Skip to main content

TS Gurukulam school: గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థత

TS Gurukulam schools

భువనగిరి క్రైం : భువనగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవడం.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీహెచ్‌ ప్రశాంత్‌(12) అనే విద్యార్థి మృతి చెందడం మరింత ఆందోళనకు గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చి తమ పిల్లల తీసుకెళ్తున్నారు. పరీక్షలు ఉన్నాయని అధికారులు సర్దిచెబుతున్నా వినడం లేదు. బుధవారం ఒక్క రోజే సుమారు 100 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.

పరీక్షలు ఎలా?
1నుంచి 9వ తరగతి వరకు ఈ నెల 15 నుంచి వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. ఈనెల 22వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు రెండు పరీక్షలు పూర్తయ్యాయి. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోతుండడంతో మిగితా పరీక్షలు ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. హాస్టళ్లలో సరైన వసతులు కల్పించాలని, నాణ్యతతో కూడిన భోజనం అందించాలని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు.

చికిత్స పొందుతున్న విద్యార్థులు
కలుషిత ఆహారం తిని 28 మంది విద్యార్థులు అస్వస్తతకు గురికాగా భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ఐదుగురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపులో మరో 8 మంది ఉన్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెపారు.

ఆర్‌సీఓను సస్పెండ్‌ చేయాలి
హాస్టల్‌లో 28 మంది విద్యార్థులు అస్వస్తతకు గురైనా తక్షణమే స్పందించకుండా నిర్లక్ష్యవైఖరి వహించిన ఆర్‌సీఓను సస్పెండ్‌ చేయాలి. హాస్టల్‌లో మౌలిక వసతులు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులకు గురైన అధికారులు పట్టించుకోలేదు. హాస్టళ్లలో విద్యార్థులకు వారానికి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి.
– లావడ్య రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

న్యాయ విచారణకు ఆదేశించాలి
భువనగిరిలోని గురుకుల హాస్టల్‌ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలి. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలి. హాస్టళ్లలో పరిశుభ్రత పాటించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. వార్డెన్‌లు హాస్టళ్లలోనే ఉంటూ విద్యార్థుల బాగోగులను పట్టించుకోవాలి.
– పల్లగొర్ల రాందేవ్‌, బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

పూర్తిస్థాయి విచారణ చేయించాలి
భువనగిరి టౌన్‌ : భువనగిరిలోని గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మృతి చెందిన విద్యార్థి ప్రశాంత్‌ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బుధవారం దళిత, ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్‌ హనుమంతు కే.జెండగేకు వినతిపత్రం అందజేశారు.అధికారుల పర్యవేక్షణ లోపంవల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందజేయాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో భువనగిరి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్‌, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, పీపుల్స్‌ మానిటరింగ్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ సురుపంగ శివలింగం, దళిత ఐక్యవేదిక జిల్లా నాయకులు శ్రీనివాస్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్‌, జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ పాల్గొన్నారు.
 

Published date : 18 Apr 2024 07:33PM

Photo Stories