Skip to main content

Job Opportunities: ఫిన్‌టెక్‌ రంగం.. రెండు లక్షల కొలువుల కొలాహలం

Career Paths and Job Opportunities in FinTech Sector
Career Paths and Job Opportunities in FinTech Sector
  • ఫిన్‌టెక్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు
  • శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగం
  • ఆర్థిక రంగంలో కొత్త సేవలే కారణం
  • ఉద్యోగాల కల్పనలోనూ ముందజం

ఫైనాన్షియల్‌ టెక్నాలజీ.. సంక్షిప్తంగా ఫిన్‌టెక్‌! నేటి డిజిటల్‌ యుగంలో వేగంగా విస్తరిస్తున్న రంగం.. ఫిన్‌టెక్‌. అకౌంట్‌ ఓపెనింగ్‌ మొదలు.. రుణాల మంజూరు వరకూ..అంతా డిజిటల్‌ విధానంలోనే!! సంప్రదాయ బ్యాంకింగ్‌ సంస్థలు సైతం.. డిజిటల్‌ బాట పడుతున్న పరిస్థితి! ఫలితంగా ఫిన్‌టెక్‌ రంగం.. అవకాశాలకు సరికొత్త వేదికగా నిలుస్తోంది. కస్టమర్‌ సపోర్ట్‌ నుంచి డేటా అనలిటిక్స్‌ ఎక్స్‌పర్ట్‌ దాకా.. అనేక ఉద్యోగాలు లభిస్తున్నాయి. అన్ని విభాగాల విద్యార్థులు ఫిన్‌టెక్‌లో అవకాశాలు అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఫిన్‌టెక్‌ సంస్థల తీరుతెన్నులు, తాజా జాబ్‌ ట్రెండ్స్, అవసరమవుతున్న నైపుణ్యాలపై ప్రత్యేక కథనం.. 

ఒక్క యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు.. లావాదేవీలన్నీ అరచేతిలోనే క్షణాల్లో పూర్తిచేసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లకుండానే.. స్మార్ట్‌ఫోన్‌లోనే చెల్లింపులు, రుణాలు తీసుకోవడం, ఇన్సూరెన్స్‌ పేమెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఇలా అన్ని రకాల సేవలు యాప్‌ల ద్వారానే పొందొచ్చు. ఇలాంటి సేవలను ఫిన్‌టెక్‌ సంస్థలు టెక్నాలజీ ఆధారంగా అందిస్తున్నాయి.

ఫిన్‌టెక్‌ సేవలు

ఫిన్‌టెక్‌ సంస్థలు ప్రధానంగా ఆరు విభాగాల్లో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. అవి.. డిజిటల్‌ లెండింగ్, పేమెంట్‌ సర్వీసెస్, సేవింగ్స్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్, రెమిటెన్సెస్, పాయింట్‌ ఆఫ్‌ సేల్, ఇన్సూరెన్స్‌. ఈ సేవలన్నీ మొబైల్‌ యాప్స్‌ రూపంలోనే ఉంటున్నాయి. ఉదాహరణకు ఇన్సూరెన్స్‌ పేమెంట్స్, అసెట్‌ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన పలు రకాల సేవలను యాప్స్‌ ఆధారంగా సదరు ఫిన్‌టెక్‌ సంస్థ అందిస్తుంది. ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన మొబైల్‌ వ్యాలెట్, ఆన్‌లైన్‌ పీర్‌ టు పీర్‌ లెండింగ్‌ వంటివి ఫిన్‌టెక్‌ సంస్థల పరిధిలోకే వస్తాయి. 

