Vedic education: వేద విద్యకు పూర్వవైభవం
మంథని: వేదవిద్యకు పూర్వవైభవం తీసుకొస్తామని, ఇందులో భాగంగానే మంత్రపురిలో తెలంగాణస్థాయి వేదవిద్య మహాసభలు నిర్వహిస్తున్నామని జనార్దనానంద సరస్వతీస్వామి సంస్కృతి ట్రస్టు చైర్మన్ తూములూరి శాయినాథశర్మ తెలిపారు. స్థానిక నృసింహ శివకిరణ్ గార్డెన్‌లో బుధవారం ప్రారంభమైన సభల్లో సేవాసదన్ వ్యవస్థాపకుడు గట్టు నారాయణ గురూజీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక ఘనాపాఠీలతో తెలంగాణలో వేదవిద్య ఫరిడవిల్లేదని, వేదాన్ని పరిరక్షించడానికి జనార్దనాసంద సరస్వతీస్వామి 2002 నుంచి కృషి చేస్తున్నారన్నారు. వేదవిద్యార్థులు రాజమండ్రికి వెళ్లి పరీక్షలు రాయాల్సి వచ్చేదని, కానీ, తెలంగాణలో తమ ట్రస్టు ద్వారా పరీక్షలకు అవకాశం కల్పించి, ప్రభుత్వ అనుమతితో సర్టిఫికెట్లు అందిస్తున్నామని అన్నారు. ఈమేరకు 23 జిల్లాల్లోని వేదపాఠశాలలకు చెంది 500 మంది విద్యార్థులతో మంథనిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారి మంథనిలో 500మందితో వేదమహా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేదం అన్నింటికీ మూలమని, దానిని సంరక్షించుకోవాల్సి బాధ్యత ప్రతీభారత పౌరుడిపై ఉందన్నారు. జిల్లాకు వంద మంది వేదపండితులను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. శనివారం వెయ్యి మందితో శోభాయాత్ర నిర్వహిస్తామని అన్నారు. ట్రస్టు కార్యదర్శి బ్రహ్మనందశర్మ, సేవా సదన్ అధ్యక్షుడు హరిబాబు, సభ్యులు శశిభూషణ్ కాచే, నల్లగొండ హరి, దుద్దిళ్ల గణపతి పాల్గొన్నారు.