Teacher's Day Special: ఇంగ్లిష్‌లో మా‘స్టార్లు’ వీరే..
సాక్షి ఎడ్యుకేషన్: ఉత్తమ బోధనతో గురుతర బాధ్యత చాటుకుంటున్న వారిని అవార్డులతో సత్కరించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకూ ప్రపంచం మెచ్చే నైపుణ్యాలు అందించేలా గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు.. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రత్యేకంగా ఐదుగురు ఇంగ్లిష్ మాధ్యమ టీచర్లను పురస్కారాలకు ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో జరగనున్న వేడుకల్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వినూత్నంగా, విలక్షణంగా పలువురు టీచర్లు అందిస్తున్న సేవలకు ఫలితం దక్కింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో అందజేసే ఉత్తమ అవార్డులకు వివిధ కేటగిరీల్లో 25 మంది టీచర్లను ఎంపిక చేశారు. వీరందరికీ మంగళవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో జరిగే వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు.ఉపాధ్యాయ దినోత్సవ నేపథ్యం..
భారత తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 5న దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. అధ్యాపకుడిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం టీచర్స్ డే ప్రకటించింది.
సులువుగా ఇంగ్లిష్ నేర్పిస్తున్న ప్రియాంక..
అనంతపురం రూరల్ మండలంలోని పంతులకాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితం టీచరుగా పని చేస్తున్న కాకర్ల హరి ప్రియాంకను ప్రభుత్వం అవార్డుకు ఎంపిక చేసింది. పిల్లలకు గణితం సబ్జెక్టును ఇంగ్లిష్ మీడియంలో అర్థమయ్యేలా బోధిస్తున్నారు ప్రియాంక. ఈమె బీఎస్సీ,బీఈడీ ఇంగ్లిష్ మీడియంలోనే చేశారు. పిల్లలకు ఆంగ్లంలో బోధనకు ఇదికూడా బాగా కలిసొచ్చింది. డిజిటల్ బోధనలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ) ద్వారా బోధిస్తుంటే పిల్లలకు మరింత సులువుగా అర్థమవుతోందని చెబుతున్నారు హరి ప్రియాంక.
అర్థమయ్యేలా చెప్పడంలో సరస్వతి..
ప్రతి విద్యార్థీ ఇంగ్లిష్‌పై పట్టు సాధించరేలా తర్ఫీదు ఇస్తున్నారు రాప్తాడు మండలం హంపాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచరు గోపాలం సరస్వతి. అందుకే ఆమెను ప్రభుత్వం గుర్తించింది. తరగతి గదిలో ఏపాఠం చెప్పాలో సరస్వతి ముందుగానే సన్నద్ధమవుతారు. విద్యార్థులు రాసే నోట్ బుక్స్ కరెక్షన్ కచ్చితంగా ఉంటుంది. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ..స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఇస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు విద్యార్థుల మధ్య పోటీలు పెట్టడం, వారితో ఇంగ్లిష్‌లోనే పాటలు పాడించడం ద్వారా ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా చేస్తున్నామని సరస్వతి చెబుతున్నారు.
వినూత్న బోధనలో రంగనాథ్ దిట్ట..
అనంతపురం జ్యోతిరావు పూలే మునిసిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీ టీచరుగా పని చేస్తున్న ఎస్.రంగనాథ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇంగ్లిష్ మీడియం పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా రంగనాథ్ వినూత్నంగా బోధిస్తుండడం గమనార్హం. ప్రాథమిక స్థాయి తరగతుల పిల్లలకు ఇంగ్లిష్ అంటే భయం కలగకుండా సాంకేతికను అందిపుచ్చుకుని అందుబాటులో ఉన్న ప్రొజెక్టర్ ద్వారా, వీడియో, ఆడియోల ద్వారా అర్థమయ్యేలా నేర్పిస్తున్నారు. చెప్పడం కంటే కూడా వీడియోలు చూపిస్తూ ఆడియోల ద్వారా వినిపించడం వల్ల సులువుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని రంగనాథ్ తెలిపారు.