రాజ్యాంగబద్ధ సంస్థలు
భారత రాజ్యాంగంలోని ఐదో భాగం, ఒకటో అధ్యాయంలో అటార్నీ జనరల్ పదవి గురించి వివరించారు. ఆర్టికల్ 76 ప్రకారం ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ర్టపతి అటార్నీ జనరల్‌ను నియమిస్తారు. ఆర్టికల్ 76(1) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి ఉండాల్సిన అర్హతలన్నీ అటార్నీ జనరల్ నియామకానికి అవసరం. ‘అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా’ పదవిని బ్రిటన్ నుంచి గ్రహించారు. అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి మొదటి న్యాయాధికారి, భారతదేశంలోనూ తొలి న్యాయాధికారి. సుప్రీం కోర్టులో, దేశంలోని అన్ని హైకోర్టుల్లో వాదించే అధికారం ఉన్న ఏకైక వ్యక్తి అటార్నీ జనరల్. కేంద్రానికి సంబంధించిన అన్ని రకాల వివాదాంశాలపై న్యాయస్థానాల్లో వాదించే అధికారం ఉన్న ప్రధాన న్యాయాధికారి ఇతడే. విధి నిర్వహణలో అటార్నీ జనరల్‌కు ఇద్దరు సోలిసిటర్ జనరల్స్, నలుగురు అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్స్ సహాయం చేస్తారు.
అటార్నీ జనరల్ పదవిలో ఉన్న వ్యక్తి ఏ కంపెనీలోనూ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించరాదు. ఆర్టికల్ 88 ప్రకారం అటార్నీ జనరల్ పార్లమెంట్‌లో సభ్యుడు కాకపోయినా ఉభయ సభల చర్చల్లో పాల్గొనే అధికారం ఉంది. కానీ ఓటు వేసే అధికారం లేదు. కేంద్రం అనుమతి లేకుండా అటార్నీ జనరల్ ఎవరి కేసుల్లోనూ వాదనలు వినిపించకూడదు. ఆర్టికల్ 76(4) ప్రకారం రాష్ర్టపతి విశ్వాసం చూరగొన్నంత వరకు అటార్నీ జనరల్ అధికారంలో ఉంటాడు. రాష్ర్టపతి నిర్ణయించిన జీతభత్యాలను పొందుతాడు. అటార్నీ జనరల్ ప్రస్తుత వేతనం రూ. 90,000. వేతనంతో పాటు ఇతర సౌకర్యాలను పొందుతాడు. అటార్నీ జనరల్ రాజీనామా లేఖను రాష్ర్టపతికి సమర్పించాలి. భారత రాష్ర్టపతి న్యాయపరమైన అంశాలపై సూచనలు, సలహాలు కోరితే వివరణాత్మకమైన సూచనలు, సలహాలు ఇచ్చే అధికారం అటార్నీ జనరల్‌కు ఉంది.
అటార్నీ జనరల్స్- పదవీకాలం
పేరు | పదవీకాలం |
ఎం.సి. సెతల్వాడ్ | 1950-1963 |
సి.కె. దప్తరి | 1963-1968 |
నిరిండె | 1968-1977 |
ఎస్.వి.గుప్తా | 1977-1979 |
ఎల్.ఎన్. సినా | 1979-1983 |
కె.పరాశరన్ | 1983-1989 |
సోలి జె. సొరాబ్జీ | 1989-1990 |
జి.రామస్వామి | 1990-1992 |
మిలాన్ కె. బెనర్జీ | 1992-1996 |
అశోక్ కె. దేశాయ్ | 1996-1998 |
సోలీ జె. సొరాబ్జీ | 1998-2004 |
మిలాన్ కె. బెనరీ | 2004-2009 |
గులాం ఇ. వాహనవతి | 2009-2014 |
ముకుల్ రోహిత్గి | 2014 - ప్రస్తుతం |
అడ్వకేట్ జనరల్ (ఎ.జి.)
