School Annual Inspection : ఈ పాఠశాలలో 14 ఏళ్ల తర్వాత వార్షిక తనిఖీ..!
గండేపల్లి: ప్రతి ఏడాది పాఠశాలలో బోధనా అంశాల తీరును పరిశీలించాల్సిన అధికారులు 14 ఏళ్ల తర్వాత వార్షిక తనిఖీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గండేపల్లి మండలం తాళ్లూరు జెడ్పీ స్కూల్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల నుంచి ఇప్పటి వరకూ సంబంధిత అధికారులు పాఠశాలలను తనిఖీ చేయకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల బోధన, పాఠశాల రూపురేఖలు, పరిశుభ్రత తదితర అంశాలు పరిశీలించాల్సిన అధికారులు ఇక్కడకు ఒక్కసారి కూడా రాకపోవడం శోచనీయం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఇదిలా ఉండగా అక్కడ సమాచారం తెలిపే పాఠశాల బోర్డులో సుమారు 8 నెలల కిందట బదిలీ అయిన విద్యాశాఖాధికారి పేరు ఉండటం గమనార్హం. శుక్రవారం మల్లేపల్లి, తాళ్లూరు జెడ్పీ స్కూళ్లను శుక్రవారం ఇన్‌చార్జి డీవైఈఓ ఎన్.వెంకటేశ్వరరావు వార్షిక తనిఖీ చేశారు. తాళ్లూరు స్కూల్‌కు అధికారులు రాగానే విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీవైఈఓ మాట్లాడుతూ ఏడుగురు ప్యానల్ టీచర్లతో కలసి ఈ తనిఖీలు చేశామన్నారు.
సుమారు 2010 నుంచి వార్షిక తనిఖీలు జరగకపోవడంతో ఇప్పుడు తనిఖీలు నిర్వహించామన్నారు. డీవైఈఓలకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం, ఇన్‌చార్జులు కావడంతో తనిఖీలు జరగలేదన్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి డీవైఈఓగా ఎన్.వెంకటేశ్వరరావు బాధ్యతలు నిర్వహిస్తుండగా, పాఠశాల వద్ద సమాచార బోర్డులో బదిలీపై వెళ్లిన గత డీవైఈఓ డి.సుభద్ర పేరు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ కమిటీలు అయోమయానికి గురవుతున్నారు.