Skip to main content

Parliament Introduces Paper Leak Bill-పేపర్‌ లీకేజీలు, రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా

Parliament Introduces Paper Leak Bill    New Delhi Takes Action on Exam Paper Leaks  Government Officials Discussing Exam Irregularities

న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజీ ఉదంతాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో పరీక్షల అక్రమార్కులపై కేంద్రం కఠిన చర్యల కొరడా ఝులిపించింది. పేపర్‌ లీకేజీలు, నకిలీ వెబ్‌సైట్లుసహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ‘ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు–2024’ను తీసుకొచ్చింది.

కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ సోమవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్‌ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఇన్నాళ్లూ ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేకపోవడంతో దీనిని తీసుకొచ్చారు.

బిల్లులో ఏముంది?

  •  ప్రశ్నపత్రం, ప్రశ్నపత్రం కీ లీకేజీకి పాల్పడినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌/ రీసోర్స్‌/ సిస్టమ్‌ను ట్యాంపర్‌ చేసిన వ్యక్తులు/సంస్థలను కఠినంగా శిక్షిస్తారు
  •  నకిలీ వెబ్‌సైట్లు నిర్వహించడం, నకిలీ ఉద్యోగ/ప్రవేశ పరీక్షలు చేపట్టడం, నకిలీ అడ్మిట్‌ కార్డులు, ఆఫర్‌ లెటర్లు ఇవ్వడం, ఒకరి బదులు ఇంకొకరితో ఎగ్జామ్‌ రాయించడం వంటి అవకతవకలు చేసి నగదు వసూళ్లకు పాల్పడితే గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. 
  •   వీటితో ప్రమేయమున్న వ్యక్తులు/సంస్థలు/ఏజెన్సీలు/వ్యాపారసంస్థలు/ సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.1 కోటి జరిమానా విధిస్తారు. ఇంకోసారి ప్రభుత్వం నుంచి సంబంధిత పనులు చేపట్టకుండా నాలుగేళ్లపాటు నిషేధం విధిస్తారు.
  • యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వంటి సంస్థలు నిర్వహించే కంప్యూటర్‌ ఆధారిత ఎగ్జామ్స్‌లో కలగజేసుకున్న అక్రమార్కులను సంబంధిత నియమాల కింద శిక్షిస్తారు. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకూ ఈ బిల్లులోని నియమాలు వర్తిస్తాయి.
  •  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యతలు చూసే కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సిబ్బంది మొత్తం ఈ చట్టపరిధిలోకి వస్తారు.
Published date : 06 Feb 2024 11:34AM

Photo Stories