Andhra Pradesh : పుస్తకాలన్నీ సిద్ధం.. ప్రైవేట్ స్కూళ్లకు కూడా..
ప్రభుత్వ పాఠశాలలను రూ.వేల కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దడంతోపాటు చరిత్రలో తొలిసారిగా పాఠ్య పుస్తకాలను స్కూళ్లు ప్రారంభానికి ముందే సిద్ధం చేసి విద్యా కానుకతోపాటు అందచేస్తోంది.
పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా పుస్తకాలను ప్రభుత్వమే ముద్రించి దశలవారీగా అందిస్తూ పిల్లలకు మోత బరువు నుంచి, తల్లిదండ్రులకు ధరల భారం నుంచి భారీ ఊరట కల్పించింది. గత సర్కారు హయాంలో విద్యా సంవత్సరం సగం గడిచినా పుస్తకాలు రాకపోవడం, అందరికీ ఒకేసారి ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి రాగానే పిల్లల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రతి అంశాన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
విద్యా కానుక ద్వారా అందించే వస్తువుల నాణ్యత, పాఠ్య ప్రణాళిక, పుస్తకాలను నేరుగా పరిశీలిస్తూ పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ద్విభాషా (బై లింగ్యువల్) పాఠ్య పుస్తకాల కారణంగా కొంత మేర పరిమాణం పెరిగినట్లు గుర్తించడంతో పిల్లలకు మోత బరువు లేకుండా ముద్రించిన పుస్తకాలను రెండు దశల్లో అందించాలని ఆదేశించారు.
అకడమిక్ క్యాలెండర్‌లో..
ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లు తెరవగానే మొదటి దశ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన అధికారులు 2, 3వ దశల పుస్తకాలను సైతం ఇప్పటికే సిద్ధం చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి 2వ దశ పాఠ్య ప్రణాళిక తరగతులు ప్రారంభం కానుండగా నెల రోజులు ముందుగానే అక్టోబర్ 30 నాటికే విద్యాశాఖ పుస్తకాలను తయారుగా ఉంచడం గమనార్హం. 2, 3 దశల పుస్తకాలను ఒకే షెడ్యూల్‌లో విద్యార్ధులకు అందచేసేలా చర్యలు చేపట్టింది. మొదటి దశలో 3,45,29,970 పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందచేశారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పుస్తకాలను సిద్ధం చేశారు. రెండు, మూడు దశల కోసం 1,39,38,034 పుస్తకాలను ముద్రించి అక్టోబర్ 15 – 31వ తేదీల మధ్య జిల్లాలకు తరలించారు. నవంబర్ 10 లోపు మండల పాయింట్లకు, అక్కడి నుంచి స్కూళ్లకు చేరవేసి విద్యార్ధులకు అందించేలా షెడ్యూల్ ప్రకటించి ఏర్పాట్లు చేపట్టారు.
ప్రైవేట్ స్కూళ్లకు కూడా..
మొదటి దశలో ప్రైవేట్ స్కూళ్లకు 1,39,79,221 పుస్తకాలను విద్యాశాఖ అందించింది. వీటిలో 1,05,82,332 పుస్తకాలను విక్రయించగా 33,96,889 పుస్తకాలు మిగిలి ఉన్నాయి. ఈ పాఠశాలలకు 2, 3 దశల కింద 37,69,423 పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ జిల్లా కేంద్రాలలో ఇప్పటికే సిద్ధంగా ఉంచింది.
గత సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు అందాలంటే డిసెంబర్ వస్తేగానీ ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఇప్పటి మాదిరిగా కాకుండా సబ్జెక్టులవారీగా ఒకటే పుస్తకాన్ని ముద్రించారు. అది కూడా గరిష్టంగా 2.8 కోట్ల పుస్తకాలే కావడం గమనార్హం. పోనీ అవైనా స్కూళ్లు తెరవగానే ఇచ్చారా అంటే అదీ లేదు. ఆర్నెల్లు గడిస్తే గానీ పాఠ్య పుస్తకాలు అందేవి కావు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 6.88 కోట్ల పుస్తకాలను ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు శరవేగంగా సమకూరుస్తోంది.
గతంతో పోలిస్తే మూడు రెట్ల పుస్తకాలను అదనంగా ముద్రిస్తూ విద్యార్ధులకు తరగతుల ప్రారంభానికి ముందే అందేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ద్వి భాషా పుస్తకాలు (బై లింగ్యువల్), వర్కు బుక్స్, పాఠ్య పుస్తకాలు ఇలా వేర్వేరు రకాలుగా ముద్రించి ముందుగానే అందించడం విద్యా రంగం పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది.