Students Health : విద్యార్థులకు నాణ్యమైన విద్యా, ఆరోగ్యం రెండూ అవసరం..
హుకుంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని అరుకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శనివారం అల్లంపుట్టు గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. మధ్యాహ్నా భోజనాన్ని పరిశీలించారు. భోజనాన్ని రుచిచూసిన అనంతరం నాణ్యతగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
వారం రోజుల నుంచి గుడ్లు పెట్టటం లేదని విద్యార్థులు చెప్పడంతో ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందజేయకపోవడంతోనే విద్యార్థులు అనారోగ్యానికి గురువుతున్నారని చెప్పారు. ఇకపై పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు కాకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం తడిగిరి పంచాయతీ ఉక్కుర్బ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. హెచ్‌ఎం వేణుగోపాల్ తదితరులున్నారు.