రాజ్యాంగంలోని ఆర్టికల్ 165 ప్రకారం సంబంధిత రాష్ర్ట ముఖ్యమంత్రి సూచన మేరకు అడ్వకేట్ జనరల్‌ను గవర్నర్ నియమిస్తారు. రాష్ర్టంలో మొదటి న్యాయాధికారి అడ్వకేట్ జనరల్. గవర్నర్ విశ్వాసం చూరగొన్నంత వరకు ఎ.జి. పదవిలో కొనసాగుతాడు. రాష్ర్ట శాసన సభ చర్చల్లో అడ్వకేట్ జనరల్ పాల్గొంటాడు, కానీ ఓటువేసే అధికారం లేదు. అడ్వకేట్ జనరల్‌గా నియమితుడయ్యే వ్యక్తికి హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలుండాలి. ఆర్టికల్ 165(1), 165(3)లో అడ్వకేట్ జనరల్ అర్హతలు, జీతభత్యాలను స్పష్టంగా ప్రస్తావించారు. గవర్నర్ నిర్ణయం మేరకు రాష్ర్ట సంఘటిత నిధి నుంచి అడ్వకేట్ జనరల్ వేతనాన్ని చెల్లిస్తారు. అడ్వకేట్ జనరల్ ప్రస్తుత వేతనం రూ.80,000. ఆర్టికల్ 194(4) ప్రకారం ఎమ్మెల్యేలకు వర్తించే హక్కులు, రక్షణలన్నీ అడ్వకేట్ జనరల్‌కు వర్తిస్తాయి. ఆయన రాష్ర్ట కార్య నిర్వాహక వర్గంలో అంతర్భాగం. కానీ రాష్ర్టమంత్రి మండలిలో అంతర్భాగం కాదు.
అడ్వకేట్ జనరల్స్
పేరు | పదవీకాలం |
డి.నరసరాజు | 1956-1963 |
బి.వి.సుబ్రమణ్యం | 1964-1969 |
పి.రామచంద్రారెడి | 1969-1983 |
కె.సుబ్రమణ్యంరెడి | 1983-1986 |
ఇ.మనోహర్ | 1986-1988 |
వి.వెంకటరమణయ్య | 1988-1990 |
ఆర్.వేణుగోపాల్‌రెడ్డి | 1990-1990 |
వి.ఆర్.రెడ్డి | 1991-1991 |
టి.అనంతబాబు | 1991-1992 |
ఎస్.వెంకట్‌రెడ్డి | 1992-1994 |
ఎస్.రామచంద్రారావు | 1994-1995 |
వి.వెంకటరమణయ్య | 1995-2000 |
టి.అనంతబాబు | 2000-2004 |
డి.సుదర్శన్‌రెడ్డి | 2004-2005 |
సి.వి.మోహన్‌రెడ్డి | 2005-2009 |
డి.వి.సీతారామ్మూర్తి | 2009-2011 |
ఎ.సుదర్శన్‌రెడ్డి | 2011-2014 |
పి.వేణుగోపాల్(ఏపీ) | 2014 నుంచి.. |
కె.రామకృష్ణారెడ్డి(టీఎస్) | 2014 జూన్ నుంచి.. |
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
రాజ్యాంగంలోని ఐదో భాగం, ఐదో అధ్యాయంలో 148 నుంచి 151 వరకు ఉన్న అధికరణలు కాగ్ గురించి తెలుపుతున్నాయి. ఆర్టికల్ 148 ప్రకారం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను రాష్ర్టపతి నియమిస్తారు. ఆర్టికల్ 149 ప్రకారం కేంద్రం, రాష్ట్రాల ఖాతాలను కాగ్ నిర్వహిస్తాడు. ఆర్టికల్ 150 ప్రకారం కేంద్ర, రాష్ట్రాల ఖాతాలను కాగ్ తనిఖీ చేస్తాడు. ఆర్టికల్ 151 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆడిట్ వార్షిక నివేదికను కాగ్ రాష్ర్టపతికి సమర్పిస్తాడు. రాష్ర్టపతి పార్లమెంట్‌కు పంపిస్తారు.
రాష్ట్రాలకు సంబంధించిన ఖాతాలను కాగ్ ఆడిట్ చేసి, వార్షిక నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తాడు. గవర్నర్ రాష్ర్ట శాసనసభకు సమర్పిస్తారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పదవీ కాలం ఆరేళ్లు లేదా ఆ పదవిని చేపట్టిన వ్యక్తికి 65 ఏళ్లు వచ్చే వరకు. కాగ్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే పార్లమెంట్ అభిశంసన ద్వారా రాష్ర్టపతి అతణ్ని పదవి నుంచి తొలగిస్తారు. ప్రభుత్వ ఖాతాల సంఘానికి కాగ్ కళ్లు, చెవుల్లాంటివాడు. భారత సంఘటిత నిధి నుంచి కేంద్రం ఖర్చు చేసిన ధనం చట్ట ప్రకారం ఉందా? లేదా అని కాగ్ తనిఖీ చేస్తాడు.
