భారత జాతీయ సంస్థలు
మానవ హక్కుల కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి లేదు. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ మాత్రమే. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దీన్ని మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993 ప్రకారం ఏర్పాటు చేశారు. 2006లో దీనికి కొన్ని సవరణలు చేశారు.
నిర్మాణం: మానవ హక్కుల కమిషన్‌లో చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసినవారిని దీనికి చైర్మన్‌గా నియమిస్తారు.
- సభ్యుల్లో ఒకరు పదవిలో కొనసాగుతూ ఉన్న లేదా పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయుండాలి. మరొకరు పదవిలో కొనసాగుతున్న లేదా హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి అయుండాలి.
- మిగిలిన ఇద్దరు మానవ హక్కుల రంగంలో నైపుణ్యం ఉన్నవారై ఉండాలి. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా, మైనార్టీ కమిషన్ చైర్మన్‌లు పదవిరీత్యా సభ్యులు (ఎక్స్-అఫీషియో మెంబర్స్)గా కొనసాగుతారు.
నియామకం: చైర్మన్, సభ్యులను అత్యున్నత కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా ప్రధానమంత్రి కొనసాగుతారు. కేంద్ర హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఉభయ సభల్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు సభ్యులుగా ఉంటారు.
పదవీ కాలం: చైర్మన్, సభ్యుల పదవీ కాలం అయిదేళ్లు. వీరి పదవీ విరమణ వయసు 70 ఏళ్లు. పదవీ విరమణ తర్వాత ఎలాంటి లాభదాయక పదవులు చేపట్టరాదు. వీరు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే యూపీఎస్సీ చైర్మన్‌ను తొలగించే పద్ధతిలోనే తొలగిస్తారు.
విధులు - అధికారాలు
- మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే బాధితుడు కమిషన్‌ను సంప్రదించవచ్చు. బాధితుడి పిటిషన్ స్వీకరించి విచారిస్తుంది. కొన్నిసార్లు సుమోటో (తనంతట తానుగా జోక్యం చేసుకొని)గా విచారణ చేపడుతుంది.
- జైళ్లు, పోలీస్ స్టేషన్లను సందర్శించి అక్కడ నిర్బంధంలో ఉన్న వారికి కనీస సౌకర్యాలు అందుతున్నాయా? లేదా? అనే అంశాలను విచారిస్తుంది. అవసరమైన మార్గదర్శకాలను జారీ చేస్తుంది.
- మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి రాజ్యాంగపర, చట్టపర అంశాలను నిరంతరం సమీక్షించి, అవసరమైన మార్గదర్శకాలను ఇస్తుంది.
- ఉగ్రవాద చర్యల ద్వారా మానవ హక్కులకు భంగం కలిగించే అంశాలను గుర్తించి వాటిని తొలగించడానికి తగిన సూచనలు చేస్తుంది.
- మానవ హక్కుల సంరక్షణ కోసం ప్రయత్నించే సంస్థలను ప్రోత్సహిస్తుంది.
- మానవ హక్కుల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్లు
1. జస్టిస్ రంగనాథ్ మిశ్రా: 1993-1996
2. జస్టిస్ వెంకటాచలయ్య: 1996-1999
3. జస్టిస్ జె.ఎస్. వర్మ: 1999-2002
4. జస్టిస్ ఎ.ఎస్. ఆనంద్: 2002-2007
5. జస్టిస్ రాజేంద్రబాబు: 2007-2010
6. జస్టిస్ కె.జి. బాలకృష్ణన్: 2010-2015
7. జస్టిస్ సిరియక్ జోసెఫ్: 2015 - (ప్రస్తుతం కొనసాగుతున్నారు)
జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. మొరార్జీదేశాయ్ హయాంలో కేంద్ర ప్రభుత్వం 1978లో బోళా పాశ్వాన్ శాస్త్రీ అధ్యక్షతన దీనికి సంబంధించి ఒక కమిషన్‌ను నియమించింది. 1990లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారు. 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్‌ను వేరు చేసి ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
నిర్మాణం: ఈ కమిషన్‌లో చైర్మన్, వైస్‌చైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలి. వీరందరినీ రాష్ట్రపతి నియమిస్తారు. వీరు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారై ఉండాలి. వీరి పదవీ కాలం మూడేళ్లు. రాష్ట్రపతికి వీరిని ముందుగానే తొలగించే అధికారం ఉంటుంది. శ్రీరామ్‌దన్ దిలీప్‌సింగ్ భూరియా ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా పి.ఎల్. పునియా కొనసాగుతున్నారు.
