Sports competitions: ఆశ్రమ పాఠశాలల క్రీడాపోటీలు ప్రారంభం
పాల్వంచ: పాల్వంచ మండలం కిన్నెరసానిలోని గిరిజన ఆశ్రమ క్రీడా పాఠశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి గిరిజన పాఠశాలల క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పి.మణెమ్మ, ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ కె.విజయలక్ష్మి జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో దమ్మపేట, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, దుమ్ముగూడెం, వైరా, ఖమ్మం డివిజన్ల నుంచి విద్యార్థులు హాజరుకాగా, వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ, క్యారమ్స్, ఖో–ఖో, చెస్, అథ్లెటిక్స్, డిస్కస్ త్రో, షాట్‌పుట్, లాంగ్ జంప్, హైజంప్ పోటీలు నిర్వహించారు.
క్రీడా స్ఫూర్తిని చాటాలి
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సూచించారు. తొలిరోజు పోటీల్లో విజేతలకు బహమతులు అందజేసిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఏ ఇబ్బంది ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈమేరకు నైపుణ్యం కనబర్చి రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ శోభారాణి, సర్పంచ్ వీరకుమారి, హెచ్‌ఎం ఎన్.చందు, ఏసీఎంఓలు ఈ.రమణయ్య, డి.నాగేశ్వరరావు, ఎస్.కే.జహీరుద్దీన్, చంద్రమోహన్, పి.నర్సింహారావు, బి.రూపాదేవి, ఎన్.తిరుమలరావు, ప్రధానోపాధ్యాయులు బి.నామానాయక్, ఎల్.రవి, సీహెచ్.బుచ్చారాములు, బి.శారద, డి.వీరమ్మ, బి.సుభద్ర, పీఈఓలు బి.గోపాలరావు, వీరూనాయక్ తదితరులు పాల్గొన్నారు.