NMMS Examination: ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష కోసం సెప్టెంబరు 15లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ పి.శ్యాంసుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 విద్యాసంవత్సరానికి సంబంఽధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, వసతి సౌకర్యం లేని మోడల్ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలని, పరీక్ష రుసుము జనరల్, వెనుకబడిన విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 చొప్పున చెల్లించాలన్నారు. ఈ పరీక్షకు వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు ఏచసుకోవాలని, 16వ తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించాలన్నారు. ప్రింటెడ్ నామినల్ రోల్స్, ధ్రువీకరణ పత్రాలు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించేందుకు 19వ తేదీ వరకూ గడువు ఉందన్నారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో డిసెంబర్ 3న పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి మొత్తం 4,087 స్కాలర్‌షిప్‌లను కేటాయించారన్నారు. గత సంవత్సరం జిల్లాలో ఉపకార వేతనాలు సాధించిన విద్యార్థులు 171 మంది ఉన్నారన్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థికి సంవత్సరానికి రూ.12 వేలు వంతున ఉపకార వేతనం అందుతుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కోరారు.