Collector Pravinya: క్రమశిక్షణతోనే ఉజ్వల భవిష్యత్
ఖిలా వరంగల్: విద్యార్థినులు లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్స్ పార్కును నెక్కొండ, పర్వతగిరి మండలాల కేజీబీవీ విద్యార్థినులు సందర్శించారు.
ర్యాపేలింగ్, ట్రీ ల్యాడరింగ్ తదితర సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. కేజీబీవీల్లో చక్కటి విద్య ఉంటుందని, ప్రతి విద్యార్థిని లక్ష్యంతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. విద్యార్థినులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు కలెక్టర్ ప్రావీణ్య ప్రశంసపత్రాలు ప్రదానం చేశారు. డీఈఓ వాసంతి, మండల తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు, సీడీపీఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.