Students: విద్యార్థుల మేధస్సుకు పదును
నల్లగొండ: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విజ్ఞాన అంశాల పట్ల ఆసక్తి పెంచి వారి మేధస్సుకు పదును పెట్టేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజ్ఞాన ప్రతిభా పాటవ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు. అలాగే ఈనెల 12న ఉదయం 11 గంటల నుంచి నల్లగొండలోని డైట్ కళాశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పోటీల ఉద్దేశమిదే..
తెలంగాణ సాంకేతిక విద్యా మండలి, పర్యావరణ పరిరక్షణ, పరిశోధనా సంస్థలు సంయుక్తంగా సుస్థి ర భవిష్యత్ కోసం వివిధ అంశాలపై ఉపన్యాసం, కవితలు, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తోంది. సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
విజేతల ఎంపిక ఇలా..
మండల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 4 అంశాల్లో కలిపి నలుగురు చొప్పున జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. వీరు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఒక్కో అంశం నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ముగ్గురు చొప్పున 4 అంశాల్లో 12 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని విజేతలుగా ఎంపిక చేస్తారు. వారికి ఈనెల 28న జరిగే సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రబారతిలో రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందజేయనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులు విజ్ఞాన పోటీలను సద్వినియోగం చేసుకుని వివిధ అంశాల్లో సత్తాచాటాలి. పాఠశాల స్థాయిలోనే విజ్ఞాన శాస్త్రాలు, వివిధ అంశాల పట్ల ఆసక్తి పెంచుకోవాలి.
– బొల్లారం భిక్షపతి, డీఈఓ, నల్లగొండ