Skip to main content

రాజ్యాంగం- మౌలిక నిర్మాణ సిద్ధాంతం

దేశ పరిపాలనకు సంబంధించి రాజ్యాంగం అత్యున్నతమైంది. రాజ్యాంగ బద్ధమైన పాలన ఎప్పుడూ ప్రజలు హర్షించేదిగా ఉంటుంది. అదే సమయంలో రాజ్యాంగం కాలమాన పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు చెందడం అత్యవసరం. దీన్ని గుర్తించిన భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సవరణ విధానాన్ని రాజ్యాంగంలోనే పొందుపరిచారు. అయితే సవరణలు రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి భంగం కలిగించేవిగా ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి.
నియమ నిబంధనలు
రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో ప్రకరణ 368లోని కింది నియమాలను పాటించాలి.
  • రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రతిపాదించవచ్చు. రాష్ర్ట శాసనసభలకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లేదు.
  • రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రితో పాటు సాధారణ సభ్యుడు కూడా ప్రతిపాదించవచ్చు. (ప్రభుత్వ బిల్లు లేదా ప్రైవేట్ మెంబర్ బిల్లు)
  • రాష్ర్టపతి ముందస్తు అనుమతి అవసరం లేదు.
  • రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభలు నిర్ణీత మెజార్టీతో వేర్వేరుగా ఆమోదించాలి. ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరిస్తే, ప్రతిష్టంభన తొలగించడానికి సంయుక్త సమావేశానికి ఆస్కారం లేకపోవడం వల్ల బిల్లు వీగిపోతుంది.
  • సమాఖ్య అంశాలకు సంబంధించిన ప్రకరణలను సవరించేందుకు సగానికి పైగా రాష్ర్టల శాసనసభల ఆమోదం తప్పనిసరి.
  • పార్లమెంటు, రాష్ర్ట శాసనసభల ఆమోదం తెలిపిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ర్టపతి ఆమోద ముద్రకు పంపుతారు.
రాష్ర్టపతి తప్పనిసరిగా తన ఆమోదాన్ని తెలపాలి. తిరస్కరించడానికి లేదా పునఃపరిశీలనకు పంపేందుకు అవకాశం లేదు.

గమనిక: రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ర్టపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలనే నియమాన్ని 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
  • రాష్ర్టపతి ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది. చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి రాజ్యాంగాన్ని సవరించినట్టు పరిగణిస్తారు.
  • రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షకు గురవుతుంది.
విమర్శ: రాజ్యాంగ సవరణలో అనేక లోపాలున్నాయనే విమర్శలున్నాయి.
ఎ) రాజ్యాంగ సవరణకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు / సభ లేకపోవడం
బి) సవరించే అధికారాన్ని పార్లమెంటుకే పరిమితం చేయడం.
సి) రాష్ట్రాలకు రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించే అధికారం లేదు. అమెరికాలోని రాష్ట్రాలకు ఆ అధికారం ఉంది.
డి) రాజ్యాంగ సవరణలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే పరిష్కారానికి సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు.
ఇ) రాజ్యాంగంలోని అధిక భాగాలు పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించేవిగా ఉండటం (రాష్ట్రాల భాగస్వామ్యం అతి తక్కువగా ఉండటం)
ఎఫ్) రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాల ఆమోదంలో జాప్యం జరగవచ్చు. దీనికి కారణం రాష్ట్రాలు నిర్ణీత సమయంలోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించాల్సిన అవసరం లేదు.
జి) రాజ్యాంగంలోని కొన్ని భాగాలను సాధారణ చట్టాన్ని సవరించే పద్ధతిలోనే సవరించవచ్చు. తద్వారా రాజ్యాంగ పవిత్రత దెబ్బతింటుంది.

