రాష్ర్టంలోని ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలు
ఇక్రిశాట్
రాష్ర్టంలో ఏర్పాటైన ఏకైక అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఇక్రిశాట్. దీన్ని 1972లో మెదక్ జిల్లా పటాన్‌చెరు వద్ద ఏర్పాటు చేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో అర్ధశుష్క వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరిగే వంగడాలకు రూపకల్పన చేస్తోంది. సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణనిస్తోంది. మెట్ట ప్రాంత వ్యవసాయ సాగుపై పరిశోధనలు చేస్తోంది. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రోపిక్స్‌కు సంక్షిప్త రూపమే ఇక్రిశాట్. ఈ సంస్థ ప్రస్తుత డెరైక్టర్ జనరల్ డేవిడ్ బెర్‌గవిన్‌సన్.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)
బీఈఎల్ మొదటి యూనిట్‌ను బెంగళూరులో 1954లో స్థాపించారు. ఇది రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీని 9వ యూనిట్‌ను 1986లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ రక్షణ శాఖకు అవసరమైన ఎలక్ట్రానిక్ అవసరాలను తీరుస్తోంది. దీనికి నవరత్న హోదా కల్పించారు.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)
దేశంలో మొత్తం ఆరు బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మెదక్ జిల్లాలోని రామచంద్రాపురంలో 1963లో బీహెచ్‌ఈఎల్‌ను స్థాపించారు. దేశంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఇదొకటి. ఇక్కడ టర్బైన్లు, జనరేటర్లు, సర్క్యూట్ బ్రేకర్లు తయారవుతాయి. ఇది థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. దీనికి మహారత్న హోదా ఉంది.
ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ (ఐడీపీఎల్)
ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అతిపెద్ద ఫార్మా రంగ సంస్థ. దీన్ని 1961లో ఢిల్లీలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఆరు ఐడీపీఎల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ యూనిట్‌ను 1967లో బాలానగర్‌లో స్థాపించారు. అత్యవసర, జీవనాధార మందుల తయారీలో స్వయం సమృద్ధి సాధనకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతోంది.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)
1967 ఏప్రిల్ 11న హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఇది అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాల పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధనలో కీలకపాత్ర పోషిస్తోంది.
దేశంలో తొలి డిజిటల్ కంప్యూటర్‌ను ఈసీఐఎల్ రూపొందించింది. దేశంలో తొలి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నియంత్రణ పరికర వ్యవస్థలను, టెలివిజన్లను ఈ సంస్థ రూపొందించింది.
ప్రాగా టూల్స్
దీన్ని 1959లో హైదరాబాద్‌లో స్థాపించారు. యంత్రాల విడి పరికరాలు, కట్టర్లు, టూల్స్, గ్రైండర్లు, త్రెడ్ రోలింగ్ మిషన్లు మొదలైన వాటిని ఇది రూపొందిస్తోంది.
హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)
హెచ్‌సీఎల్‌ను రంగారెడ్డి జిల్లాలో, పశ్చిమ బెంగాల్‌లోని రూప్ నారాయణ్‌పూర్‌లో స్థాపించారు. ఇది భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో పని చేస్తోంది. హెచ్‌సీఎల్‌లో టెలికాం కేబుల్స్‌ను తయారు చేస్తున్నారు.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)
భారత్‌లో హెచ్‌ఏఎల్‌కు ఆరు యూనిట్లు ఉన్నాయి. 1965లో రంగారెడ్డి జిల్లాలో హెచ్‌ఏఎల్ యూనిట్‌ను ప్రారంభించారు. దీనికి నవరత్న హోదా కల్పించారు. ఇందులో విమానయాన యంత్ర భాగాలను ఉత్పత్తి చేస్తున్నారు. రేడియో అల్టీమీటర్ తయారీలో హెచ్‌ఏఎల్ హైదరాబాద్ డివిజన్‌ది కీలకపాత్ర. ఇది కమ్యూనికేషన్, నావిగేషన్లలో రక్షణ శాఖకు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది.
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ)
దీని దక్షిణ ప్రాంత మండల ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఇది గ్రామీణ ప్రాంత విద్యుదీకరణకు ఆర్థిక సహాయం అందిస్తోంది. దీనికి నవరత్న హోదా ఉంది.