విస్తరణ బాట

ఫిన్‌టెక్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కరోనా కాలంలో ఆన్‌లైన్‌ కార్యకలాపాలు ఊపందుకోవడంతో.. ఫిన్‌టెక్‌ సంస్థల సేవలకు డిమాండ్‌ ఏర్పడింది. డిజిటల్‌ పేమెంట్స్, ఆన్‌లైన్‌ సర్వీసెస్‌కు విపరీతమైన ప్రాధాన్యం కనిపిస్తోంది. 2021లో ఫిన్‌టెక్‌ సంస్థలు 30 శాతం వృద్ధి నమోదు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. వచ్చే మూడేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ఫిన్‌టెక్‌ సంస్థలు ప్రధానంగా డిజిటల్‌ పేమెంట్స్, ఆల్టర్నేటివ్‌ ఫైనాన్సింగ్, పర్సనల్‌ ఫైనాన్స్, ఆల్టర్నేటివ్‌ లెండింగ్‌ల విభాగాల్లో విస్తరిస్తున్నాయి.

పెరుగుతున్న వినియోగదారులు

ఫిన్‌టెక్‌ సంస్థలు అందిస్తున్న సేవలు పొందుతున్న వినియోగదారుల సంఖ్య సైతం ఏటేటా పెరుగుతోంది. 2023 నాటికి దేశంలో ఫిన్‌టెక్‌ కస్టమర్స్‌ సంఖ్య 625.53 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు మూడు వేలకుపైగా సంస్థలు ఫిన్‌టెక్‌ విభాగంలో సేవలందిస్తున్నాయి. ఫిన్‌టెక్‌ సంస్థలకు పెరుగుతున్న ఆదరణకు తగ్గట్టే ఈ రంగంలో నిపుణులకు అవకాశాలు మెరుగవుతున్నాయి. 

రెండు లక్షల కొలువులు

రానున్న రెండేళ్లలో ఫిన్‌టెక్‌ రంగంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని నిపుణుల అంచనా. ఈ రంగంలో కస్టమర్‌ ఎక్విజిషన్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటా, డేటా అనలిటిక్స్, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్స్, హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్, యూఐ/యూఎక్స్‌ డిజైనర్, ప్రొడక్ట్‌ మేనేజర్, ప్రొడక్ట్‌ ఇంజనీర్, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్, సోషల్‌ మీడియా మేనేజర్స్‌ వంటి కొలువులు లభిస్తున్నాయి. 

ముఖ్యమైన విభాగాలు

నాస్‌కామ్, మ్యాన్‌పవర్‌ గ్రూప్, డెలాయిట్‌ వంటి సంస్థలు కొన్ని రోజుల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం–ఫిన్‌టెక్‌ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్న ముఖ్యమైన విభాగాలు..–సాఫ్ట్‌వేర్‌–51 శాతం; సేల్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ 16 శాతం; కోర్‌ ఫైనాన్స్‌–11 శాతం; ప్లానింగ్‌ అండ్‌ కన్సల్టింగ్‌–4 శాతం;టాప్‌ మేనేజ్‌మెంట్‌–4 శాతం.

ఫిన్‌టెక్‌ స్టార్టప్స్‌

గత కొన్నేళ్లుగా దేశంలో ఫిన్‌టెక్‌ స్టార్టప్స్‌ సైతం ఏర్పాటవుతున్నాయి. వీటికి కేంద్ర బడ్జెట్‌లోనూ భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఫలితంగా ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ సంస్థల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నాస్‌కామ్, ఫిక్కీ తదితర సంస్థల అంచనా ప్రకారం–ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో పది నుంచి వంద మంది వరకూ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

పరోక్ష ఉపాధి

ఫిన్‌టెక్‌ సంస్థల కారణంగా పరోక్ష ఉపాధి అవకాశాలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి సంస్థలో కోర్‌ విభాగంలో ఒక జాబ్‌కు కొనసాగింపుగా మరో అయిదు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అంటే.. ప్రొడక్ట్‌ డిజైన్‌ స్థాయిలో ఒక ఉద్యోగి ఉంటే.. ఆ తర్వాత దాన్ని వినియోగదారులకు చేర్చే వరకు అయిదుగురి అవసరం ఏర్పడుతోంది. 

స్కిల్స్‌తో కొలువు

ఫిన్‌టెక్‌ సంస్థల్లో కొలువు ఖాయం చేసుకోవాలంటే.. ఐఓఎస్‌ డెవలప్‌మెంట్‌; ఆండ్రాయిడ్‌ డెవలప్‌మెంట్‌; సైట్‌ రిలయబిలిటీ ఇంజనీరింగ్‌(ఎస్‌ఆర్‌ఈ); ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ నాలెడ్జ్‌; అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ); బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ తదితర నైపుణ్యాలపై పట్టు ఉండాలి. 

టెక్‌ కొలువులు

టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు ఊపందుకోవడంతో బ్యాంకింగ్, ఫైనాన్స్‌ సంస్థల్లో కొత్త కొలువులు ఆవిష్కృతమవుతున్నాయి. బ్లాక్‌చైన్‌ ఆర్కిటెక్ట్, రోబో ప్రోగ్రామర్స్, క్రెడిట్‌ అనలిస్ట్, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్, డేటాఅనలిస్ట్, ప్రాసెస్‌ మోడల్‌ స్పెషలిస్ట్, క్లౌడ్‌ మేనేజర్స్‌ వంటి టెక్‌ కొలువుల సంఖ్య పెరుగుతోంది.

అకడమిక్‌ అర్హతలివే

ఫిన్‌టెక్‌ రంగంలో కొలువులు కోరుకునే అభ్యర్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ నైపుణ్యాలు ఉండాలి. అదే విధంగా డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా, రోబోటిక్స్‌ వంటి వాటిని అకడమిక్‌ స్థాయిలోనే అభ్యసిస్తే త్వరగా ఉద్యోగం దక్కించుకోవచ్చు. బీఈ/బీటెక్‌తోపాటు డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణులు నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే.. ఫిన్‌టెక్‌ రంగంలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. 

ఆకర్షణీయ వేతనాలు

ఫిన్‌టెక్‌ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. కోర్‌ టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో ఏఐ ఇంజనీర్స్‌కు, డిజైనర్స్‌కు నెలకు రూ.50వేల వరకు సగటు వేతనం అందుతోంది. యాప్‌ డెవలపర్స్, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం విభాగాల్లో పనిచేసే వారికి రూ.30వేల వరకు వేతనం ఖాయం. మార్కెటింగ్, సేల్స్‌ విభాగాల్లో పని చేసే వారికి నెలకు రూ.20వేల వరకూ వేతనం లభిస్తోంది.

ఫిన్‌టెక్‌  కెరీర్‌.. ముఖ్యాంశాలు

  • 2022 చివరినాటికి ఫిన్‌టెక్‌ రంగంలో దాదాపు రెండు లక్షల కొత్త ఉద్యోగాలు.
  • ఏఐ, ఎంఎల్‌ నిపుణులు, యాప్‌ డెవలపర్స్, ఎస్‌ఈఎం, ఎస్‌ఈఓ స్కిల్స్‌కు డిమాండ్‌. 
  • ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు మూడు వేలకు పైగా ఫిన్‌టెక్‌ సంస్థలు.
  • సంస్థ, ఉద్యోగ హోదాను బట్టి నెలకు రూ.20 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం.
  • క్రెడిట్‌ అనలిస్ట్స్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్స్, స్ట్రాటజీ అనలిస్ట్స్‌ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌.
  • మేనేజ్‌మెంట్‌ విభాగంలో డేటాఅనలిస్ట్, డేటా మేనేజర్, ఈఆర్‌పీ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌.

ఫిన్‌టెక్‌ ఎవర్‌ గ్రీన్‌

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సాంకేతికతలను పరిగణనలోకి తీసుకుంటే.. ఫిన్‌టెక్‌ రంగాన్ని ఎవర్‌గ్రీన్‌గా పేర్కొనొచ్చు. ఈ రంగంలో వందల సంఖ్యలో సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగాల్లోనూ టెక్‌ ఆధారిత సేవలు పెరుగుతున్నాయి. దీంతో ఈ రంగం కొలువులకు కేరాఫ్‌గా నిలుస్తోంది.
–ఎ.శశి కుమార్, ఇండీడ్‌ డాట్‌ కామ్‌

Published date : 22 Sep 2021 06:26PM

Photo Stories