Skip to main content

రవాణా సౌకర్యాలు

ఒక దేశంలోని ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ, జీవన స్థితిగతులు ఆ దేశంలోని రవాణా సౌకర్యాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి. వస్తువులను, ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేర్చడాన్ని ‘రవాణా’ అంటారు. ప్రాథమిక, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధిలో రవాణా సౌకర్యాల పాత్ర అత్యంత కీలకం. రాష్ట్రంలో 2014-15 నాటికి సేవా రంగంలో రవాణా రంగం వాటా 10.58 శాతంగా ఉంది. సేవా రంగంలో ఇది ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది.
రాష్ట్రంలో ప్రధానంగా మూడు రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అవి:
1. రోడ్డు రవాణా
2. రైల్వే రవాణా
3. వాయు రవాణా
తెలంగాణకు సముద్ర తీర ప్రాంతం లేదు కాబట్టి రాష్ట్రంలో జల రవాణాకు తగిన ప్రాధాన్యం లేదు.

రోడ్డు రవాణా
తెలంగాణ రాష్ట్రంలో ‘నిజాం స్టేట్ రైల్వే’లో భాగంగా 1932లో భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. దీని పేరు ‘నిజాం రాష్ట్ర రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్’ (ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ).
  • రాష్ట్రంలోని మొదటి రోడ్డు రవాణా సంస్థ 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైంది.
  • నిజాం రాజ్య ప్రధానమంత్రి సాలార్జంగ్ చొరవతో హైదరాబాద్ - షోలాపూర్ రహదారిని నిర్మించారు.
  • 1932లో రహదారులను జాతీయం చేసి ప్రభుత్వమే బస్సులను నడిపింది.
  • 1936 నాటికే హైదరాబాద్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులు నడపటం ప్రారంభమైంది.
  • ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ సంస్థను హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసిన తేదీ 1951 నవంబర్ 1.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1965లో ‘రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ)’ను ఏర్పాటు చేశారు.
  • ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లు ‘తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ’ పరిధిలో ఉన్నాయి.
  • రాష్ట్రంలో 80 శాతానికి పైగా సరకులు, ప్రయాణికుల రవాణా రోడ్డు మార్గాలపైనే ఆధారపడి ఉంది.
  • 2015 జనవరి 30 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం రహదారుల పొడవు 26,837 కి.మీ.
  • రాష్ట్రంలో ఒక చదరపు కి.మీ.కు రోడ్డు సాంద్రత 0.23 కి.మీ.గా ఉంది.
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వేయి మందికి అందుబాటులో ఉన్న రోడ్డు 0.86 కి.మీ.

రోడ్లు - రకాలు
రాష్ట్రంలోని రోడ్లను ‘ఆర్ అండ్ బీ నెట్ వర్‌‌క’ కింద ఉన్న రోడ్లు, ‘పంచాయతీ రాజ్’ రోడ్లు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఆర్ అండ్ బీ నెట్‌వర్క్ కింద ఉన్న రోడ్లను తిరిగి జాతీయ రహదారులు (ఎన్‌హెచ్), రాష్ట్ర రహదారులు (ఎస్‌హెచ్), ప్రధాన జిల్లా రహదారులు, గ్రామీణ రోడ్లుగా విభజించవచ్చు.

రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్ :
  • రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారుల విస్తీర్ణం 2,592 కి.మీ.
  • రాష్ట్ర రహదారుల పొడవు 3,152 కి.మీ.
  • ప్రధాన జిల్లా రహదారుల పొడవు 12,079 కి.మీ.
  • గ్రామీణ రహదారుల పొడవు 9,014 కి.మీ.
  • జాతీయ రహదారులు మినహాయించి రాష్ట్ర రహదారుల మొత్తం పొడవు 24,245 కి.మీ.

