Vice Chancellor: ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగా విద్యలో మార్పులు అనివార్యం
ఎచ్చెర్ల క్యాంపస్: ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగా విద్యలో మార్పులు అనివార్యమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీ సెమినార్ హాల్‌లో గురువారం పోస్టు గ్రాడ్యుయేషన్, ఒకేషనల్ జాయింట్ బోర్డాఫ్ స్టడీస్ చైర్మన్లు, సభ్యుల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన వర్సిటీ ప్రగతిని పవర్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి కేంద్ర బిందువుగా విద్య కొనసాగాలని చెప్పారు. బోధన పద్ధతుల్లో, ప్రస్తుతం ఉన్న సిలబస్‌ల్లో మార్పులు తప్పనిసరని చెప్పారు. నూతన జాతీయ విద్యా విధానం–2020 అమలు నేపథ్యంలో, 2030 తర్వాత అనేక మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు.
చదవండి: Minister Adimulapu Suresh: విద్యా వ్యవస్థకే 15 శాతం బడ్జెట్
వర్సిటీలో నూతన విద్యా విధానం సూచనలు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. నాలుగేళ్ల సమీకృత ఉపాధ్యాయ విద్యా డిగ్రీ కోర్సులు, డిగ్రీల్లో హానర్స్, పరిశోధన నాలుగేళ్ల డిగ్రీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నాగార్జునా అగ్రికెం, అరబిందో, కృష్ణపట్నం పోర్టు వంటి సంస్థలు సహకారంలో డిప్లమా, సర్టిఫికెట్, పీజీ డిప్లమా కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్సిటీ ఉన్న ఇంజినీరింగ్, ఆర్ట్సు, సైన్స్, కామర్స్, న్యాయ, ఎడ్యుకేషన్ ప్రతి కళాశాలలో విద్య బలోపేతమే లక్ష్యమన్నారు. పీజీలో సిలబస్, పరీక్ష విధానంలో మార్పులు అమలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపాళ్లు బిడ్డిక అడ్డయ్య, ఎస్.ఉదయ్‌భాస్కర్, చింతాడ రాజశేఖర్‌రావు, బోర్డాఫ్ స్టడీస్ చైర్మన్లు ఘంటా రమేష్, ఎస్.పద్మనాభయ్య, బి.ఎన్. పండా, ఎంవీ బసవేశ్వరరావు, ప్రసాద్‌బాబు, పి.ఎన్.అవధాని, కె.రమేష్‌బాబు పాల్గొన్నారు.