విధులు - అధికారాలు
- ఎస్సీలకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అవకాశాలను రక్షించడం, వాటి అమలు తీరును పరిశీలించడం.
- ఎస్సీ కులాల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విచారణ చేయడం.
- ఎస్సీ కులాల ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, వాటి అమలుకు ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.
- ఎస్సీ కులాల అభివృద్ధికి రాష్ట్రపతి, పార్లమెంట్ అప్పగించిన విధులను నిర్వ హించడం.
- ఏదైనా విషయాన్ని విచారించే క్రమంలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్లు
1. సూరజ్‌బాన్: 2004-2007
2. బూటాసింగ్: 2007-2010
3. పి.ఎల్. పునియా: 2010 - (ప్రస్తుతం కొనసాగుతున్నారు)
జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్
ఎస్టీ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ. 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 338(ఎ)ను చేర్చి ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు గురించి పేర్కొన్నారు. ఇది 2004 నుంచి పని చేస్తోంది.
నిర్మాణం: ఎస్టీ కమిషన్‌లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలి. వీరందరూ ఎస్టీలు అయుండాలి. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం మూడేళ్లు.
విధులు - అధికారాలు
- షెడ్యూల్డ్ తెగల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విచారణ చేపట్టడం.
- ఎస్టీలకు రాజ్యాంగపరంగా, శాసనపరంగా కల్పించిన ప్రత్యేక రక్షణ పట్ల అవగాహన కల్పించి చైతన్యపరచడం.
- ఎస్టీల ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వాలకు సలహా ఇవ్వడం.
- ఎస్టీల రక్షణ కోసం అవసరమైన చర్యలపై రాష్ట్రపతికి సలహాలివ్వడం.
- ఏదైనా విషయాన్ని విచారించే విషయంలో ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
జాతీయ ఎస్టీ కమిషన్ చైర్‌పర్సన్లు
1. కుల్వర్‌సింగ్: 2004-2007
2. ఊర్మిలా సింగ్: 2007-2010
3. రామేశ్వర్ వోరాన్: 2010 - (ప్రస్తుతం కొనసాగుతున్నారు)
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్
ఆర్టికల్ - 340 ప్రకారం వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మొదటి బీసీ కమిషన్‌ను 1953లో కాకాసాహెబ్ కాలేకర్ అధ్యక్షతన నియమించారు. రెండో బీసీ కమిషన్‌ను జనతా ప్రభుత్వ హయాంలో 1978లో బి.పి. మండల్ అధ్యక్షతన నియమించారు. ఈ కమిషన్ 1980లో నివేదిక సమర్పించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
నిర్మాణం: ఇందులో చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. సభ్యుల్లో ఒకరు కార్యదర్శిగా కొనసాగుతారు. చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరి పదవీ కాలం మూడేళ్లు. వీరిని ముందుగా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది.
విధులు - అధికారాలు
- ఏదైనా కులాన్ని బీసీ జాబితాలో చేర్చే అంశంపై చర్య తీసుకుంటుంది.
- ఏదైనా కులాన్ని బీసీ జాబితాలో చేర్చడానికి, తొలగించడానికి వచ్చిన వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తుంది.
- బీసీల సంక్షేమానికి చేపట్టిన చర్యలను సమీక్షిస్తుంది.
- ఏ వ్యక్తినైనా విచారణకు కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తుంది.
- వార్షిక నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
బి.సి. కమిషన్ చైర్‌పర్సన్లు
1. జస్టిస్ ఆర్.ఎన్. ప్రసాద్: 1993-1996
2. జస్టిస్ శ్యాంసుందర్: 1997-2000
3. జస్టిస్ బి.ఎల్. మాధవ్: 2000-2005
4. జస్టిస్ రామ్ సూరత్‌సింగ్: 2002-2005
5. జస్టిస్ ఎస్.ఆర్. పాండ్యన్: 2006-2009
6. జస్టిస్ ఎం. నారాయణరావు: 2010-2013
7. జస్టిస్ వంగాల ఈశ్వరయ్య: 2013 - (ప్రస్తుతం కొనసాగుతున్నారు)
జాతీయ మహిళా కమిషన్
జాతీయ మహిళా కమిషన్ చట్టం-1992 ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. ఇది శాసనబద్ధ సంస్థ. దీనికి రాజ్యాంగ హోదా లేదు. ఇందులో చైర్‌పర్సన్, మెంబర్ సెక్రటరీ, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. పదవీ కాలం మూడేళ్లు. వీరు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోతే ఎప్పుడైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది.
