Skip to main content

Education System : ప్రస్తుతం చ‌దివే.. చ‌దువుకు.. చేసే ఉద్యోగానికి సంబంధం ఉందా.. లేదా..?

ప్రస్తుతం చదివే చదువుకు, చేసే పనికి ఏమైనా సంబంధం ఉంటోందా? ఏదో ఒక సబ్జెక్ట్‌లో బీటెక్‌ చదవడం.. ఏ మాత్రం సంబంధం లేని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరిపోవడం! ఉద్యోగంలో చేరాక తగిన నైపుణ్యం లేక తడబడుతూ భవిష్యత్‌ను అంధకారం చేసుకోవడం!!
Indian Education System
Education System

ఇక్కడ తప్పు ఎవరిది..?

Education

ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జరుగుతున్నది ఇదే. ఇక్కడ తప్పు ఎవరిది..? చదివిన చదువుదా, ఉద్యోగాలిస్తున్న కంపెనీలదా అని తరచి చూస్తే.. సమస్య అంతా దశాబ్దాల పాటు నామమాత్రపు మార్పులతో నెట్టుకొస్తున్న విద్యా వ్యవస్థలదే. మరి ఏం చేస్తే బాగుంటుందంటే.. తరగతులను తిరగేయాలని, సిలబస్‌లో సమూలంగా మార్పులు రావాలని అంటున్నారు ప్రొఫెసర్‌ సంజయ్‌శర్మ. ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ అయిన సంజయ్‌శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌’ పేరుతో ఈ ఏడాది సెపె్టంబర్‌లో ఓ విధాన పత్రాన్ని విడుదల చేశారు. అంతేకాదు ఉద్యోగార్హతలు, విద్యా (సిలబస్‌) విధానాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఆయన ఓ పోరాటమే ప్రారంభించారు. 

ఉన్నత విద్యకు.. ఉద్యోగ నైపుణ్యానికి మధ్య..
ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య అంతరం పెరిగిపోతూనే ఉంది. డిగ్రీ లేదా పీజీ పట్టా చేత పట్టుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం, అక్కడ చేయాల్సిన పనులను సీనియర్లు చెబితే నేర్చుకోవడం, తప్పులు చేస్తూ దిద్దుకుంటూ ముందుకు వెళ్లడంతోనే సరిపోతోంది. ‘‘ప్రపంచంలో 80శాతం మంది ఉద్యోగులది ఇదే పరిస్థితి. అందువల్ల అన్నిరంగాల్లో పరిశోధనలు కుంటుపడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాలతో కాలం వెళ్లదీస్తున్నంత కాలం పరిశోధనల్లో ముందడుగు ఉండదు’’ అని యాపిల్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన, మాజీ సీఈవో స్టీవ్‌ జాబ్స్‌ గతంలో పలు సందర్భాలలో ఎత్తిచూపారు. 

భారమవుతున్న ఉన్నత విద్య  :  

New Education System

ఇప్పుడు ఉన్నత విద్య మునుపటిలా చౌక కాదు. బ్యాంకులిచ్చే రుణాలతో చదువుకున్నవారు అప్పులు తీర్చడంతో జీవితాన్ని మొదలుపెడతారు. అమెరికాలో ఉన్నతవిద్యకు అయ్యే ఖర్చు వార్షిక ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరిగిపోతోందని అధ్యక్షుడు బైడెన్‌ స్వయంగా చెప్పారు. ఈ మధ్యే ఆయన కొన్ని షరతులతో కొందరు విద్యార్థులకు ఫీజు బకాయిలు రద్దు చేశారు. అయినా సరే అమెరికాలో ఇప్పుడు విద్యార్థులపై ఉన్న భారం లక్షా డెబై ఐదు వేల కోట్ల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే సుమారు కోటిన్నర కోట్లు. చాలా దేశాల్లో ఉన్నత విద్యకు సబ్సిడీలు ఇస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తిలో సగటున 2.5 శాతం వరకూ విద్యకు ఖర్చు పెడుతున్నారు. ఇంతఖర్చు చేస్తున్నా ఉద్యోగాలకు తగ్గట్టుగా విద్యను రూపొందించడంపై దృష్టి పెట్టడం లేదు.

