IB Education System in AP: ఐబీ విధానంతో విద్యార్థి సమగ్రాభివృద్ధి
రాష్ట్రంలో ఐబీ విద్యా విధానం అమలుకు అవసరమయ్యే సదుపాయాలు తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ కేంద్రాన్ని ఐబీ ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. డైట్ కళాశాలకు విచ్చేసిన ఐబీ బృంద సభ్యులు కరిక్యూలం స్పెషలిస్ట్ డాక్టర్ అలెన్(ఇంగ్లాండ్), పోస్ట్ ఆథరైజేషన్ పాలసీ అండ్ డిజైన్ సీనియర్ మేనేజర్ వెండీ గ్రీన్(అమెరికా), ఈక్విటీ అండ్ ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ సీనియర్ మేనేజర్ కళా పరుశురామ్‌లకు సాదరంగా ఆహ్వానించారు. తొలుత డైట్ కళాశాలలోని సైన్స్, మ్యాథ్స్ తదితర ల్యాబ్‌లను సందర్శించి విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను తిలకించారు. ఆయా ప్రయోగాల తయారీపై నెలకొన్న ఆసక్తి, ప్రేరణ, ప్రయోగ ఫలితాలు, వాటి ప్రయోజాల గురించి విద్యార్థులు వివరించారు. విద్యార్థుల పనితీరు, యాక్షన్, పరిశోధన ఫలితాలను పరిశీలించారు. వారి నిర్వహించే కార్యక్రమాలను క్షణ్ణంగా తెలుసుకున్నారు. అధ్యాపకులు, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాల అంచనాలపై ఆరా తీశారు. ప్రస్తుతం డైట్ కళాశాలలో అందిస్తున్న విద్యాబోధన విధానం, ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ గురించి తెలుసుకున్నారు. అనంతరం దశల వారీగా ఐబీపై అవగాహన నైపుణ్యం, సామర్థ్యం పెంపుపై శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సదుపాయాల కల్పనపై విషయాలను పరిశీలనకు వచ్చినట్లు బృందం తెలిపింది. బోధనలో సబ్జెక్టుల విభజన కాకుండా బహుళ బోధన విధానం అవలంబించడమే ఐబీ ప్రత్యేకత అని స్పష్టం చేసింది. ఆధునిక, సాంకేతికతను జోడించి ఏకకాలంలో విద్యార్థుల అభిరుచుల్ని అనుగుణంగా బోధన పద్ధతుల్లో మార్పు తెస్తున్నట్లు చెప్పారు. ఇందుకు గురువులు కూడా తమ వృత్తిపరమైన నైపుణ్యాల్ని పెంపొందించుకుని అంతర్జాతీయస్థాయి విద్యా ప్రమాణాలను విద్యార్థులకు అందించేందుకు సిద్ధం కావాలన్నారు. ఐబీ, ఎస్‌సీఈఆర్‌టీ లు సమన్వయంతో అందించే ఈ నవీన విద్యాబోధన తీరును క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్థులకు చేరేలా చేసినప్పుడే విద్యార్థి సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని విజయవంతం చేయగలమన్నారు.