విధులు - అధికారాలు
- మహిళలకు కల్పించిన ప్రత్యేక రక్షణల అమలు తీరును పరిశీలించి మరింత మెరుగ్గా అమలు చేయడానికి సలహాలు ఇవ్వడం.
- రాజ్యాంగపరంగా మహిళా సంక్షేమ సంబంధిత అంశాలను సమీక్షించి చేయాల్సిన సవరణలను సూచించడం.
- మహిళల ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి సంబంధించి చేయాల్సిన ప్రణాళికలకు సలహాలివ్వడం.
- మహిళలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి విచారించడం.
- మహిళల సంరక్షణ కోసం చేసిన చట్టాల పట్ల అవగాహన కల్పించి చైతన్యపరచడం.
జాతీయ మహిళాకమిషన్ చైర్ పర్సన్లు
1. జయంతీ పట్నాయక్: 1992-1995
2. మోహినీ గిరి: 1995-1998
3. విభా పార్థసారథి: 1998-2002
4. పూర్ణిమా అద్వానీ: 2002-2005
5. గిరిజా వ్యాస్: 2005-2011
6. మమతాశర్మ: 2011-2014
7. లలిత కుమార మంగళం: 2014 - (ప్రస్తుతం కొనసాగుతున్నారు)
జాతీయ బాలల హక్కుల కమిషన్
2005లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను 2007లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. దీని ఏర్పాటుకు రాజ్యాంగ స్ఫూర్తి, ఐక్యరాజ్య సమితి తీర్మానాలు దోహదపడ్డాయి. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారిని బాలలుగా గుర్తిస్తారు.
నిర్మాణం: ఈ కమిషన్‌లో చైర్‌పర్సన్, ఆరుగురు సభ్యులుంటారు. వీరిలో ఇద్దరు మహిళా సభ్యులు తప్పనిసరి. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. పదవీ కాలం మూడేళ్లు. పదవీ విరమణ వయసు చైర్‌పర్సన్‌కు 65 ఏళ్లు, సభ్యులకు 60 ఏళ్లు. రెండు పర్యాయాల కంటే ఎక్కువసార్లు నియమితులయ్యే అవకాశం లేదు. వీరిని ముందుగానే తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
చైర్‌పర్సన్‌గా నియమితులవ్వాలంటే బాలల సమస్యలపై అవగాహన ఉండాలి. బాలల సంక్షేమానికి కృషి చేసే వ్యక్తి అయ్యుండాలి. సభ్యుల్లో ఒకరు విద్యారంగం, రెండోవారు బాలల ఆరోగ్యం, మూడో వారు బాల నేరస్థుల సమస్యలు, నాలుగో వారు బాలకార్మిక వ్యవస్థ నిషేధం, అయిదో వారు బాలల మానసిక స్థితి, చివరి వారు బాలలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.
కమిషన్ విధులు
1. రాజ్యాంగం, వివిధ చట్టాల ద్వారా బాలలకు కల్పించిన రక్షణల అమలును పరిశీలించి మరింత ఉన్నతంగా అమలు చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేయడం.
2. బాలల హక్కుల ఉల్లంఘన అంశాలపై విచారణ జరిపి అవసరమైన సూచనలు చేయడం.
3. బాలల అభివృద్ధికి, రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడం.
4. బాలల హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం.
5. బాలల హక్కులకు సంబంధించిన పరిశోధనలను ప్రోత్సహించడం.
6. బాలల హక్కులపై సమాజంలో విస్తృత ప్రచారం నిర్వహించడం.
7. బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి సత్వర విచారణకు ప్రత్యేక బాలల కోర్టు ఏర్పాటు చేయడం.
గమనిక: జాతీయ బాలల హక్కుల కమిషన్ తొలి చైర్‌పర్సన్ శాంతా సిన్హా
జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల కమిషన్
భారత రాజ్యాంగంలో అల్ప సంఖ్యాక వర్గాల సంరక్షణకు, సంక్షేమానికి ఆర్టికల్ 29, 30, 350(ఎ), 350 (బి) ప్రత్యేకంగా చేర్చారు. 350(బి) ప్రకారం మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక అధికారిని నియమించాలి. అనంతరం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. దీని ప్రకారం జాతీయ మైనార్టీ కమిషన్‌ను 1978లో ఏర్పాటు చేసి 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా చట్టపరమైన గుర్తింపు కల్పించారు. ఈ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించేందుకు 2005లో 103వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. కేంద్రం ఆరు మతాలకు చెందిన వారిని మైనార్టీలుగా గుర్తించింది.
