Springsree 2023 at NIT Warangal : దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్.. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో..
నిత్యం విద్యతో కుస్తీ పడుతూ ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న నిట్ విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు దేశవ్యాప్త ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, మన సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకుంటూ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌గా ఏర్పాటు చేసుకుని మూడు రోజుల వేడుకకు శ్రీకారం చుట్టారు.
దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 20వేల మంది విద్యార్థులు ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చ రల్ ఫెస్ట్‌గా నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ నిలుస్తుంది.
ప్రత్యేక థీంతో..
నిట్ వరంగల్ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న స్ప్రింగ్‌స్ప్రీ వసంతోత్సవ వేడుకలకు ప్రత్యేక థీంను రూపొందిస్తారు. ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ–23కి కళాధ్వనిగా నామకరణం చేశారు. 2019లో కళాక్షేత్ర, 2020లో మితియాస్, 2022లో సృష్టి, 2023లో కళాధ్వనిగా నామకరణం చేశారు.
55కు పైగా ఈవెంట్స్‌తో.. ఘనంగా..
ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీలో 55కు పైగా ఈవెంట్స్‌తో అలరించనుంది. తొలి రోజు 7వ తేదీన టాలీవుడ్ నైట్ పేరిట టాలీవుడ్ సింగర్స్ నిట్ మైదానంలో అలరించనున్నారు. రెండో రోజు 8వ తేదీన డీజే నైట్, సన్‌బర్న్ పేరిట డీజేలు వివిధ రకాల పాటలతో అలరించనున్నారు, మూడో రోజు 9వ తేదీన బాలీవుడ్ నైట్ పేరిట బాలీవుడ్ సింగర్స్ ఉర్రూతలూగించనున్నారు.
వీటితో పాటు మూడురోజుల పాటు ప్రొ షోలు, స్పాట్ లైట్స్, స్యాండ్ ఆర్ట్, సైలెంట్ డీజేస్, మాస్టర్ చెఫ్, జుంబాడ్యాన్స్, కొరియో నైట్, వార్ ఆఫ్ డీజెస్, ఐడల్, అల్యూర్‌లతో వసంతోత్సవం కలర్ ఫుల్‌గా సాగనుంది.
ప్రతిష్టాత్మకంగా..
నిట్ వరంగల్‌లో నిర్వహించనున్న మూడు రోజుల స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనిని ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో వేడుకలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. నిట్‌లోని సుభాష్‌చంద్రబోస్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చేందుకు, సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకునేందుకు స్ప్రింగ్‌స్ప్రీ వేడుకలు విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్నారు. రెండు నెలల పాటు 200 మంది విద్యార్థులు నిట్‌లోని వివిధ క్లబ్స్‌తో మమేకమై కోర్‌టీంలుగా ఏర్పడి ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా సినీ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏప్రిల్ 6వ తేదీన ముఖ్యఅతిథిగా పాల్గొని స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకలను నిట్ మైదానంలో ప్రారంభించనున్నారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు ఓరుగల్లు వాసులు ఎదురు చూస్తున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎంట్రీ పాసుల కోసం ఇప్పటికే క్రేజ్ మొదలైంది. స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లను నిట్ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో QR కోడ్‌లతో అందజేస్తున్నారు.
నిట్‌తో వేసువియాస్ ఎంఓయూ
నిట్ వరంగల్‌తో యూకేలోని వేసువియాస్ ఇండియా లిమిటెడ్ సంస్థ మార్చి 30వ తేదీన (గురువారం) ఒప్పందం కుదుర్చుకుంది. డైరెక్టర్ ఎన్వీ.రమణారావు, వేసువియాస్ సంస్థ సీఎస్‌ఆర్ ఇనిషియేటివ్ మేనేజర్ రాజశ్రీదాస్‌లు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఎంఓయూ ద్వారా నిట్‌కు చెందిన మెకానికల్, బెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ముగ్గురు బీటెక్ విద్యార్థినులకు సెకండియర్ నుంచి ఫైనలియర్ వరకు వేసుమియాస్ స్కాలర్‌షిప్ ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను అందజేస్తుందని నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఉమామహేష్, డేవిడ్‌సన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.