జాతీయ రహదారులు
ఇవి సెంట్రల్ వర్క్స్ డిపార్ట్ మెంట్ పరిధిలో ఉంటాయి.
  • తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదార్లు అధికంగా (266 కి.మీ.) ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. అతి తక్కువగా హైదరాబాద్‌లో (36 కి.మీ.) ఉన్నాయి.
  • రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత 100 చ.కి.మీ. ప్రాంతానికి 2.25 కి.మీ.గా ఉంది.
  • దేశంలో జాతీయ రహదారుల సాంద్రత 100 చ.కి.మీ. ప్రాంతానికి 2.82 కి.మీ.
  • రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి ‘ఎన్‌హెచ్-44’, అతి చిన్న జాతీయ రహదారి ‘ఎన్‌హెచ్-61’.
  • రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారుల పొడవు 2,592 కి.మీ. ఇందులో.. నాలుగు లేన్ల జాతీయ రహదారుల పొడవు 964 కి.మీ.
    రెండు లైన్ల జాతీయ రహదారుల పొడవు 1264 కి.మీ.
    మధ్య తరహా (ఇంటర్మీడియెట్) లైన్ జాతీయ రహదారుల పొడవు 153 కి.మీ.
    సింగిల్ లైన్ జాతీయ రహదారుల పొడవు 211 కి.మీ.

రాష్ట్రంలోని జాతీయ రహదారులు
1. జాతీయ రహదారి నంబర్ - 44
ఇది వారణాసి నుంచి కన్యాకుమారి వరకు ఉంది. దీని పాత నంబర్ - 7. ఇది మహారాష్ట్ర సరిహద్దు నుంచి ఆదిలాబాద్, నిర్మల్, రామాయంపేట, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో ఈ రహదారి పొడవు 519.64 కి.మీ.
2. జాతీయ రహదారి నంబర్ - 65
దీని పాత నంబర్ -9. ఇది కర్ణాటక సరిహద్దు నుంచి జహీరాబాద్, హైదరాబాద్, సూర్యాపేట్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 291.74 కి.మీ.
3. జాతీయ రహదారి నంబర్ - 63
దీని పాత నంబర్ -16. ఇది నిజామాబాద్ నుంచి ఆర్మూర్, జగిత్యాల, లక్సెట్టిపేట, చెన్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 235.15 కి.మీ.
4. జాతీయ రహదారి నంబర్ - 167
ఇది నూతన రహదారి. ఇది కర్ణాటక సరిహద్దు నుంచి జడ్చర్ల (మహబూబ్‌నగర్) మీదుగా ఎన్‌హెచ్-44ను కలుస్తుంది.
5. జాతీయ రహదారి నంబర్ - 163
దీని పాత నంబర్-202. ఇది హైదరాబాద్ నుంచి జనగాం, వరంగల్, వెంకటాపురం మీదుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో దీని పొడవు 306 కి.మీ.
6. జాతీయ రహదారి నంబర్ - 30
దీని పాత నంబర్- 221. ఇది ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి పెనుబలి, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 100 కి.మీ.
7. జాతీయ రహదారి నంబర్ - 61
దీని పాత నంబర్ - 222. ఇది రాష్ట్రంలో మహారాష్ట్ర సరిహద్దు నుంచి నర్సాపూర్ మీదుగా నిర్మల్ వరకు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దీని పొడవు 53.6 కి.మీ.
8. జాతీయ రహదారి నంబర్ - 161
ఇది నూతన జాతీయ రహదారి. ఇది సంగారెడ్డి మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 140.5 కి.మీ.
9. జాతీయ రహదారి నంబర్ - 363
ఇది నూతన జాతీయ రహదారి. ఇది మహారాష్ట్ర సరిహద్దు నుంచి మహాదేవ్‌పూర్, పరకాల, ఆత్మకూరు ద్వారా ఎన్‌హెచ్-163తో కలుస్తుంది.
10. జాతీయ రహదారి నంబర్ -365
ఇది నూతన జాతీయ రహదారి. ఇది నకిరేకల్ నుంచి తుంగతుర్తి, మహబూబాబాద్, నర్సంపేట మీదుగా మల్లంపల్లి వద్ద ఎన్‌హెచ్-163తో కలుస్తుంది.
11. జాతీయ రహదారి నంబర్ - 565
ఇది కూడా నూతన జాతీయ రహదారి. ఇది నకిరేకల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
- 363, 365, 565 నంబర్ జాతీయ రహదార్ల మొత్తం ఉమ్మడి పొడవు 330 కి.మీ.
12. జాతీయ రహదారి నంబర్ - 563
ఇది నూతన జాతీయ రహదారి. ఎన్‌హెచ్-63పై ఉన్న మంచిర్యాల మీదుగా కరీంనగర్- వరంగల్ ద్వారా ఎన్‌హెచ్-163తో కలుస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 136 కి.మీ.
13. జాతీయ రహదారి నంబర్ - 365ఎ
ఇది కూడా నూతన జాతీయ రహదారి. ఇది ఎన్‌హెచ్-65పై ఉన్న కోదాడ మీదుగా ఖమ్మం- మహబూబాబాద్ ద్వారా ఎన్‌హెచ్ -365తో కలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో దీని పొడవు 75 కి.మీ.
14. జాతీయ రహదారి నంబర్ - 765
ఇది నూతన జాతీయ రహదారి. హైదరాబాద్ నుంచి అమన్‌గల్, వెల్దండ, కల్వకుర్తి, వంగూర్, అచ్చంపేట మీదుగా ఆంద్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 196 కి.మీ.
  • నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో 768 కి.మీ. పొడవైన జాతీయ రహదారులను ‘నేషనల్ హైవేస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు’ కింద నాలుగు లైన్ల రహదారులుగా అభివృద్ధి చేస్తోంది.