హిందుస్తాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ (హెచ్‌ఎంటీ)
దేశంలో ఆరు హెచ్‌ఎంటీ పరిశ్రమలున్నాయి. వాటిలో ఒకటి రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఈ పరిశ్రమలో గడియారాలు, బల్బులు, లేత్, బోర్, మిల్లింగ్ యంత్రాలు తయారవుతాయి.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)
ఇది భారత ప్రభుత్వ పరిపాలన నియంత్రణ, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. దీన్ని 1970లో ప్రారంభించారు. ఈ పరిశ్రమలో క్షిపణులను రూపొందిస్తారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్, మెదక్ జిల్లాలోని భానూర్‌లో దీని తయారీ కేంద్రాలున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రెండు యూనిట్లను స్థాపించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్
దీన్ని 1973లో రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించారు. పారిశ్రామికీకరణ వేగవంతమయ్యేందుకు తోడ్పడే లోహాలు, మిశ్రమ లోహాలు ముఖ్యంగా టైటానియం లాంటి లోహాల తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది.
డిఫెన్‌స రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబోరేటరీ (డీఆర్‌డీఎల్)
దీన్ని 1962లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. భారత రక్షణ వ్యవస్థను పటిష్టపర్చడంలో ఈ కంపెనీది కీలకపాత్ర. క్షిపణి వ్యవస్థ రూపకల్పన, క్షిపణుల తయారీ ప్రయోగాల్లో ఇది కృషి చేస్తోంది. ఈ సంస్థ ద్వారా అభివృద్ధి చేసిన ఆకాశ్, నాగ్, పృథ్వీ, అగ్ని తదితర క్షిపణులు భారత సైన్యాన్ని పటిష్టం చేశాయి.
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ)
అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో మౌలాలీలో 1971లో దీన్ని ఏర్పాటు చేశారు. న్యూక్లియర్ ఫ్యూయల్ బండిల్స్, రియాక్టర్ కోర్ పదార్థాలను ఇది తయారు చేస్తోంది. యురేనియం ఇంధనం, జిర్కోనియం మిశ్రమ లోహ క్లాండింగ్‌ను రూపొందించింది.
భార జల కేంద్రం (హెవీ వాటర్ ప్లాంట్)
ఈ కేంద్రాన్ని ఖమ్మం జిల్లాలోని మణుగూరులో ఏర్పాటు చేశారు. దీనిలో డ్యూటీరియం ఆక్సైడ్ (D2O) తయారు చేస్తున్నారు. అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని స్థిరీకరించేందుకు భారజలాన్ని వాడతారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)
ఇది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ప్రపంచస్థాయి ఆయుధాల తయారీలో, స్వదేశీ పరిజ్ఞానం ద్వారా సైన్యానికి కావాల్సిన ఆయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి సాధనకు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది.
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ)
కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 1958లో ఎన్‌ఎండీసీని ఏర్పాటు చేశారు. ముడి ఇనుము, రాగి, డోలమైట్, టంగ్‌స్టన్ తదితర ఖనిజాలను వెలికి తీయడానికి, ముడి ఖనిజాలను వేరు చేయడానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని ఈ సంస్థ అందిస్తోంది. ఖనిజ వనరులపై పరిశోధనా కార్యక్రమాలను చేపడుతోంది.
నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ
సికింద్రాబాద్‌లోని హకీంపేటలో ఏర్పాటు చేశారు. భారీ పరిశ్రమలకు సెక్యూరిటీ నిర్వహణ, విపత్తు నిర్వహణలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ (సీడీఎం)
దీన్ని 1970లో సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, సైన్యంలో మేనేజ్‌మెంట్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలను పెంచడం కోసం ఇది కృషి చేస్తోంది.
ఆర్‌మడ్ ఫోర్సెస్‌కు మేనేజ్‌మెంట్ రంగంలో శిక్షణనిచ్చే ఆసియాలోని ఏకైక సంస్థ ఇది.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ
మెదక్ జిల్లాలోని ఎద్దుమైలారంలో 1987లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ యుద్ధ ట్యాంకు(ఐసీవీ)లను తయారు చేస్తున్నారు.
తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం - 2015
- పారిశ్రామిక వర్గాలను ఆకర్షించడానికి రాష్ర్ట ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్‌ను రూపొందించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 2015 జూన్ 12న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో టీఎస్-ఐపాస్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. నూతన పారిశ్రామిక విధానంలో నూరు శాతం అవినీతి రహితంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని ప్రకటించారు. దరఖాస్తు చేసిన 10, 12 రోజుల్లోనే అనుమతులు జారీ చేస్తారు.
- ఈ కార్యక్రమంలోనే సోలార్ విద్యుత్ విధానాన్ని ప్రకటించారు.
- నూతన విధానంలో తెలంగాణ ప్రభుత్వం 14 కీలక రంగాలపై దృష్టి సారించింది.
- ‘కనీస తనిఖీ గరిష్ట సౌలభ్యత’ నినాదం దీని ప్రధానాంశం.
- రాష్ర్టంలో ఆరు పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- మొదటి దశలో భాగంగా హైదరాబాద్ - వరంగల్,హైదరాబాద్ - నాగ్‌పూర్, హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తారు.
- రెండో దశలో భాగంగా హైదరాబాద్ - మంచిర్యాల, హైదరాబాద్ - నల్లగొండ, హైదరాబాద్ - ఖమ్మం పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తారు.
- దళితులు, గిరిజనులకు నేరుగా రుణసాయం, వారి తరఫున మార్జిన్ మనీ చెల్లింపు.
- రాష్ర్టంలోని 9 జిల్లాల్లో మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు.
- రాష్ర్టంలోని పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంపు, సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం, ఉత్పత్తికి ప్రోత్సాహం.
- నీటి పారుదల ప్రాజెక్టుల్లో పది శాతం పరిశ్రమలకు కేటాయింపు. టీఎస్‌ఐఐసీ ద్వారా నీటి సౌకర్యం.
- రూ. 200 కోట్లకుపైగా పెట్టుబడి, వెయ్యి మందికిపైగా ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకు సీఎస్ నేతృత్వంలోని ‘తెలంగాణ స్టేట్‌వైడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ బోర్‌డ’ అనుమతులు మంజూరు చేస్తుంది.
- టీఎస్-ఐపాస్ విధానాన్ని సింగిల్ విండో క్లియరెన్స్ పద్ధతి అంటారు.
- తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ సంక్షిప్త రూపమే టీఎస్-ఐపాస్.
మాదిరి ప్రశ్నలు
1. భారజల కర్మాగారం ఎక్కడ ఉంది?
1) పటాన్‌చెరు
2) మణుగూరు
3) రామగుండం
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
2. అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ఏ జిల్లాలో ఉంది?
1) హైదరాబాద్
2) రంగారెడ్డి
3) మెదక్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
3. తెలంగాణలో ఒక పరిశ్రమను మెగా పరిశ్రమగా గుర్తించాలంటే కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలి?
1) రూ. 250 కోట్లు
2) రూ. 200 కోట్లు
3) రూ. 300 కోట్లు
4) రూ. 150 కోట్లు
- View Answer
- సమాధానం: 2
4. ఇచ్చిన వాటిలో మహారత్న హోదా పొందిన సంస్థ?
1) బీఈఎల్
2) ఈసీఐఎల్
3) ఐడీపీఎల్
4) బీహెచ్‌ఈఎల్
- View Answer
- సమాధానం: 4
5. ముల్కనూర్ మహిళా సహకార డైరీ ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్
2) ఆదిలాబాద్
3) కరీంనగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
6. ఇచ్చిన వాటిలో రక్షణ శాఖకు సంబంధించిన వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ?
1) బీడీఎల్
2) ఈసీఐఎల్
3) హెచ్‌ఏఎల్
4) హెచ్‌సీఎల్
- View Answer
- సమాధానం: 1
7. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ) ఎక్కడ ఉంది?
1) మణుగూరు
2) పాల్వంచ
3) రామచంద్రాపురం
4) మౌలాలీ
- View Answer
- సమాధానం: 4
8. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ఎక్కడ ఉంది?
1) రామగుండం
2) రామచంద్రాపురం
3) గచ్చిబౌలి
4) కొత్తగూడెం
- View Answer
- సమాధానం: 2
9. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1970
2) 1963
3) 1958
4) 1967
- View Answer
- సమాధానం:3
10. టెలివిజన్లను ఉత్పత్తి చేసే సంస్థ ఏది?
1) ఎన్‌ఎఫ్‌సీ
2) బీడీఎల్
3) ఈసీఐఎల్
4) హెచ్‌సీఎల్
- View Answer
- సమాధానం: 3