భారత రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం- సుప్రీంకోర్టు
పార్లమెంటు రాజ్యాంగాన్ని ఏ మేరకు సవరించవచ్చు అనే అంశానికి సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి పరిమితులను పేర్కొనలేదు. అయితే సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా రాజ్యాంగ సవరణ అధికారాలపై పరిమితులు విధించే ప్రయత్నం చేసింది. దీంతో ‘మౌలిక నిర్మాణ సిద్ధాంతం’ అనే ఒక న్యాయపరమైన పరిమితి ఆవిష్కృతమైంది. మౌలిక నిర్మాణ సిద్ధాంత పరిణామాన్ని ఈ కింది విధంగా వివరించవచ్చు.
  • 1951లో చేసిన మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూలులో చేర్చిన 31ఎ, 31బి ప్రకరణలు శంకరీ ప్రసాద్ గట యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పరిశీలనలోకి వచ్చాయి. ఈ సవరణ ఆస్తి హక్కుకు సంబంధించినది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ పార్లమెంట్‌కు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం ఉందని పేర్కొంది. ప్రకరణ 13లో పేర్కొన్న చట్ట నిర్వచనంలోకి రాజ్యాంగ సవరణ రాదని, ప్రాథమిక హక్కులను సవరిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ ప్రకరణ 13కు వ్యతిరేకం కాదని పేర్కొంది.
  • అయితే 1967లో గోలక్‌నాథ్ గట స్టేట్ ఆఫ్ పంజాబ్ వివాదంలో సుప్రీంకోర్టు శంకరీప్రసాద్ కేసులో చెప్పిన తీర్పునకు విరుద్ధమైన తీర్పును వెల్లడించింది. 17వ రాజ్యాంగ సవరణను ప్రశ్నిస్తూ గోలక్‌నాథ్ అనే భూస్వామి సుప్రీంకోర్టులో కేసును దాఖలు చేశాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ, ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవని వాటిని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది.
రాజ్యాంగ సవరణ కూడా ప్రకరణ 13 ప్రకారం చట్ట నిర్వచన పరిధిలోకి వస్తుందని దానికి విఘాతం కలిగించే రాజ్యాంగ సవరణలు చెల్లవని తీర్పు చెప్పింది.

గోలక్‌నాథ్ కేసులో రాజ్యాంగ సవరణపై పార్లమెంటుకున్న అధికారాలపై సుప్రీంకోర్టు విధించిన పరిమితులను తొలగించడానికి పార్లమెంటు 1971లో 24వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ సవరణ ద్వారా ప్రకరణ 13, 368ను సవరించారు. పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని, ఆయా రాజ్యాంగ సవరణలను ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించరాదని ప్రకరణ 13, 368కి సవరణ చేశారు. 24వ రాజ్యాంగ సవరణ కేశవానంద భారతి కేసులో(1973లో) సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెబుతూ, 1971లో చేసిన 24వ రాజ్యాంగ సవరణ చెల్లుతుందని, పార్లమెంటు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించవచ్చని తీర్పు చెప్పింది. అయితే మౌలిక నిర్మాణాన్ని సవరించరాదని పరిమితి విధించింది.

ప్రముఖుల వ్యాఖ్యానాలు
రాజ్యాంగంలో దృఢ, అధృఢ లక్షణాలు మిళితమై ఉన్నాయి. మౌలికంగా దృఢమైన రాజ్యాంగం అయినప్పటికీ కొన్ని అదృఢ లక్షణాలను కూడా చొప్పించారు. కింది ప్రముఖుల వ్యాఖ్యానాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
  • భారత రాజ్యాంగ సవరణ పద్ధతి దృఢ, అదృఢ లక్షణాల మధ్య మంచి సమతుల్యాన్ని సాధించింది. సవరణ పద్ధతిలో వైవిధ్యం ఉంది. ఇది చాలా అరుదు, వివేకవంతమైంది. - కె.సి.వేర్
  • సవరణ పద్ధతి బయటకు సంక్లిష్టంగా కన్పించినా, అది కేవలం విశిష్టతకు నిదర్శనం. - గ్రాన్‌విల్ ఆస్టిన్
  • భారతదేశానికి కఠిన, శాశ్వతమైన రాజ్యాంగ సవరణ పద్ధతి ఏర్పాటు చేయాలనుకున్నా, శాశ్వతం అనేది రాజ్యాంగానికి ఉండదు. కొంత సరళత అవసరం. రాజ్యాంగం దృఢమైంది అయితే దేశ అభివృద్ధికి ఆటంకమవుతుంది. - జవహర్ లాల్ నెహ్రూ
  • రాజ్యాంగ సవరణ విధానం ఒక మూస పద్ధతిని ఎంచుకోలేదు. ఇదే అంతిమం, సవరణకు అతీతం అనే ‘లేబుల్’ ఏర్పాటు చేయదల్చుకోలేదు, ఒక సరళ విధానాన్ని పొందుపర్చటం జరిగింది. -డా.బి.ఆర్ అంబేద్కర్
Published date : 15 Jun 2016 06:40PM

Photo Stories