1) ముస్లింలు 2) సిక్కులు
3) క్రిస్టియన్లు 4) బౌద్ధులు
4) జైనులు 5) పార్శీలు
నిర్మాణం: ఈ కమిషన్‌లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, అయిదుగురు సభ్యులుంటారు. వీరందరూ మైనార్టీలై ఉండాలి. వీరికి మైనార్టీల సమస్యలపై అవగాహన ఉండాలి. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. పదవీకాలం మూడేళ్లు. ముందుగానే వీరిని తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
విధులు, అధికారాలు
1. మైనార్టీల స్థితిగతులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, అందులో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేయడం.
2. మైనార్టీల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చేసిన చట్టాల అమలు తీరును పరిశీలించడం.
3. రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రత్యేక రక్షణల అమలు తీరును పరిశీలించడం.
4. మైనార్టీల హక్కులకు భంగం కలిగినప్పుడు విచారణ జరిపి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం.
5. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను అమలు చేయడం.
6. కేసుల విచారణలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఈ కమిషన్‌కు ఉంటాయి.
సచార్ కమిటీ
ముస్లింల స్థితిగతుల అధ్యయనం కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో ఒక కమిటీని నియమించింది. ఏడుగురు సభ్యులున్న ఈ కమిటీ అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాజేందర్ సింగ్ సచార్ కొనసాగారు. ఈ కమిటీ 2006లో నివేదిక సమర్పించింది. ఈ కమిటీ సిఫారసు మేరకు 2006లో మైనార్టీల సంక్షేమానికి 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. మైనార్టీల విద్య, ఉద్యోగ పరిస్థితులను పరిశీలించేందుకు 2007లో యూపీఏ ప్రభుత్వం రంగనాథ్ మిశ్రా కమిటీని నియమించింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో మైనార్టీలకు తగిన ప్రాతినిధ్యం లేనందువల్ల వారికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ఈ రిజర్వేషన్ కల్పించేందుకు ఓబీసీ రిజర్వేషన్‌లో 8 శాతం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో 7 శాతం కోత విధించాలని పేర్కొంది.
మైనార్టీ కమిషన్ చైర్‌పర్సన్లు
1. మహ్మద్ సర్దార్ అలీఖాన్ - 1993-1996
2. తాహిర్ మహ్మద్ - 1996-1999
3. మహ్మద్ షమీమ్ - 2000-2003
4. తర్లోచన్ సింగ్ - 2003-2006
5. మహ్మద్ హమీద్ అన్సారీ - 2006-2007
6. మహ్మద్ షఫీ ఖురేషీ - 2007-2010
7. వజహత్ హబీబుల్లా - 2011-2014
8. నసీం అహ్మద్ - 2014 నుంచి కొనసాగుతున్నారు.
మాదిరి ప్రశ్నలు
1. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం మైనార్టీ విద్యా సంస్థలను ఏర్పా టు చేసుకోవచ్చు?
ఎ) అధికరణ - 29
బి) అధికరణ - 30
సి) అధికరణ - 350
డి) అధికరణ - 350 (బి)
- View Answer
- సమాధానం: బి
2. భారత రాష్ర్టపతి ఏ అధికరణ ప్రకారం లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు?
ఎ) ఆర్టికల్-350
బి) ఆర్టికల్-330
సి) ఆర్టికల్-331
డి) ఆర్టికల్-333
- View Answer
- సమాధానం: సి
3. మహిళా ప్రగతిశీలతకు ప్రాధాన్యతనిచ్చేది?
ఎ) ఆర్టికల్-16
బి) ఆర్టికల్-15
సి) ఆర్టికల్-16(2)
డి) ఆర్టికల్-15(3)
- View Answer
- సమాధానం: డి
4. ఓబీసీలలో క్రిమీలేయర్‌ను భారత సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది?
ఎ) ఉన్నికృష్ణన్
బి) బాలాజీ
సి) ఇందిరా సహానీ
డి) అశోక్ కుమార్ ఠాకూర్
- View Answer
- సమాధానం: సి
5. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎవరికి కల్పించారు?
ఎ) ఎస్సీ, ఎస్టీలకు
బి) ఓబీసీలకు
సి) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు
డి) ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు
- View Answer
- సమాధానం: ఎ
6. 1953లో ఏర్పాటైన బీసీ కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు?
ఎ) బీపీ మండల్
బి) కాకాసాహెబ్ కాలేకర్
సి) సీతారాం కేసరి
డి) జ్యోతిరావు పూలే
- View Answer
- సమాధానం: బి
7.1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నియమించిన మండల్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
ఎ) 1978
బి) 1979
సి) 1980
డి) 1982
- View Answer
- సమాధానం: సి
8. కింది వాటిలో సరైంది?
ఎ) ఎస్సీ, ఎస్టీ కమిషన్ మొదటి చైర్మన్ - రాందాన్
బి) బీసీ కమిషన్ మొదటి చైర్మన్ - ఆర్ఎన్ ప్రసాద్
సి) మానవహక్కుల కమిషన్ మొదటి చైర్మన్ - రంగనాథ్ మిశ్రా
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
9. కమిషన్ ఏర్పాటుకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) మానవ హక్కుల కమిషన్ - 1993
బి) మహిళా కమిషన్ - 1993
సి) జాతీయ బాలల కమిషన్ - 2007
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
10. కింది వాటిలో రాజ్యాంగ ప్రతిపత్తి లేని సంస్థ?
ఎ) మైనార్టీ కమిషన్
బి) మానవ హక్కుల కమిషన్
సి) మహిళా కమిషన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
11. ఎస్సీ, ఎస్టీ క్రిమీలేయర్ గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది?
ఎ) అశోక్ కుమార్ ఠాకూర్ VS బిహార్
బి) ఇందిరాసహానీ Vs ఉత్తరప్రదేశ్
సి) బాలాజీ Vs కేరళ
డి) భరత్‌కుమార్ Vs కేరళ
- View Answer
- సమాధానం: ఎ
12. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన మొదటి ప్రభుత్వం?
ఎ) రాజీవ్‌గాంధీ -1985
బి) దేవెగౌడ - 1996
సి) మన్మోహన్సింగ్ - 2008
డి) వాజ్‌పేయ్ - 2001
- View Answer
- సమాధానం: బి
13. కింది వాటిలో సరికానిది?
ఎ) ప్రస్తుత మహిళా కమిషన్ చైర్‌పర్సన్ - లలితా కుమార మంగళం
బి) ప్రస్తుత మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ - కేజీ బాలకృష్ణన్
సి) మైనార్టీ కమిషన్ ప్రస్తుత చైర్‌పర్సన్ - నసీం అహ్మద్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
14. ఏ కమిటీ సిఫారసు మేరకు అల్ప సంఖ్యాకుల సంక్షేమానికి 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు?
ఎ) రంగనాథ్ మిశ్రా
బి) రెండో పరిపాలన సంస్కరణల కమిషన్
సి) సచార్ కమిటీ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
15. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమం కోసం మంత్రి ఉండాలి?
ఎ) బిహార్, మధ్యప్రదేశ్
బి) బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా
సి) ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా
డి) ఏవీకాదు
- View Answer
- సమాధానం: సి
16. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు?
ఎ) 52వ సవరణ
బి) 65వ సవరణ
సి) 69వ సవరణ
డి) 71వ సవరణ
- View Answer
- సమాధానం: బి
17. మైనార్టీలకు కనీసం ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని పేర్కొనే అధికరణ ఏది?
ఎ) అధికరణ-29
బి) అధికరణ-30
సి) అధికరణ-350(ఎ)
డి) అధికరణ-350(బి)
- View Answer
- సమాధానం: సి
18. బీసీ కమిషన్ చైర్మన్‌కు ఉండాల్సిన అర్హత?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) 10 ఏళ్ల పరిపాలన అనుభవం
సి) జిల్లా కోర్టు న్యాయమూర్తి
డి) సుప్రీంకోర్టు న్యాయమూర్తి
- View Answer
- సమాధానం: డి
19. తెలుగు రాష్ట్రాల మహిళా కమిషన్ ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరు?
ఎ) మేరీ రవీంద్రనాథ్
బి) జయసుధ
సి) వెంకటరత్నం
డి) లలితా కుమార మంగళం
- View Answer
- సమాధానం: సి
20. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకా రం బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి?
ఎ) అధికరణ - 338
బి) అధికరణ - 338(ఎ)
సి) అధికరణ - 340(ఎ)
డి) అధికరణ - 342
- View Answer
- సమాధానం: సి
21. ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
ఎ) 1969
బి) 1989
సి) 1990
డి) 1991
- View Answer
- సమాధానం: బి
22. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం నుంచి ఏ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చారు?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) జమ్మూకశ్మీర్
సి) అసోం
డి) మిజోరం
- View Answer
- సమాధానం: బి
23. మైనార్టీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏ కమిటీ సిఫారసు చేసింది?
ఎ) రంగనాథ్ మిశ్రా కమిటీ
బి) రాజేంద్ర సచార్ కమిటీ
సి) జాతీయ మైనార్టీ కమిషన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