Skip to main content

ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్)

రోజురోజుకూ పెరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య లోటును తగ్గించే దిశగా భారత ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహానికి, దిగుమతుల ప్రత్యామ్నాయానికి కాలక్రమేణా అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వచ్చినవే ‘ప్రత్యేక ఆర్థిక మండళ్లు’. చైనాను ఆదర్శంగా తీసుకొని వీటిని మనదేశంలో ఏర్పాటు చేశారు. ఆర్థికాభివృద్ధిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలోనూ వివిధ రకాల సెజ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
నిర్దేశిత ప్రాంతంలో ఎలాంటి నియమ, నిబంధనలు, లెసైన్సులు లేకుండా వివిధ ఉత్పాదక, వాణిజ్య, సేవా సంస్థలను ఏర్పాటు చేయడాన్ని ‘ప్రత్యేక ఆర్థిక మండలి’గా పేర్కొంటారు. చైనా 2004లో ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)ను ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య విపణిలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోగలిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకున్న భారత ప్రభుత్వం 2005లో ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం ద్వారా దేశంలో సెజ్‌ల స్థాపనకు పునాది వేసింది.
సెజ్‌లలో స్థాపించే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మొదటి అయిదేళ్లపాటు వంద శాతం ఆదాయపు పన్ను రాయితీని కల్పిస్తుంది. ఆ తర్వాత మరో అయిదేళ్లపాటు 50 శాతం ఆదాయపు పన్ను, కనీస ప్రత్యామ్నాయ పన్ను, మూలధన పన్ను రాయితీని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలకు సెజ్‌ల స్థాపనకు కావాల్సిన భూమి, మౌలిక వసతులను సరసమైన ధరలకు అందించడానికి కృషి చేస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ/ ఐటీఈఎస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఫార్ములేషన్ రంగాల్లో నోటిఫై చేసిన సెజ్‌ల వివరాలు..
  1. ఐటీ/ ఐటీఈఎస్ సెజ్: 2007లో నోటిఫై చేసిన ఈ సెజ్‌ను రంగారెడ్డి జిల్లాలోని శేర్‌లింగంపల్లి మండలం నానక్‌రామ్‌గూడ గ్రామంలో అభివృద్ధి చేశారు. ఈ సెజ్ 17.13 హెక్టార్లలో విస్తరించి ఉంది.
  2. ఫార్ములేషన్ సెజ్: దీన్ని 2007లో నోటిఫై చేశారు. ఈ సెజ్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలంలో రాజాపూర్, పోలేపల్లి గ్రామాల్లో అభివృద్ధి చేశారు. దీని మొత్తం విస్తీర్ణం 101.17 హెక్టార్లు.
  3. బయోటెక్ సెజ్: దీన్ని కూడా 2007లో నోటిఫై చేశారు. ఈ సెజ్‌ను మెదక్ జిల్లాలోని ములుగు మండలానికి చెందిన ‘కారక పట్ల’ గ్రామంలో స్థాపించారు. ఇది 40.47 హెక్టార్లలో విస్తరించి ఉంది.
  4. ఐటీ/ ఐటీఈఎస్ సెజ్: 2007లో నోటిఫై చేసిన ఈ సెజ్‌ను వరంగల్ జిల్లా హన్మకొండ మండలానికి చెందిన ‘మడికొండ’ గ్రామంలో స్థాపించారు. సెజ్‌ల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ‘తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్’ (టీఐఐసీ) టైర్-2 నగరాల్లో ఐటీ పార్కుల అభివృద్ధిలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సెజ్ 14.32 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.
  5. ఏరోస్పేస్, ప్రిసీజన్ ఇంజనీరింగ్ సెజ్: ఈ సెజ్‌ను 2008లో నోటిఫై చేశారు. దీన్ని రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ‘ఆదిభట్ల’ గ్రామంలో అభివృద్ధి చేశారు. ఈ సెజ్ విస్తీర్ణం 136.76 హెక్టార్లు.
  6. బయోటెక్ సెజ్ లేదా జీనోమ్ వ్యాలీ: 2009లో నోటిఫై చేసిన ఈ సెజ్‌ను రంగారెడ్డి జిల్లాలోని ‘తురకపల్లి’ గ్రామంలో అభివృద్ధి చేశారు. ‘జీనోమ్ వ్యాలీ’గా ప్రసిద్ధి చెందిన ఈ సెజ్ 20.44 హెక్టార్లలో విస్తరించి ఉంది.
పైన పేర్కొన్నవాటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని సెజ్‌లను కూడా ఏర్పాటు చేశారు. అవి:
  • రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో సెమీ కండక్టర్ పరిశ్రమల కోసం ‘ఫ్యాబ్ సిటీ’ పేరుతో సెజ్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని టీఐఐసీ అభివృద్ధి చేసింది.
  • హైదరాబాద్‌లో రహేజా ఐటీ పార్కును 10 మిలియన్ల చదరపు అడుగుల్లో రూ. 1500 కోట్ల పెట్టుబడులతో సుమారు 40,000 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేశారు.
  • రాష్ట్రంలో ప్రధానమైన ఐటీ క్లస్టర్ అయిన ‘రహేజా’ ఐటీ పార్కు టీఐఐసీతో కలిసి రంగారెడ్డి జిల్లా ‘మాదాపూర్’ గ్రామంలో 110 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ సెజ్‌ను అభివృద్ధి చేసింది.
2013-14 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని సెజ్‌లు 1184.13 కోట్ల రూపాయల పెట్టుబడులను కలిగి, రూ. 2,108.69 కోట్ల ఎగుమతులు చేశాయి. వీటి ద్వారా 2,199 మందికి ప్రత్యక్షంగా, 1761 మందికి పరోక్షంగా ఉపాధి కలిగింది.