పలు సందర్భాల్లో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి..
దీనితో డిగ్రీ/ పీజీ పట్టా పుచ్చుకుని ఉద్యోగాల్లో చేరేవారికి నైపుణ్యాలు ఉండటం లేదని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పలు సందర్భాల్లో ఉటంకించారు. ఈ క్రమంలోనే కంపెనీలు కాలేజీల డిగ్రీలను పక్కనపెట్టేసి ఉద్యోగులకు తమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలను తగ్గిస్తున్నాయి. అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ అర్హత అవసరమైన ఉద్యోగాల సంఖ్య 45 శాతం వరకూ తగ్గిపోయినట్టు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఈ సమస్యను గుర్తించడం లేదు. ఎంఐటీ ప్రొఫెసర్‌ సంజయ్‌ శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌’ పేరిట చేసిన ప్రతిపాదనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 

ఇలా కొనసాగిస్తూనే.. 

new education

‘న్యూఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌’ ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతి ప్రస్తుత ఉన్నత విద్య విధానంలోని మేలైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. సామాజిక, భావోద్వేగ అభివృద్ధితోపాటు బతికేందుకు అనువైన సంపూర్ణమైన చదువు ప్రస్తుత విద్యావిధానంలోని సావకాశం. ఎట్టి పరిస్థితుల్లో వీటిని కాపాడుకోవాల్సిందే అంటారు సంజయ్‌ శర్మ. తాము వీటికి మరిన్ని అంశాలను జోడించి కంప్యూటర్‌ సైన్స్, బిజినెస్‌ రంగాలకు ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తున్నామని ఆయన ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’ కోసం రాసిన ఒక వ్యాసంలో తెలిపారు.

ఈ కొత్త విధానంలో బోధన పద్ధతులతోపాటు నిర్మాణాత్మక బోధన అంశాల్లోనూ మార్పులు చేస్తున్నామన్నారు. మొత్తమ్మీద చూస్తే ఈ కొత్త విధానంలో ‘ఫ్లిప్డ్‌ క్లాస్‌రూమ్‌’ అనేది ఒక అంశం. ప్రస్తుతం తరగతి గదిలో కేవలం ప్రొఫెసర్లు చెప్పే పాఠాలు (సిలబస్‌కు లోబడి) మాత్రమే ఉంటున్నాయి. మొత్తం కోర్సు అవధిలో 95 శాతం ఈ పాఠాలే. మిగతా ఐదు శాతం కంపెనీల్లో ఇంటర్న్‌ప్‌లు లేదా ప్రాక్టికల్స్‌ ఉంటాయి. 


ప్ర‌స్తుతం పాఠాలన్నీ..

education news

ఫ్లిప్డ్‌ క్లాస్‌రూమ్‌ ప్రస్తుత విధానానికి భిన్నంగా ఉంటుంది. పాఠాలన్నీ డిజిటల్‌ రూపంలో ఉంటాయి. విద్యార్థి తనకు కావాల్సిన టైమ్‌లో వాటిని చూసుకోవచ్చు. వాస్తవంగా తరగతి గదిలో ఉద్యోగ సంబంధిత అంశాలపై చర్చలు జరుగుతాయి. నైపుణ్యాల శిక్షణ ఇస్తారు. న్యూఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ కోర్సు కూడా నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో సెమిస్టర్లకు బదులు 11 ట్రైమిస్టర్లు (త్రైమాసికాలు) ఉంటాయి. ఇందులో నాలుగింటిలో పరిశ్రమకు సంబంధించిన అంశాలను విద్యార్థికి అందజేస్తారు. వీటిని కో–ఆప్స్‌ అని పిలుస్తున్నారు. పరిశోధనశాలలు, మ్యూజియంలు, ఇతర విశ్వవిద్యాలయాలు, ఐఎంఎఫ్, యునైటెడ్‌ నేషన్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ కో–ఆప్స్‌లో భాగంగా ఉంటాయి.

కంపెనీలకు తమకు కావాల్సిన.. 
కంపెనీల ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు తాత్కాలిక విరామమిచ్చి విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ భాగస్వామ్యం వల్ల విద్యార్థికి చాలా లాభాలు ఉంటాయి. పైగా కోర్సు సమయంలోనే విద్యార్థి కొంత ఆదాయం పొందే అవకాశమూ ఏర్పడుతుంది. కో–ఆప్స్‌ సమయంలో కంపెనీలు విద్యార్థులకు రెమ్యూనరేషన్‌ చెల్లిస్తాయి. కంపెనీలకు తమకు కావాల్సిన నైపుణ్యాలతో ఉద్యోగార్థులు లభిస్తారు.

