Skip to main content

Scientist: డిగ్రీలు లేకుండానే సైంటిస్ట్‌ కావచ్చు..ఇలా..!

సాక్షి, అమరావతి: అపారమైన ప్రతిభ, అత్యున్నతౖచదువు, విస్తృత పరిశోధనలు చేసిన వారికే వివిధ రంగాల్లో సైంటిస్టులుగా గుర్తింపు ఉండేది.
Citizen Scientists
Citizen Scientists

అవేమీ లేకుండా కేవలం ఆసక్తి ఉంటే సైంటిస్టులు కావచ్చని ‘సిటిజన్‌ సైన్స్‌’ నిరూపిస్తోంది. పౌరులు ఎవరైనా తమకు ఆసక్తి ఉన్న అంశాల్లో అన్వేషణ, అధ్యయనం, పరిశోధనలు చేయడమే సిటిజన్‌ సైన్స్‌. ఎంతోమంది పలు అంశాలపై పరిశోధనలు చేస్తూ సిటిజన్‌ సైంటిస్టులుగా ఆయా రంగాలకు విస్తృత సమాచారం అందిస్తున్నారు. జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అంతరిక్షం, పర్యావరణం ఒకటి కాదు ఆసక్తి ఉన్న అనేక అంశాలపై సిటిజన్‌ సైంటిస్టులు పనిచేస్తున్నారు.

వివిధ శాస్త్ర రంగాల్లో.. 
ప్రపంచవ్యాప్తంగా వివిధ శాస్త్ర రంగాల్లో కొన్ని వేల సిటిజన్‌ సైన్స్‌ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. నాసా అంతరిక్ష కార్యక్రమంలో ప్రస్తుతం 25 సిటిజన్‌ సైన్స్‌ ప్రాజెక్టులు భాగమయ్యాయి. మేఘాలు, చెట్లు, నీటి వనరుల ఫొటోలు తీయడం, సముద్రం అడుగు భాగంలో ఫొటోలను సేకరించడం, కొత్త గ్రహాల కోసం శోధించడం వంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా..
భారత్‌లో బర్డ్‌ వాచర్స్‌ తమ పరిశీలనలను ఈ–బర్డ్‌ వెబ్‌సైట్‌కి 12 ఏళ్లుగా పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా పక్షుల స్థితిని అంచనా వేయడానికి ఈ డేటా ఉపయోగపడుతోంది. కేంద్ర ప్రభుత్వం, అటవీ శాఖ, అనేక ప్రభుత్వ సంస్థలు ఈ డేటాను ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం సీజన్‌ వాచ్‌ ప్రాజెక్టు కొత్తగా ప్రారంభమైంది. అనేకమంది తమ చుట్టూ ఉన్న చెట్లు, పండ్లు, పుష్పాల వివరాలను సీజన్ల వారీగా ఈ ప్రాజెక్టు పోర్టల్‌కు పంపుతున్నారు. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది తమ ఇంటి చుట్టూ ఉన్న జీవవైవిధ్యం, చెట్లు, పక్షుల గురించి సమాచారాన్ని సేకరించారు. ఆ సమయంలో ఎంతోమంది టీచర్లు, విద్యార్థులు, ఇతర పౌరులు ఎంతోమంది సిటిజన్‌ సైంటిస్టులుగా మారారు. తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌ జీవ వైవిధ్యానికి సంబంధించిన పలు సిటిజన్‌ సైన్స్‌ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. గతేడాది విజయవాడలో స్వచ్ఛందంగా కొందరు పౌరులు నగర పరిసరాల్లో 170 పక్షి జాతులను రికార్డు చేశారు. ఈ ఏడాది మళ్లీ శీతాకాలపు పక్షుల గణన నిర్వహిస్తోంది. తిరుపతిలో శీతాకాలపు నీటి పక్షుల గణనను ప్రతి ఏటా చేపడుతోంది. ఈ నెలలో ఏపీలోని పాఠశాలలు, కళాశాలల కోసం యంగ్‌ నేచురలిస్ట్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే మరో సిటిజన్‌ సైన్స్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 

తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాలు అద్భుతమైన జీవవైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనిపై లోతుగా అన్వేషించాల్సిన అవసరం ఉంది. సిటిజన్‌ సైన్స్‌ ప్రాజెక్టుల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం, సామర్థ్యం రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. 
                                      – సుహెల్‌ ఖాదర్, సైంటిస్ట్, బర్డ్‌ కౌంట్‌ ఇండియా, సీజన్‌ వాచ్‌ నిర్వహకుడు 

మానసిక ఆరోగ్యాన్ని పెంచే హాబీలు.. 
సిటిజన్‌ సైన్స్‌ ప్రాజెక్టుల్లో పాల్గొనడం ద్వారా పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. నక్షత్రాలను వీక్షించడం, ప్లానెట్‌ హంట్, బర్డ్‌ వాచింగ్‌ వంటివి మానసిక ఆరోగ్యాన్ని పెంచే హాబీలు. పిల్లలకు క్లాస్‌రూముల్లో దొరకని విజ్ఞానం ఈ పరిశోధనల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. 
                                                  – రాజశేఖర్‌ బండి, సిటిజన్‌ సైంటిస్ట్, తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌

Published date : 17 Nov 2021 12:38PM

Photo Stories