Skip to main content

Government Teachers: సర్కార్‌ బడుల్లో ఉపాధ్యాయుల కొరత.. కొన్నిచోట్ల అవసరానికి మించి సిబ్బంది

Government Teachers

జహీరాబాద్‌: ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పంతుళ్లు లేరు. దీంతో విద్యాబోధన సక్రమంగా సాగక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అవసరానికి మించి ఉపాధ్యాయులు ఉన్నారు.

ఇదీ పరిస్థితి..
జహీరాబాద్‌ మండలం అర్జున్‌ నాయక్‌ తండాలోని ప్రాథమిక పాఠశాలలో 109 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నాడు. అలాగే రంజోల్‌లోని ప్రాథమిక పాఠశాలలో 102 మంది విద్యార్థులు ఉండగా అక్కడ ఇద్దరు టీచర్లే ఉన్నారు. ఉర్దూ మీడియంలో 69 మంది విద్యార్థులుండగా అక్కడా ఇద్దరే కొనసాగుతున్నారు.

Good News For Bank Employees: ఇకపై వారానికి ఐదు రోజులే పని దినాలు!.. త్వరలోనే ఆమోదం

కొత్తూర్‌(బి)లో ప్రాథమికోన్నత పాఠశాలలో 42 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు విద్యాబోధన చేస్తున్నాడు. అయితే ప్రాథమిక పాఠశాలలో 43 మంది విద్యార్థులే ఉన్నా నలుగురు ఉపాధ్యాయులున్నారు. హుగ్గెలి ప్రాథమిక పాఠశాలలో 57 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులున్నారు. హుగ్గెల్లి తండాలో 13 మంది విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. యూపీఎస్‌ నంబర్‌ 1 పాఠశాలలో 109 మంది విద్యార్థులుంటే ఏకంగా 8 మంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు.


ఇక్కడ ఇలా..
కాశీంపూర్‌లో 9తరగతుల్లో 190 మంది విద్యార్థులుండగా, అక్కడ కేవలం ఐదుగురు ఉపాధ్యాయులే ఉన్నారు. మధులై తండాలో కేవలం 18 మంది విద్యార్థులుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. రంజోల్‌లోని ప్రాథమిక పాఠశాలలో 102 మంది విద్యార్థులుంటే కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. లచ్చానాయక్‌ తండాలో 18 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు.

కొత్తవారు రాకపోవడంతో..
ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా జహీరాబాద్‌ మండలం నుంచి 117 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో బదిలీపై రావాల్సిన వారిలో కొందరే రావడంతో పాత వారిని రిలీవ్‌ చేయలేదు. కేవలం 11 మంది ఉపాధ్యాయులను మాత్రమే రిలీవ్‌ చేశారు.

Anganwadi Schools: ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా అంగన్‌వాడీలు.. కాన్వెంట్‌ స్కూళ్లకు ధీటుగా

మొగుడంపల్లి మండలం నుంచి 51 మంది ఉపాధ్యాయులకు బదిలీలు అయ్యాయి. వీరిలో 19 మందిని మాత్రమే రిలీవ్‌ చేశారు. కొత్తవారు విధుల్లో చేరాకే బదిలీ చేయనున్నట్లు ఎంపీఓ బస్వరాజ్‌ పేర్కొన్నారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా పాత వారిని రిలీవ్‌ చేయలేదన్నారు.

విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలల్లో అవసరం మేరకు ఉపాధ్యాయులను నియమించేలా చూస్తామన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయులు అధికంగా ఉంటే వారిని అవసరం ఉన్న చోట ఉపయోగించుకునే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
 

Published date : 15 Jul 2024 04:58PM

Photo Stories