రాష్ట్ర రహదారులు
రాష్ట్ర రహదారులు ప్రధానంగా జిల్లాల ప్రధాన కేంద్రాలను రాష్ట్ర రాజధానితో అనుసంధానం చేస్తాయి. రాష్ట్ర రహదారులు తెలంగాణలో 3,152 కి.మీ. వరకు విస్తరించి ఉన్నాయి.
  • రాష్ట్ర రహదారులు కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి.

జిల్లా రహదారులు
తాలూకా కేంద్రాలతో; జిల్లా కేంద్రాలతో; ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలు, మార్కెట్ కేంద్రాలను రాష్ట్రీయ రహదారులతో; రైల్వేస్టేషన్‌లతో కలిపే రహదారులను ‘జిల్లా రహదారులు’ అంటారు.
  • రాష్ట్రంలో జిల్లా రహదారులు 12,079 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి.

పంచాయతీరాజ్ రహదారులు
పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం, నిర్వహణను రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ శాఖ గ్రామీణ ప్రాంత రోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, బిల్డింగ్‌లు, కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తుంది. 2014 ఏప్రిల్ 1 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 64,046 కి.మీ. పొడవైన పంచాయతీ రాజ్ రహదారులు ఉన్నాయి.
పంచాయతీ రాజ్ రోడ్లకు సంబంధించిన వివిధ రకాల రోడ్లు
  • సి.సి., బి.టి. రోడ్ల పొడవు 20,282 కి.మీ.
  • కంకర రోడ్ల పొడవు 14,734 కి.మీ.
  • డబ్ల్యూబీఎం రోడ్ల పొడవు 14,146 కి.మీ.
  • మట్టి రోడ్ల పొడవు 14,884 కి.మీ.

ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)
ఇది హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉంది. ఈ రింగ్ రోడ్డు పొడవు 158 కి.మీ. దీన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్మించింది. ఈ రింగ్ రోడ్డుకు మరో పేరు ‘నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు’.
  • పంచాయతీ రాజ్ రోడ్లు అధికంగా ఉన్న జిల్లా - మహబూబ్ నగర్
  • పంచాయతీ రాజ్ రోడ్లు అత్యల్పంగా ఉన్న జిల్లా రంగారెడ్డి (హైదరాబాద్ కాకుండా).
  • అన్ని రకాల రోడ్లను కలిపి చూసినప్పుడు.. మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్ల విస్తీర్ణం అధికంగా, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉన్నాయి.
  • హైదరాబాద్ - కర్నూలు, హైదరాబాద్ - మచిలీపట్నం రహదారులను నిజాం కాలంలోనే నిర్మించారు.
  • 1936 నాటికే తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్ డిపోలను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు బస్సులు నడిపారు.
  • తెలంగాణ రాష్ట్రం మీదుగా 14 జాతీయ రహదార్లు వెళుతున్నాయి.
  • రాష్ట్రంలోని అన్ని రకాల రోడ్ల మొత్తం పొడవు 26,837 కి.మీ.
  • తెలంగాణలో అతి పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్-44.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)
పయాణికులను రైల్వేస్టేషన్‌కు చేర్చే ఉద్దేశంతో నిజాం రైల్వేశాఖ 1932లో 166 మంది సిబ్బందితో 27 బస్సులను నడపడం ప్రారంభించింది. హైదరాబాద్ రాష్ర్టం ఏర్పడిన తర్వాత 1951లో రాష్ర్ట ప్రభుత్వం ఈ బస్సుల నిర్వహణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) ఏర్పాటైంది. చివరగా తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావంతో 2014లో తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)ని నెలకొల్పారు.

  • టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్తంగా 3 జోన్లు, 11 రీజియన్లు, 95 డిపోలు ఉన్నాయి.
  • 2014 మార్చి 31 నాటికి తెలంగాణలో నడుస్తున్న మొత్తం బస్సుల సంఖ్య 10,342.
  • రాష్ర్టంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య - దాదాపు 58 వేలు.
  • ఇంధన సామర్థ్యం-5.18 కి.మీ./లీ. (2013-14లో)
  • టీఎస్‌ఆర్టీసీ ద్వారా రోజూ ప్రయాణించే వారి సంఖ్య - 83.15 లక్షలు.
  • అన్ని బస్సులు కలిపి ప్రతి రోజు ప్రయాణించే దూరం- 34.17 లక్షల కిలోమీటర్లు.
  • రోజుకి సగటు వాహన ఉత్పాదకత- 331 కిలోమీటర్లు.

మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్)
  • ఎంజీబీస్ పాత పేరు - ఇమ్లీబన్ (చింతచెట్ల అడవి).
  • ఇది హైదరాబాద్‌లోని గౌలీగూడలో ఉంది.
  • నిజాం రాజు కాలంలో ఈ బస్‌స్టేషన్‌ను మూసీనది ఒడ్డున నిర్మించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలంలో నూతనంగా నిర్మించారు.
  • ఇందులోని ప్లాట్‌ఫాంల సంఖ్య - 110.
  • ఇది సుమారు 30 ఎకరాల్లో విస్తరించి ఉంది.
  • తెలంగాణ రాష్ర్టంలో ఇది అతిపెద్ద బస్‌స్టేషన్.
  • ఆసియా ఖండంలోనే మూడో అతిపెద్ద బస్‌స్టేషన్.
  • చెన్నై, ఢిల్లీలోని బస్‌స్టేషన్లు ఆసియాలోనే అతిపెద్ద బస్‌స్టేషన్లలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

కరీంనగర్ బస్‌స్టేషన్
  • ఇది ఆసియా ఖండంలో అతిపెద్ద బస్‌స్టేషన్లలో ఒకటి. తెలంగాణ రాష్ర్టంలో రెండో స్థానంలో ఉంది.
  • కరీంనగర్ బస్‌స్టేషన్‌కు మరో పేరు బి.ఆర్. అంబేద్కర్ బస్‌స్టేషన్.
  • 1976 నవంబర్ 11న దీన్ని ప్రారంభించారు. మొత్తం ప్లాట్‌ఫాంల సంఖ్య - 54.

రాష్ర్టంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో అభివృద్ధి చెందుతున్న రోడ్లు
  1. హైదరాబాద్-కరీంనగర్-రామగుండం(హెచ్‌కేఆర్)రోడ్డు: హైదరాబాద్-కరీంనగర్ - రామగుండం (హెచ్‌కేఆర్)లను కలిపే ఈ రాష్ర్ట రహదారి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చెందుతోంది. దీని పొడవు- 206.85 కిలోమీటర్లు.
  2. నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల(ఎన్‌ఏఎమ్) రోడ్డు: తెలంగాణ రాష్ర్టంలో ఈ రోడ్డు నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి నుంచి వాడపల్లి (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) వరకు ఉంది. దీని పొడవు- 212.5 కి.మీ.
  3. ఖమ్మం-తల్లాడ-దేవరపల్లి (ఎస్‌హెచ్-7): ఖమ్మం నుంచి దేవరపల్లి (పశ్చిమగోదావరి జిల్లాలో) వరకు దీన్ని నిర్మిస్తున్నారు. 227 కి.మీ.ల పొడవున్న ఈ రోడ్డును తెలంగాణలో ఖమ్మం-తల్లాడ మధ్య పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేస్తున్నారు.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించు-నిర్వహించు-బదలాయించు (బీవోటీ) పద్ధతిలో ప్రతిపాదించిన రోడ్లు:
1) సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-భువనగిరి-చిట్యాల్ రోడ్డు-164 కి.మీ.
2) మహబూబ్‌నగర్-నల్లగొండ రోడ్డు-163.20 కి.మీ.
3) హైదరాబాద్-నర్సాపూర్- 28 కి.మీ.
4) జనగామ-చేర్యాల-దుద్దెడ- 46.40 కి.మీ.
5) జనగామ-సూర్యాపేట రోడ్డు- 84.40 కి.మీ.
6) సూర్యాపేట-మోతె-ఖమ్మం రోడ్డు-58.30 కి.మీ.
7) హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు- 36.40కి.మీ.

జాతీయ రహదారులను వెడల్పు చేయడం, వాటి ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 1998లో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డీపీ)ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో దశలవారీగా జాతీయ రహదారుల అభివృద్ధి జరిగింది. అవి:
ఫేజ్-3:
ఫేజ్-3లో భాగంగా మనదేశంలో 12,109 కి.మీ. పొడవున జాతీయ రహదారుల ప్రమాణాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. తెలంగాణలో 220 కి.మీ. పొడవున జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వాటి వివరాలు:
1) ఎన్‌హెచ్-9: హైదరాబాద్ నుంచి కోదాడ (నల్లగొండ) దాటిన తరువాత ఏపీ సరిహద్దు వరకు 190 కి.మీ.ల పొడవున అభివృద్ధి చేస్తున్నారు. దీని కొత్త నంబర్-65.
2) ఎన్‌హెచ్-202: దీని కొత్త నంబర్-163.
హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దులను కలిపే 306 కి.మీ. పొడవున్న జాతీయ రహదారి ఇది. ఇందులో భాగంగా తెలంగాణలో 30 కి.మీ. పొడవున్న జాతీయ రహదారి (హైదరాబాద్- యాదగిరిగుట్ట రోడ్డు)ని అభివృద్ధి చేస్తున్నారు.
ఫేజ్-4:
ఈ దశలో భాగంగా 473 కి.మీ.ల పొడవున రెండులేన్ల జాతీయ రహదారులను రాష్ర్టంలో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకుగానూ రూ. 1,732 కోట్లు వెచ్చించనున్నారు.

రైల్వే రవాణా
  • తెలంగాణ రాష్ర్టంలో నిజాం రైల్వే ఆధ్వర్యంలో మొదటగా రైళ్లు నడిచాయి. అప్పటి హైదరాబాద్ రాష్ర్టంలో నిజాం నవాబు 1879లో నిజామ్స్ గ్యారెంటీడ్ రైల్వే పేరుతో నిజాం రైల్వే సంస్థ స్థాపించారు.
  • హైదరాబాద్ రాష్ర్టం ఏర్పడటంతో 1950లో నిజాం రైల్వేను జాతీయం చేశారు. ఇది 1951లో భారత రైల్వేలో విలీనమయింది.
  • తెలంగాణ ప్రాంతంలో మొదటి రైల్వే లైన్‌ను సికింద్రాబాద్-వాడీ (మహారాష్ర్ట) మధ్య నిర్మించారు.
  • దీని పొడవు 177 మైళ్లు. ఇది 1864లో ప్రారంభమై 1874లో పూర్తయింది.
  • ఉమ్మడి ఆంధ్రప్రధేశ్‌లో విద్యుదీకరణ చేసిన మొదటి రైల్వేట్రాక్-మధిర (ఖమ్మం)-విజయవాడ.
  • మనదేశంలో మొత్తం రైల్వే జోన్లు-17.
  • తెలంగాణలో ఉన్న ఏకైక రైల్వేజోన్-దక్షిణ మధ్య రైల్వే. దీన్ని 1966 అక్టోబర్ 2న దేశంలో తొమ్మిదో జోన్‌గా ఏర్పాటు చేశారు.
  • ఈ జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది.
  • ఈ జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు, నాందేడ్ అనే 6 డివిజన్లు ఉన్నాయి. తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్ 3, మహారాష్ర్టలో 1 డివిజన్ ఉన్నాయి.
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను 1874లో నిర్మించారు. ఇందులో ప్లాట్‌ఫాంల సంఖ్య-10.
  • ఈ స్టేషన్‌ను పూర్తిగా విద్యుదీకరణ చేసిన సంవత్సరం-1993.
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ద్వారా ప్రతిరోజు సుమారు 228 రైల్వేస్టేషన్ల నుంచి దాదాపు 1.2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
  • కాచిగూడ రైల్వేస్టేషన్‌ను 1916లో ప్రారంభించారు.
  • 2014 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ర్టంలో 228 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
  • తెలంగాణలో మొత్తం రైల్వేలైను పొడవు 1753 కి.మీ.(బ్రాడ్‌గేజ్).
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించడానికి మరో నూతన స్టేషన్ నిర్మాణానికి సన్నాహలు జరుగుతున్నాయి. మల్కాజ్‌గిరి లేదా మౌలాలి రైల్వేస్టేషన్‌లను నూతన స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి.
  • సికింద్రాబాద్‌లోని ప్రధాన కేంద్ర భవనం సంచాలన్ భవన్‌ను 1980 నవంబర్ 10న ప్రారంభించారు.

మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్)
జంట నగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్) ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించి, రైలు మార్గాలను సమర్థంగా వినియోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఎంఎంటీఎస్‌ను ప్రారంభించారు. దీని మొదటి దశను రూ. 178 కోట్లతో సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2003 ఆగస్టు 9న అప్పటి ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ ప్రారంభించారు.
ఇది దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి సంస్థ.
ఎంఎంటీఎస్ రైల్వే లైను పొడవు 43 కి.మీ. దీని పరిధిలో 27 స్టేషన్లు ఉన్నాయి.
ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి.
1) లింగంపల్లి-బేగంపేట-హైదరాబాద్ (నాంపల్లి)
2) లింగంపల్లి-బేగంపేట-సికింద్రాబాద్- కాచిగూడ-ఫలక్‌నుమ.
రెండో దశ:
121 కి.మీ. పొడవు ఉన్న రెండో దశ ఎంఎంటీఎస్ రూ. 632 కోట్ల బడ్జెట్ నిధులతో 2012 మార్చి 1న ఆమోదం పొందింది.
ఈ దశలో భాగంగా మేడ్చల్ నుంచి నల్లగొండ జిల్లా భువనగిరి వరకు రైళ్లు నడపాలని నిర్ణయించారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు (హెచ్‌ఎంఆర్‌పీ)
నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడానికి 2008లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఆమోదించింది. తొలిదశ నిర్మాణ పనులు 2013లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు ను తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టాయి.
మనదేశంలో మెట్రో రైల్వే రవాణాలో చేసిన కృషికి గాను ఇండియన్ ఇంజనీరింగ్సర్వీసెస్ (ఐఈఎస్) రిటైర్డ్ అధికారి శ్రీధరన్‌ను ‘మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారు.

ఫేజ్-1 (తొలిదశ)కు సంబంధించిన ముఖ్య వివరాలు:
  • ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) లో నిర్మితమవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా రవాణా ప్రాజెక్టు ఇది.
  • ఈ ప్రాజెక్టుకు 2012 ఏప్రిల్ 26న శంకుస్థాపన చేశారు.
  • దీని పొడవు 72 కిలోమీటర్లు.
  • హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు చైర్మన్ ఎన్.వి.ఎస్. రెడ్డి.
  • సగటున ఒక కిలోమీటరుకు ఒకటి చొప్పున 63 ప్రదేశాల్లో 3 ఇంటర్ చేంజ్ స్టేషన్లతో కలిపి మొత్తం 66 స్టేషన్లు నిర్మిస్తున్నారు.
  • ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 14,132 కోట్లు.
దీనిని 3 కారిడార్లుగా నిర్మిస్తున్నారు. అవి:
కారిడార్ 1: మియాపూర్-ఎల్.బి.నగర్ (29 కి.మీ., 27 స్టేషన్‌లు)
కారిడార్ 2: జూబ్లీ బస్‌స్టేషన్-ఫలక్‌నుమ (15 కి.మీ., 16 స్టేషన్‌లు)
కారిడార్ 3: నాగోలు-శిల్పారామం (28 కి.మీ., 28 స్టేషన్‌లు)
  • అధిక భద్రతా ప్రమాణాల కల్పనకు స్టేట్ ఆఫ్ ఆర్డ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
  • భారతదేశంలో మొదటిసారిగా సీబీటీసీ (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్టులో ప్రవేశపెట్టారు.
  • కోచ్‌లలో వీడియో కెమెరాలు, స్టేషన్‌ల్లో సీసీ టీవీలు అమర్చుతున్నారు.
  • హెచ్.ఎమ్.ఆర్. గరిష్ట వేగం గంటకు 80 కి.మీ., సగటు వేగం గంటకు 34 కి.మీ.
  • అత్యవసర పరిస్థితుల్లో 2 నుంచి 5 నిమిషాలకు ఒక రైలు ప్రయాణిస్తుంది.
  • సామాన్యులకు అందుబాటులో చార్జీలు ఉంటాయి.

వాయు రవాణా
అత్యంత వేగంగా ప్రయాణించేందుకు, సరకులను త్వరితగతిన రవాణా చేసేందుకు వాయు రవాణా అనుకూలమైంది. భారతదేశంలో ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా అనే రెండు జాతీయ ఎయిర్‌వేస్ ఉండేవి. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టక ముందు వాయు రవాణాలో ఇవి ఏకఛత్రాధిపత్యం కలిగి ఉండేవి. ఆర్థిక సంస్కరణల తర్వాత అనేక ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. 2011లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ను ఎయిరిండియాలో విలీనం చేశారు. దేశంలో వాయు రవాణాను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది.

రాష్ట్రంలోని విమానాశ్రయాలు
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)
రాష్ర్టంలో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయమిది. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. 2005లో ఈ విమానాశ్రయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీన్ని 2008 మార్చి 14న ప్రారంభించారు. 2008 మార్చి 23 నుంచి విధులను నిర్వహిస్తోంది.
  • ఈ విమానాశ్రయం ఎన్‌హెచ్-44కు పశ్చిమంగా, శ్రీశైలం రాష్ర్ట రహదారికి తూర్పువైపు ఉంది.
  • పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

    ఆర్‌జీఐఏలో వాటాలు..