వృద్ధి కేంద్రాలు (గ్రోత్ సెంటర్లు)
వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను ఆకర్షించి, ప్రాంతీయ సమానాభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో 2006లో కేంద్ర ప్రభుత్వం వృద్ధి కేంద్రాలను అనుమతించింది.
  • వృద్ధి కేంద్రాలుగా అనుమతించిన ప్రాంతాల్లో నీరు, విద్యుత్, టెలి కమ్యూనికేషన్, రోడ్ల లాంటి అవస్థాపనా సౌకర్యాలను కల్పించి, వాటిలో పరిశ్రమల ఏర్పాటుకు వీలు కల్పిస్తున్నారు.
  • తెలంగాణ రాష్ట్రానికి మహబూబ్‌నగర్ జిల్లాలోని ‘జడ్చర్ల’లో ఒక వృద్ధి కేంద్రం మంజూరైంది.
  • ఒక్కో వృద్ధి కేంద్రానికి రూ. 30 కోట్లను కేటాయించారు. ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2 : 1 నిష్పత్తిలో భరిస్తాయి.
  • మన రాష్ట్రంలో వృద్ధి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ‘తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్’ (టీఐఐసీ) చూస్తుంది.
ఇంటిగ్రేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెంటర్లు (ఐఐడీసీ)
చిన్న తరహా, సూక్ష్మ గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ స్కీం’ను తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా వెనుకబడిన జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో (వృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయని ప్రాంతాల్లో) పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి తద్వారా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల మధ్య బలమైన అనుసంధానానికి దేశవ్యాప్తంగా 50 ఐఐడీసీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు.
  • ఐఐడీసీల స్థాపనకు అయ్యే వ్యయంలో కొంత భాగాన్ని కేంద్రం గ్రాంట్ల రూపంలో మంజూరు చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని సిడ్బీ ద్వారా రుణాల రూపంలో అందిస్తారు.
  • తెలంగాణ రాష్ట్రానికి రెండు ఐఐడీసీలు మంజూరయ్యాయి. అవి:
    1) మడికొండ, వరంగల్ జిల్లా
    2) గాజుల రామారం, రంగారెడ్డి జిల్లా
  • తెలంగాణ రాష్ట్రం ‘ఇ-గవర్నెన్స్’ను అమలు పరచడంలో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఇది ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు మార్గదర్శకత్వం వహిస్తోంది.
  • దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్ర వాటా 10.5 శాతంగా ఉంది.
నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు (ఎన్‌ఐఎంజడ్)
దేశంలో తయారీ రంగం వాటాను జీడీపీలో ప్రస్తుతం ఉన్న 16 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని ‘జాతీయ తయారీ రంగ విధానం’ ముఖ్య లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్య సాధనకు తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా దేశవ్యాప్తంగా 16 ఎన్‌ఐఎంజడ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ‘మెదక్’ జిల్లాలో ఒక ఎన్‌ఐఎంజడ్‌ను ఏర్పాటు చేయనుంది.
  • ఒక్కో ఎన్‌ఐఎంజడ్‌కు కావాల్సిన పెట్టుబడిని రూ. 30,000 కోట్లుగా, దీనికి అనుగుణంగా ఉద్యోగ కల్పన మూడు లక్షలుగా అంచనా వేశారు.
తెలంగాణలోని అపెరల్ ఎక్స్‌పోర్ట్ పార్కులు/ టెక్స్‌టైల్ పార్కులు
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) కింద పేర్కొన్న ప్రాంతాల్లో అపెరల్/ టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేసింది.
  • అపెరల్ ఎక్స్‌పోర్ట్ పార్కు - గుండ్ల పోచంపల్లి, రంగారెడ్డి జిల్లా.
  • టెక్స్‌టైల్ పార్కు - సిరిసిల్ల, కరీంనగర్ జిల్లా.
  • టెక్స్‌టైల్ పార్కు - పాశమైలారం, మెదక్ జిల్లా.
  • టెక్స్‌టైల్ పార్కు - మల్కాపూర్, నల్లగొండ జిల్లా.
  • సూరత్, కోయంబత్తూర్‌కు దీటుగా ‘వరంగల్’ నగర శివారులో ఒక మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
  • తెలంగాణలో రెండు ‘ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల’ (ఈఎంసీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. వీటిలో ఒక ఈఎంసీని రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో ‘ఇ-సిటీ’లో 602 ఎకరాల విస్తీర్ణంలో, రెండోదాన్ని హైదరాబాద్‌లో 310 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.
  • కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులతో ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)కు ఆమోదం తెలిపింది. దీని విస్తీర్ణం 202 చదరపు కిలోమీటర్లు. ప్రత్యక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
Published date : 18 Nov 2015 12:00PM

Photo Stories