తోంది. అయితే కాలేజీతో పనిలేదు కంప్యూటర్ సైన్స్ బ్రాంచిలో సీటే ప్రధానం అనుకుంటే 35 వేల ర్యాంకు వరకూ ఆ సీటు వచ్చే వీలుంది. 50 వేల ర్యాంకు దాటితే మాత్రం సీఎస్‌సీ సీటును ఆశించలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెట్‌లో కనీసం 40 నుంచి 50 మార్కులు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి 35 నుంచి 50 వేల ర్యాంకు వచ్చే వీలుందని చెబుతున్నారు. అదే 90 నుంచి 100 మార్కులు వస్తే 1500 నుంచి 3600 ర్యాంకు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు.
ముందే అంచనా వేయాలి
గత కొన్నేళ్ళుగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించాలి. ఎన్ని మార్కులకు ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో ఏయే బ్రాంచిల్లో సీట్లు వస్తున్నాయి? అనేది ముందుగానే అంచనా వేసుకోవాలి. మొదటి దశ కౌన్సెలింగ్‌లో పక్కాగా సీటు వచ్చే కాలేజీని ఎంపిక చేసుకునేందుకు కొంత కసరత్తు చేసి ఆప్షన్లు ఇచ్చుకుంటే కోరుకున్న బ్రాంచిలో సీటు అవకాశం ఉంది.
– ఎంఎన్ రావు (గణితశాస్త్ర సీనియర్ అధ్యాపకుడు)
ఎన్ని మార్కులొస్తే.. ఎంత ర్యాంకు?
మార్కులు ర్యాంకు
140పైన 100
130పైన 200
120పైన 300
110–120 800–300
100–110 1500–800
90–100 3600–1500
80–90 6000–3600
70–80 12000–6000
60–70 20000–12000
50–60 35000 – 20000
40–50 50000 – 35000