Fee Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మంజూరు
విశాఖ: డిగ్రీ, డిప్లమో, ఇతర ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు 2019–20 సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న జగనన్న విద్యా దీవెన(ఫీజు రీయింబర్స్‌మెంట్) నిధులు గురువారం మంజూరయ్యాయి. వీటిని విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.రామారావు తెలిపారు.
కోవిడ్ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ.. పేద విద్యార్థులకు మేలు చేయాలనే సంకల్పంతో 2019–20 విద్యా సంవత్సరానికి 2022 డిసెంబర్ 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి విద్యా దీవెన నిధులు విడుదల చేశారు. అయితే అనివార్య కారణాలతో కొంతమంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆ డబ్బులు జమ కాలేదు.
నిధుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్
విద్యార్థులు, అదే విధంగా కాలేజీల నిర్వాహకులకు భారం కాకూదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి పెండింగ్ జేవీడీ నిధులు విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో గురువారం విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆ డబ్బులు జమ అయ్యాయి. సచివాలయ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు దీనిపై దృష్టి సారించి.. ఫీజులను కళాశాలలకు చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డీడీ ఆదేశించారు.
ఇప్పటికే కాలేజీలకు ఫీజు చెల్లించినట్‌లైతే, దానికి సంబంధించిన రసీదును నవశకం పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. సచివాలయ స్థాయిలో సమగ్ర పరిశీలన చేసి, తగిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు.