Skip to main content

Andhra University: అగ్రగామిగా ఏయూ

Research Center Development     AU Transformation in Four Years  andhra university got national recognition   Chief Minister YS Jaganmohan Reddy's Vision

సాక్షి, విశాఖపట్నం : ప్రైవేటు వర్సిటీల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీని తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోవడంతో మసకబారిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చొరవతో కొత్త ఊపిరులందుకుంది. తమ ప్రైవేటు వర్సిటీ ఎదుగుదల కోసం ఏయూ ఓ దెయ్యాల కొంప అంటూ టీడీపీ నేతలు యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే వాఖ్యలు చేస్తే.. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతతో నాలుగేళ్ల కాలంలో సమాజ ఉపయుక్తంగా, పరిశ్రమల అవసరాలు తీర్చే వైవిధ్య పరిశోధన కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీ తీర్చిదిద్దారు. విద్యార్థి అభ్యున్నతికి మార్గదర్శిగా పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా ఏయూని ప్రభుత్వం మార్చింది. వివిధ దేశాలు, యూనివర్సిటీలు, సంస్థల ఒప్పందాలతో చదువుకు సహకారం అందిస్తూ ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న ఏయూకి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వైస్‌చాన్స్‌లర్‌ ప్రొ.పీవీజీడీ ప్రసాదరెడ్డి నవ్య ఆలోచనలతో పనిచేస్తూ నూతన ప్రాజెక్టులను నిర్వహిస్తూ విశ్వవిద్యాలయ ప్రగతికి బాటలు వేశారు.

నలు దిశలా ప్రగతి
విద్యార్థులను ఆవిష్కర్తలుగా, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏయూ–నాస్కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను రూ.27 కోట్లతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గతంలో లేని విధంగా సొంతంగా ఒక స్టార్టప్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఆ–హబ్‌ను తీర్చిదిద్దారు. టీ–హబ్‌కు దీటుగా.. ఆ–హబ్‌లో ప్రస్తుతం 150కి పైగా స్టార్టప్‌ సంస్థలు ఇక్కడి నుంచి సేవలు అందిస్తున్నాయి. వేలాది మంది యువతకు ఉపాధిని అందిస్తున్నాయి. ఫార్మా రంగంలో స్టార్టప్‌, ఇంక్యుబేషన్‌ కేంద్రంగా ఎలిమెంట్‌ తీర్చిదిద్దారు. ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (ఏయూ సిబ్‌), అవంతి ఫీడ్స్‌ సంస్థ సహకారంతో ఏర్పాటైన ఏయూ–అవంతి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, మైరెన్‌ సంబంధిత రంగాలలో విశిష్ట పరిశోధనలు జరుపుతూ విజయవంతంగా పనిచేస్తోంది. ఆర్‌ఐఎన్‌ఎల్‌ సహకారంతో హ్యూమన్‌ జెనిటిక్స్‌ విభాగంలో బయోఆర్బర్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని, ఏయూ పూర్వ విద్యార్థి రవికిరణ్‌ స్థాపించిన టికాబ్స్‌–ఇ జీవశాస్త్ర సంబంధ పరిశోధనలు, ఆవిష్కరణలు చేస్తూ విద్యార్థులు పేటెంట్లు సాధించే దిశగా పనిచేస్తోంది. అంతర్జాతీయంగా జియో ఇంజినీరింగ్‌ ప్రాధాన్యతను ముందుగానే గుర్తించి జియో ఇంజినీరింగ్‌ విభాగాన్ని పటిష్టపరిచారు. రూ.67.5 కోట్లతో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) సంయుక్తంగా ఏయూతో ఇంక్యుబేషన్‌, స్టార్టప్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఫుడ్‌ టెస్టింగ్‌, ఇంక్యుబేషన్‌ కేంద్రం ఏయూలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఫుడ్‌ సొసైటీ రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఏయూలో సేవలందిస్తున్న డిజిఫాక్‌ సంస్థకు వేలాది మంది యువతకు లో కోడ్‌ టెక్నాలజీపై ప్రత్యక్షంగా శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.

98 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..
మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థినులకు నూతన హాస్టల్‌ నిర్మాణం, ప్రయోగశాలలు, మౌలిక వసతుల్ని కల్పించారు. 98 ఏళ్ల వర్సిటీ చరిత్రలో ఫార్మసీ కళాశాల విద్యార్థినులకు తొలిసారిగా ప్రత్యేక హాస్టల్‌ భవనాన్ని కళాశాలకు చేరువలో నిర్మించారు. వర్సిటీ విద్యార్థులకు వసతి కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ నూతనంగా ఆరెంజ్‌, మెటా– హెచ్‌ హాస్టళ్లను నూతనంగా నిర్మించడంతో పాటు, విద్య ప్రగతి విహార్‌, విద్య తరంగిణి విహార్‌ హాస్టల్‌ను ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితో పాటు శాతవాహన హాస్టల్‌లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించారు. ప్రతీ విభాగంలో టాయిలెట్స్‌, విద్యార్థినుల రెస్ట్‌రూమ్‌లను పూర్తిగా మార్పు చేశారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌కు పూర్వవైభవం తీసుకువచ్చారు.

