Canada: బహిష్కరణ వేటును నిలిపివేస్తూ కెనడా ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ: కెనడాలోని భారత విద్యార్థులకు గొప్ప ఉపశమనం లభించింది. విద్యాభ్యాసం నిమిత్తం కెనడా వచ్చిన భారతీయ విద్యార్ధులు ఫేక్ ఆఫర్ లెటర్లతో వచ్చారని నిర్ధారించి కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ బహిష్కరణ వేటు వేసినా విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రంజీత్ సహానీ చొరవతో స్పందించిన CBSA మానవతాదృక్పథంతో స్పందించి బహిష్కరణ ప్రక్రియను నిలిపివేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రంజీత్ సహానీ, భారత హై కమిషన్ సహాయంతో బహిష్కరణ వేటుకు గురైన విద్యార్థులకు న్యాయం చేయమని కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్ధించగా అందుకు సానుకూలంగా స్పందిస్తూ 700 విద్యార్ధులపై వారు విధించిన వేటును నిలిపివేశారు. ఈ మేరకు ప్రపంచ పంజాబీ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు కూడా అయిన ఎంపీ విక్రంజీత్ సహానీ కెనడా ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.
ఎంపీ మాట్లాడుతూ...
విద్యార్థుల భవిష్యత్తుపై మేము కెనడా ప్రభుత్వాన్ని కోరిన ప్రకారం వారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషకరం. ఈ విద్యార్థుల తప్పేమీ లేదని ఎవరో చేసిన తప్పుకు వీరిని శిక్షించడం సరికాదని వారికి వివరించడం జరిగింది. బ్రిజేష్ మిశ్రా అని జలంధర్ కు చెందిన ఒక ఏజెంట్ తన స్వార్ధం కోసం ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫేక్ రసీదులు ఇచ్చారు. దానికి విద్యార్థులు బలయ్యారు.
మీరే అనుమతించారు..
ఎటువంటి తనిఖీలు చేయకుండానే కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా వారిని అనుమతించారని వారికి జరిగింది వివరించిన తర్వాత వారు పరిస్థితిని అర్ధం చేసుకుని మొత్తం 700 విద్యార్ధులపై వేసిన వేటును నిలిపివేశారు. ఉదార స్వభావంతోనూ మానవతా దృక్పథంతోనూ స్పందించిన కెనడా ఎంపీ సీన్ ఫ్రేజర్ గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.