Income Tax : ఈ సెక్షన్ ద్వారా.. మీ పిల్లల స్కూల్ ఫీజులను క్లెయిమ్ చేసుకోండిలా..
ఒక్కొక్కప్పుడు పీఎఫ్ మొత్తం గరిష్ట పరిమితి రూ. 1,50,000 దాటిపోతుంటుంది. పిల్లల స్కూలు ఫీజు విషయంలో ఇద్దరికి మినహాయింపు.. మూడో పిల్లలకు ఫీజు కడితే మినహాయింపు ఇవ్వరు. ఇలాగే అన్ని విషయాల్లో ఆంక్షలు. అయితే, కొన్ని కేసులు చదవండి.
➤ వామనరావు పెద్ద జీతగాడు. కంపల్సరీ పీఎఫ్‌తో సెక్షన్ 80సి పరిమితి దాటిపోతుంది. అందుకని ఇతర సేవింగ్స్ తన పేరు మీద చేయడు. జీవిత బీమా తన తల్లిదండ్రుల అకౌంటులో చేశాడు. ఇల్లు మీద లోన్ తన భార్య సత్యవతి పేరిట తీసుకుని వాయిదా లు చెల్లిస్తాడు. తన భార్య ఇంట్లో తాను అద్దెకు ఉంటున్నట్లు క్లెయిమ్ చేస్తాడు. ఇంట్లో అందరూ 80సి కింద గరిష్ట పరిమితులు క్లెయిమ్ చేస్తున్నారు. సత్యవతి జీతం, ఇంట ద్దె అన్నీ కలిపినా 20 శాతం శ్లాబు దాటలే దు. వామనరావుగారు హమేషా 30 శాతం శ్లాబు తగ్గలేదు. కొంచం ఆలోచిస్తే 10 శాతం పన్ను సేవ్ చేసింది ఈ కుటుంబం.
➤ ఇల్లరికం అని అనుకోకుండా.. ఇంట్లో పూర్తిగా సెటిల్ అయిపోయాడు అల్లుడుగారు అరవిందరావు. మామగారికి అద్దె ఇచ్చినట్లు రాస్తాడు. ఇస్తాడో .. ఇవ్వడో ఎవరికీ తెలీదు. మావగారు పెన్షనర్.. పన్ను పరిధిలోకి రారు. ఇటువంటి అల్లుళ్లు, కొడుకులు ఎంత మందో! కోడళ్లు .. కూతుర్లు ఎంత మందో! అరవిందరావు గారు చేసే ఇతర వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ చదువుకోని భార్య సరస్వతి పేరు మీద చేస్తారు. 80సి కింద అర్హత ఉన్న సేవింగ్స్ ఆవిడ పేరు మీదే.
➤ కుటుంబరావుగారికి, సంతానలక్ష్మి గారికి ఇంటి ఆనవాయితీ ప్రకారం కాబోలు రెండుసార్లు కవలలు. మొత్తం నలుగురు పిల్లలు. నలుగురినీ చదివించారు. ఇద్దరూ కలిసి వ్యాపారంలో బాగా రాణించారు. నలుగురి పిల్లల విషయంలో చెల్లించిన స్కూలు ఫీజులు ఒక్కొక్కరు .. ఇద్దరి ఇద్దరి ఫీజులను క్లెయిమ్ చేసేవారు.
➤ ఇద్దరు ఆడపిల్లల తర్వాత అబ్బాయి కోసం మూడో కాన్పుకి వెళ్లింది కాంతమ్మ. బాబు పుట్టాడు. ముగ్గుర్నీ చదివించింది ఆ జంట. ఎక్కువ ఆదాయం ఉన్న తండ్రి.. ఇద్దరు పిల్లల చదువుల ఫీజులను క్లెయిమ్ చేయగా.. మూడో సంతానం స్కూలు ఫీజుని కాంతమ్మగారు క్లెయిమ్ చేశారు.
➤ ఇలా అవకాశం ఉన్నతవరకూ చట్టపరిధి దాటకుండా మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు.