Students: ‘పరీక్షలంటే భయంవద్దు’
Sakshi Education
వనపర్తి: విద్యార్థులు పరీక్షలంటే భయపడొద్దని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ చెప్పారు. గురువారం స్థానిక ఎం.బీ గార్డెన్స్‌లో ఆయా సంక్షేమ హాస్టల్స్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రేరణ, పునఃశ్చరణ తరగతుల కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు మానసికంగా ఒత్తిడిని తగ్గించుకుని, వార్షిక పరీక్షలు రాయాలన్నారు. దీంతో ఉత్తమ మార్కులు సాధించవచ్చన్నారు. విద్యార్థులందరూ పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అందుకు తగిన సూచనలు సలహాలు ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సుబ్బారెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి నుషిత, డీటీడీఓ శ్రీనివాసులు, ఇంపాక్ట్ రవీంద్ర ధీర, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, నాగరాజు, గోవర్ధన్, మధుసూదన్, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Published date : 24 Feb 2024 12:35PM