Skip to main content

Contract Lecturers: కాంట్రాక్టు లెక్చరర్లను పక్కన పెట్టేసిన కూటమి ప్రభుత్వం, కొత్త నిబంధనలతో..

‘కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించి వారి సర్వీసును క్రమబద్దీకరిస్తాం. ఈ బాధ్యత నేను తీసుకుంటున్నాను’.. ఏప్రిల్‌ 28న కోడుమూరు నియోజకవర్గం గూడూరులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు­నాయుడు ఇచ్చిన హామీ ఇది. కానీ.. ఇటీవల విద్యాశాఖ మంత్రిని కాంట్రాక్టు లెక్చరర్లు కలిసి ఈ హామీని గుర్తుచేస్తే క్రమబద్దీకరణ కుదరదు పొమ్మన్నారు.  జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ 2017 డిసెంబర్‌లో కాంట్రాక్టు లెక్చరర్లతో ముఖాముఖి సమావేశమై ‘ప్రభుత్వం మిమ్మల్ని వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్‌ చేసేందుకు పోరాడుతా’.. అని హామీ ఇచ్చారు. ఇటీవల కాంట్రాక్టు లెక్చరర్లు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తే ముఖం కూడా చూపించలేదు. 
Contract Lecturers In Andhra Pradesh
Contract Lecturers In Andhra Pradesh

సాక్షి, అమరావతి : కాంట్రాక్టు లెక్చరర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఝులక్‌ ఇచ్చింది. ప్రభుత్వ సర్వీసుల్లో కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టింది తానేనని, వారి సర్వీసును క్రమబద్దీకరిస్తామని మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఆ అంశాన్నే పక్కన పెట్టేశారు. అంతేకాదు.. ఈ అంశం తమ మేనిఫెస్టోలో లేదని చెప్పడంతో కాంట్రాక్టు లెక్చరర్లు కంగుతిన్నారు. 

2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు దాదాపు 7 వేల మందిని డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా తీసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2021లో తెలంగాణ ప్రభు­త్వం అక్కడి కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో కూడా క్రమబద్దీకరించేందుకు గతేడాది అక్టోబరులో నాటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. 


దీని ప్రకారం.. 2014 జూన్‌­కు ముందు విధుల్లో చేరిన 10,117 మంది అర్హులను గుర్తించి క్రమబద్దీకరించాలని జీఓ–114 ద్వారా మార్గ­దర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. గతే­డాది వైద్య, అటవీ, గిరిజన సంక్షేమ తదిత­ర శాఖ­ల్లో పనిచేస్తున్న 3 వేల మందిని రెగ్యులరైజ్‌ చేయ­గా, మిగిలిన వారి వివరాలు తీసుకునేసరికి ఎ­న్నికల కోడ్‌ అమలుతో ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది.  

Elon Musk About College Education: ''జీవితంలో సక్సెస్‌ అయ్యేందుకు కాలేజీ డిగ్రీ అవసరం లేదు.. ఆ టైం అంతా వృథా''

ఆందోళనలో ఐదువేల మంది కాంట్రాక్టు లెక్చరర్లు.. 

ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్‌ కళాశాలలో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లే ఉన్నారు. వీరిలో ఇంటర్మీడియట్‌ విద్యలో 3,618 మంది, డిగ్రీ కాలేజీల్లో 695 మంది, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 309 మంది పనిచేస్తున్నారు. 

2023 అక్టోబరులో చేసిన చట్టం ప్రకారం వీరినీ క్రమబద్ధీకరించేందుకు వారి వివరాలు, సర్వీసు, విద్యార్హతల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తిచేసి ఫైల్‌ను న్యాయ నిపుణుల సలహా కోసం పంపారు. ఇంతలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. క్రమబద్దీకరణ కోసం అర్హులుగా గుర్తించిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో కొందరు మాత్రమే రెగ్యులర్‌ కావడంతో మిగిలిన వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.  

పెర్ఫార్మెన్స్‌ పేరుతో కొత్త నిబంధన.. 

ఇదిలా ఉంటే.. ఏటా కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యువల్‌ను జూన్‌లో ఇవ్వాల్సి ఉండగా, ఈసారి మూడు నెలలు ఆలస్యంగా రెన్యువల్‌ చేశారు. అందులోనూ 3,618 మందిలో 558 మంది పనితీరు సరిగ్గాలేదని పక్కనపెట్టారు. పైగా.. ఈ విద్యా సంవత్సరం ఒప్పందంలో ‘పెర్ఫార్మెన్స్‌’ అనే కొత్త నిబంధనను తీసుకురావడం గమనార్హం. 

Diploma Courses: పనిచేస్తూనే.. సాయంత్రాలు చదువుకోవచ్చు, డిప్లొమా కోర్సులకు చివరి తేదీ ఇదే

అంటే వచ్చే ఏడాది ఈ వంకతో ఎంతమందిని తొలగిస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. త్వరలో డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న 350 మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. కానీ, ఆ మేరకు కాంట్రాక్టు లెక్చరర్లను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంది.

మా గోడు ఆలకించండి

తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ పాదగయలో హోమం పిఠాపురం: ఎన్నికల ముందు తమకిచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురంలో వినూత్న నిరసన నిర్వహించారు. ఎన్నో రోజులుగా తమ గోడు వినిపించుకోండంటూ ప్రభుత్వం వద్ద వాపో­తున్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో దేవుడి వద్ద తమ గోడు తెలుపుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు బీఎస్‌ఆర్‌ శర్మ తెలిపారు. 

ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ తమ సమస్యలను పట్టించుకోవాలనే..ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో నిరసన చేపట్టామన్నారు. ఆదివారం రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో నిరసనలు నిర్వహించి వచ్చే ఆదివారం విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి, ఆపై ఆదివారం సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంలో వినూత్న నిరసనలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఆదివారం పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరస్వామి, పురూహూతికా అమ్మవారి సన్నిధిలో పొర్లు దండాలు పెట్టి, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి దేవుడా! ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి, మా బాధలు వినేలా చేయి అంటూ తమ గోడును విన్నవించుకున్నారు.  

Published date : 22 Oct 2024 09:51AM

Photo Stories