    మొత్తం వ్యయం - 5,584 కోట్లు
    జీఎంఆర్ గ్రూప్ - 63 శాతం
    తెలంగాణ ప్రభుత్వం - 13 శాతం
    కేంద్ర ప్రభుత్వం - 13 శాతం
    మలేషియా ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్ బెర్‌హాడ్ - 11 శాతం
  • రాష్ర్ట ప్రభుత్వం తన వాటా కింద 5449 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అప్పగించింది.
  • ఈ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
  • పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలో నిర్మించిన తొలి ఎయిర్‌పోర్ట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. రెండోది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.
  • ఇది తెలంగాణలో మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్.
  • దేశంలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఆరో విమానాశ్రయమిది.
  • 2013లో బ్రిటన్‌కు చెందిన ఎయిర్‌పోర్ట్ రివ్యూ కన్సల్టెన్సీ స్కైట్రాక్స్ ప్రకారం.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో ఏడో స్థానంలో నిలిచింది.
  • ఈ అంతర్జాతీయ విమానాశ్రయం స్పైస్‌జెట్, బ్లూడార్ట్ ఏవియేషన్, లుప్తాన్సా కార్గో లాంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలకు హబ్‌గా ఉంది.
  • ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 16 అంతర్జాతీయ విమానయాన సంస్థలు, 11 దేశీయ విమాయాన సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
  • ఈ విమానాశ్రయం నుంచి అత్యధికంగా ఎయిర్ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలు.. మధ్య ఆసియా (62%), ఉత్తర అమెరికా (20%), ఐరోపా (10%).
  • ఈ విమానాశ్రయానికి ప్రయాణికులను వేగంగా చేరవేయడానికి మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ వరకు 11.66 కి.మీ. పొడవైన పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించారు. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవే. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఈ విమానాశ్రయాన్ని చేరుకోవచ్చు.
  • ఆర్‌జీఐఏకు ‘పుష్పక్’ పేరుతో ఆర్‌టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది.
ఈ విమానాశ్రయానికి వచ్చిన అవార్డులు
  • థర్డ్ బెస్ట్ ఎయిర్ పోర్టు ఇన్ ది వరల్డ్- 2014 (ప్రయాణికుల రవాణా కేటగిరిలో)
  • బెస్ట్ ల్యాండ్ స్కేప్ అవార్డు (వరుసగా అయిదోసారి)
  • సెకండ్ బెస్ట్ ఎయిర్ పోర్టు ఇన్ ఇండియా - సెంట్రల్ ఆసియా- 2014
  • స్వార్డ్ ఆఫ్ హానర్ అవార్డు -బ్రిటిష్ కౌన్సిల్. భద్రత విషయంలో ఈ అవార్డును ఆస్కార్‌లా భావిస్తారు.
  • వరల్డ్ సెకండ్ బెస్ట్ ఎయిర్‌పోర్టు - 2013
  • రాష్ర్టంలో పర్యాటక రంగం కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం ఆర్‌జీఐఏలో తెలంగాణ పర్యాటక రంగ కౌంటర్‌ను ప్రారంభించారు.
రాష్ర్టంలో మూతబడిన ఎయిర్‌పోర్ట్‌లు
  • వరంగల్ ఎయిర్‌పోర్ట్
  • బేగంపేట ఎయిర్‌పోర్ట్
  • ఆదిలాబాద్ ఎయిరో డ్రమ్
  • రామగుండం ఎయిర్ పోర్ట్. 1995లో ఈ ఎయిర్‌పోర్ట్ ను ఆదిత్యా బిర్లా నిర్మించారు.
వరంగల్ ఎయిర్‌పోర్టు: దీన్ని వరంగల్ జిల్లా మామ్‌నూర్‌లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లో నిర్మించాడు. ఆ సమయంలో ఇది దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ కావడం విశేషం.
  • అప్పటి విస్తీర్ణం - 1875 ఎకరాలు
  • రన్‌వే పొడవు - 6.6 కి.మీ.
  • దీన్ని నిజాం వ్యాపార అవసరాల కోసం.. ప్రధానంగా సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ ఇండస్ట్రీ, వరంగల్ జిల్లాలోని అజాంజాహీ మిల్స్ కోసం నిర్మించారు.
  • చైనాతో యుద్ధం సమయంలో ఈ ఎయిర్‌పోర్టులోనే విమానాలను నిలిపి ఉంచారు.
  • 1981 వరకు ఈ ఎయిర్‌పోర్ట్ పనిచేసింది.
  • దీని ప్రస్తుత విస్తీర్ణం 775 ఎకరాలు.
  • ఈ ఎయిర్‌పోర్ట్ ను మళ్లీ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అభివృద్ధి చేయనున్న ఎయిర్‌పోర్ట్‌లు
  • వరంగల్ ఎయిర్‌పోర్ట్
  • నిజామాబాద్ ఎయిర్‌పోర్ట్ (జాక్రాన్ పల్లి)
  • రామగుండం ఎయిర్‌పోర్ట్
నిర్మించ తలపెట్టిన ఎయిర్‌పోర్ట్‌లు
  • కరీంనగర్, కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ లు
రాష్ర్టంలోని వైమానిక కేంద్రాలు
  • దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ
  • హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్
Published date : 28 Nov 2015 12:23PM

Photo Stories