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కాగ్ పరిధి నుంచి అకౌంటింగ్ బాధ్యతలను వేరు చేశారు. కాగ్ ప్రభుత్వ కంపెనీల ఖాతాలను వ్యాపార పద్ధతిలో ఆడిట్ చేస్తాడు. భారత ప్రభుత్వంలో రాజ్యాంగ సృష్టించిన ముఖ్య అధికారి కాగ్ అని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు. కాగ్ వేతనం, ఇతర సౌకర్యాలను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. కాగ్ వేతనాన్ని పార్లమెంట్ చట్ట ప్రకారం నిర్ణయిస్తారు. పదవిని స్వీకరించేటప్పుడు రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడతానని కాగ్ ప్రమాణం చేయాలి. కాగ్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తి ఏ ఇతర ప్రభుత్వ నియామకాలకు అర్హుడు కాదు. ప్రస్తుతం కాగ్ వేతనం రూ. 90,000.
కేంద్ర సంఘటిత నిధి, రాష్ర్ట సంఘటిత నిధి, కేంద్ర ఆగంతుక నిధి, కేంద్ర పబ్లిక్ నిధి, రాష్ర్ట పబ్లిక్ నిధి, శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల ఖాతాలను కాగ్ పరిశీలించి నివేదిక ఇస్తాడు. కాగ్ పదవిని బ్రిటిష్ వ్యవస్థ నుంచి తీసుకున్నారు. బ్రిటన్‌లో ఈ పదవిని కాంప్ట్ అని పిలుస్తారు. ఆర్‌బీఐ, ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, ఎఫ్‌సీఐ లాంటి సంస్థలు, కార్పొరేషన్లు పూర్తిగా ప్రైవేట్ ఆడిటర్‌లతో తమ ఖాతాలను తనిఖీ చేయిస్తాయి. ఈ అంశంలో కాగ్‌కు సంబంధం ఉండదు. ఈ సంస్థలు తమ వార్షిక ఖాతాల నివేదికలను పార్లమెంట్‌కే సమర్పిస్తాయి.
కాగ్ వెలికితీసిన కుంభకోణాలు
- టెలికాం 2జీ (రెండో తరం) స్పెక్ట్రం వేలం.
- ముంబై ఆదర్‌శ హోసింగ్ సొసైటీ కుంభకోణం, కామన్‌వెల్త్ క్రీడల్లో అవినీతి, బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలు.
- ఓఎన్‌జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) నుంచి వేలం ప్రక్రియ నిర్వహించకుండానే గ్యాస్ నిక్షేపాలను వెలికి తీసేందుకు రిలయన్స్ సంస్థకు అనుమతి ఇవ్వడం.
- దేవాస్ అనే ప్రైవేట్ కంపెనీకి లాభం చేకూర్చేలా అత్యంత విలువైన ఎస్-బ్యాండ్ ప్రసారాలకు రహస్యంగా అనుమతి మంజూరు చేయడం.
- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లోపాలు.
- అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ హెలికాఫ్టర్ కొనుగోలు ఒప్పందం.
పేరు | పదవీకాలం |
నరహరి రావ్ | 1949-1954 |
ఎ.కె. చాంద్ | 1954-1960 |
ఎస్.హెచ్.ఎ.కె.రాయ్ | 1960-1966 |
ఎస్.రంగనాథన్ | 1966-1972 |
ఎ.భక్షి | 1972-1978 |
జి.ప్రకాశ్ | 1978-1984 |
టి.ఎన్. చతుర్వేది | 1984-1990 |
సి.జె. సోమయ్య | 1990-1996 |
వి.కె. షుంగ్లు | 1996-2002 |
వి.ఎన్. కౌల్ | 2002-2008 |
వినోద్‌రాయ్ | 2008-2013 |
శశికాంత్ శర్మ | 2013- ప్రస్తుతం |