ఆక్రమణదారుల చెర నుంచి..
నగరం నడిబొడ్డున ఉన్న ఏయూకి చెందిన విలువైన ఆస్తులను టీడీపీ నేతలు తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. యూనివర్సిటీ చుట్టూ ఉన్న భూములను దశాబ్దాలుగా ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించారు. యూనివర్సిటీ గ్రౌండ్‌, దాని పరిసరాలన్నీ పొదలతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. ఆక్రమణల పర్వంపై వీసీ ప్రసాదరెడ్డి ఉక్కుపాదం మోపారు. దాదాపు రూ.400 కోట్ల విలువైన స్థలాలను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని ఆ స్థలాలను విద్యార్థులకు ఉపయుక్తంగా మలిచారు.

డ్రోన్‌ టెక్నాలజీకి చిరునామాగా..
ఏయూలో ప్రత్యేకంగా డ్రోన్‌ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరికి ఉపయుక్తంగా ఏయూలో మూడు హెలీప్యాడ్లను అందుబాటులో ఉంచారు. డ్రోన్‌ టెక్‌లో విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందిస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థుల అవసరాలు అనుగుణంగా నూతనంగా అల్గారిథం భవనాన్ని నిర్మించారు. దీనిలో ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణకు ఒక అంతస్తును కేటాయించారు. విశాలమైన తరగతి గదులు, సమావేశ మందిరాలు నిర్మించారు. నాలుగేళ్ల కాలంలో ఏయూలో విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగి నేడు 55 దేశాలకు చెందిన వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తుండటం విశేషం.

విశిష్ట గుర్తింపు
ఆంధ్రవిశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో నాక్‌ డబుల్‌ ప్లస్‌ గ్రేడ్‌ను, 3.74 సీజీపీఏ సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ గుర్తింపు 2030 వరకు ఉంటుంది. ఆచార్యుల కొరత ఉన్న సమయంలో కూడా ఏయూ ఇంతటి విశిష్ట ర్యాంక్‌ను సాధించడం జాతీయ స్థాయిలో తొలి మూడు విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఏయూ నిలిచింది.

నాలుగేళ్లలో ఏయూ రూపురేఖలు మారిపోయాయి
నాలుగేళ్లలో యూనివర్సిటీ రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో క్యాంపస్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించారు. కొత్త భవనాలు నిర్మించారు. పాత వాటిని పునరుద్ధరించారు. మంచి పరిపాలన, కొత్త కోర్సుల రూపకల్పన, విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా ప్రస్తుత వీసీ ప్రసాదరెడ్డి అన్యాక్రాంతమైన రూ.వందల కోట్లు విలువ చేసే ఏయూ భూములు తిరిగి యూనివర్సిటీకి దక్కేలా చేశారు. ప్రధానంగా నాక్‌లో టాప్‌ ర్యాంక్‌ రావడం ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన విషయం. ఏయూ సాధించిన ప్రగతికి అదే కొలమానం. అందుకే ఆయనకు రెండోసారి వీసీగా అవకాశం దక్కింది. 
– ప్రొ.వి.బాలమోహన్‌దాస్‌,

వర్సిటీని మరింత బలోపేతం చేస్తా
నేను బాధ్యతలు తీసుకు నే సమయంలో యూనివర్సిటీ హెరిటేజ్‌ స్ట్రక్చర్స్‌ పూర్తిగా శిథిలమైపోయాయి. వాటిపై దృష్టిసారించి.. ప్రభుత్వ సహకారంతో ఏయూని అభివృద్ధి చేశా. కోవిడ్‌ వంటి విపత్కర సమయాల్లో సైతం సకాలంలో పరీక్షలు పూర్తిచేసి, ఫలితాలను సకాలంలో అందించాం. ప్రత్యేకంగా ప్లేస్‌మెంట్‌ అధికారులను నియమించి ఆర్ట్స్‌, సైన్స్‌,న్యాయ కోర్సుల విద్యార్థులకు సైతం మెరుగైన ఉపాధి అవకాశాల్ని కల్పించాం. ఈ ఏడాది అత్యధికంగా ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని రూ. 84.5 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించి రికార్డు సృష్టించింది. త్వరలోనే ఏయూ శతాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. 20 ఏళ్లగా రిక్రూట్‌మెంట్‌ జరగలేదు. దానిపై ప్రభుత్వం దృష్టి సారించడం శుభపరిణామం.
– ప్రొ.పీవీజీడీ ప్రసాదరెడ్డి, వీసీ

Published date : 22 Jan 2024 10:40AM

Photo Stories