ఈ కొత్త డిగ్రీల్లో..
న్యూఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ప్రతిపాదిస్తున్న కొత్త డిగ్రీలో ఐదారు అంశాలపై క్రెడిట్స్‌ ఉంటాయి. ఒక్కో అంశానికీ ప్రత్యేకంగా విలువ ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులో లీనియర్‌ ఆల్జీబ్రా, కంప్యూటేషన్, మెషీన్‌ లెర్నింగ్‌లతోపాటు నైతిక విలువలు, సామాజిక శ్రాస్తాలు కలగలిపి బోధిస్తారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేయకపోయినా.. వారు సాధించిన క్రెడిట్లకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కోర్సు కాలం పూర్తయిపోయినా మిగిలిన క్రెడిట్లను ఎప్పుడైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 

ఇలా చదువుతూనే.. 
నిజానికి న్యూఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ప్రతిపాదిస్తున్న కొత్త విద్యావిధానం ఇతర రూపాల్లో కొన్నిచోట్ల అమల్లో ఉంది. ఉదాహరణకు జర్మనీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చదివేవారు కాలేజీలో సగం సమయం మాత్రమే ఉంటారు. తర్వాత సంబంధిత పరిశ్రమలో వారికి ఒకేషనల్‌ అప్రెంటిస్‌íÙప్‌ పేరుతో శిక్షణ అందిస్తారు. అది పూర్తయిన తరువాతే డిగ్రీ లభిస్తుంది. భారత్‌ విషయానికి వస్తే ఆతిథ్య రంగంలో ఈ రకమైన విధానం అమల్లో ఉంది. ఐహెచ్‌ఎస్‌ వంటి సంస్థల్లో కోర్సులు చేసేటప్పుడు కోర్సులో గణనీయమైన సమయం హోటల్స్, రెస్టారెంట్లలో ప్రాక్టికల్‌ శిక్షణ ఉంటుంది. అమెరికాలోని నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థల్లోనూ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ఈ రకమైన పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు శర్మ ప్రతిపాదన అమల్లోకి వస్తే చదవడంతో పాటు నేర్చుకోవాలన్న తపన ఉన్న వారికి ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. 

దేశంలో పది మందిలో ఒకరికే..
భారతదేశంలో చదువులకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య సంబంధమే లేదని చెప్పాలి. ప్రతి పది మంది పట్టభద్రుల్లో ఒకరికి, ప్రతి ఐదుగురు ఇంజనీర్లలో ఒకరికి, నలుగురు మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లలో ఒకరికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. దేశంలో ఏటా సుమారు కోటీ 30లక్షల మంది ఉద్యోగ మార్కెట్లోకి అడుగుపెడుతుంటే.. వీరిలో అత్యధికులకు నైపుణ్యాలు ఉండటం లేదు. ఎప్పుడో కాలం చెల్లిననాటి ఉద్యోగాలకు తగ్గట్టు విద్యాబోధన ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఐఐటీ ఖరగ్‌పూర్‌ డీన్‌ జయంత ముఖోపాధ్యాయ స్పష్టం చేశారు.

నైపుణ్యాల ఆవశ్యకత గురించి ఐక్యరాజ్యసమితి దాదాపు దశాబ్దకాలంగా చెప్తున్నా భారత్‌లో ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు నామమాత్రమే. 2020 నాటి వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నివేదిక కూడా డేటాసైన్స్, బిగ్‌ డేటా, మెషీన్‌ లెరి్నంగ్, ఏఐ, వెబ్‌ డెవలప్‌మెంట్, ప్రోగ్రామింగ్‌ వంటి రేపటి తరం నైపుణ్యాలను ఉద్యోగార్థులకు అందించాలని సూచించడం గమనార్హం. రెండేళ్ల క్రితం విడుదలైన జాతీయ విద్యా విధానం కూడా పిల్లలకు ఆరో తరగతి నుంచే వృత్తి నైపుణ్యాలను అందించాలని.. ఇంటర్న్‌షిప్స్‌ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను ముందుగానే అందించాలని సిఫార్సు చేసింది.

Published date : 06 Dec 2022 07:12PM

Photo Stories