Skip to main content

భారత ఎన్నికల వ్యవస్థ

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యం. ఎన్నికల నిర్వహణ, నియంత్రణ మొదలైన అంశాల గురించి రాజ్యాంగంలో 15వ భాగంలో ప్రకరణ 324 నుంచి ప్రకరణ 329 వరకు ప్రస్తావించారు.
 దేశంలో రెండు రకాలుగా ఎన్నికలు జరుగుతాయి. అవి
 1. ప్రత్యక్ష ఎన్నికలు
 2. పరోక్ష ఎన్నికలు
 
రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతికి పరోక్షంగా ఎన్నికవుతారు. వీరిని ఎన్నుకోవడానికి ప్రత్యేక నియోజక గణం ఉంటుంది. రాజ్యసభకు కూడా ఎన్నికలు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో నిర్వహిస్తారు. లోక్‌సభకు, రాష్ర్ట విధాన సభకు ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి. రాష్ర్ట విధాన పరిషత్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రత్యేక ఓటర్ల ద్వారా సభ్యులు ఎన్నికవుతారు. పార్లమెంటు ఉభయ సభలు, రాష్ర్ట శాసనసభల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణకు పార్లమెంటు తగిన చట్టాలను రూపొందించొచ్చు.
 
ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు రూపొందించిన చట్టాలు 
ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950: ఇందులో ఓటర్ల అర్హతలు, ఓటర్ల జాబితా తయారీ, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, పార్లమెంటు, రాష్ర్ట శాసనసభలకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన అంశాలుంటాయి.
 
ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951: ఇందులో ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, పర్యవేక్షణ, ఎన్నికల వివాదాలు, ఉప ఎన్నికలు, రాజకీయ పార్టీల గుర్తింపు మొదలైన అంశాలుంటాయి.
 
పునర్ వ్యవస్థీకరణ కమిషన్ చట్టం-1952: ఇందులో స్థానాల పునర్ వ్యవస్థీకరణ, ప్రాదేశిక నియోజకవర్గాల హద్దులు, కేటాయింపులు తదితర అంశాలుంటాయి.
 
రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి ఎన్నికల చట్టం-1952: ఇందులో రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి ఎన్నిక పద్ధతి, నియోజకగణం, షరతులు మొదలైన అంశాలుంటాయి.
 
కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం-1963: ఇందులో కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసన సభ, రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన అంశాలుంటాయి. 
 
ఎన్నికల నిర్వహణ, నిబంధనలు-1961: ఇందులో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి. 
 
ఎన్నికల గుర్తులు, కేటాయింపుల ఆదేశాలు-1968: ఇందులో పార్టీలకు, అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం, వాటిని రద్దు చేయడం మొదలైన అంశాలుంటాయి.
 
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల సర్వీసు షరతుల చట్టం-1991: ఈ చట్టం 1994 నుంచి అమల్లోకొచ్చింది. ఇందులో వీరి సర్వీసు, జీతభత్యాలు, హోదా తదితర అంశాలున్నాయి. 
 
ఎన్నికల యంత్రాంగం - కేంద్ర ఎన్నికల సంఘం
భారత రాజ్యాంగం 15వ భాగంలో ప్రకరణ  324 నుంచి 329 వరకు ఎన్నికలు, ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులకు సంబంధించి సమగ్ర వివరణలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. అందువల్ల జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. దీన్ని 2011 నుంచి పాటిస్తున్నారు.
 
నిర్మాణం
కేంద్ర ఎన్నికల సంఘం శాశ్వత, స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ.
 ప్రకరణ 324(2) ప్రకారం, ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర కమిషనర్లు ఉంటారు. ఈ అంశాన్ని పార్లమెంటు చట్టం ద్వారా నియంత్రించవచ్చు.
 ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి, ప్రాంతీయ ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్రపతి నియమించవచ్చు.
 పార్లమెంటు చేసిన చట్టాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషనర్, ప్రాంతీయ కమిషనర్ల సర్వీసు నిబంధనలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
 
కేంద్ర ఎన్నికల సంఘం - బహుళ సభ్యత్వం
రాజ్యాంగం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థ. 1950 జనవరి 25 నుంచి 1989 అక్టోబర్ 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏక సభ్య సంస్థగా, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో మాత్రమే పనిచేసింది. 1989లో మొట్టమొదటిసారిగా బహుళ సభ్య సంస్థగా మార్పు చేస్తూ ఇద్దరు ఇతర కమిషనర్లను నియమించారు. కానీ 1990లో తిరిగి ఏక సభ్య సంస్థగా మారింది. తిరిగి 1993లో బహుళ సభ్య సంస్థగా మారుస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. దానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 1993 నుంచి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు సభ్యులతో కొనసాగుతోంది.
 
ప్రత్యేక వివరణ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లకు అధికారాలు, హోదాలు, జీతభత్యాల్లో వ్యత్యాసం లేదు. నిర్ణయాలను సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకుంటారు. లేకుంటే మెజార్టీ ప్రాతిపదికపై నిర్ణయాలను అమలుచేస్తారు. 
 
నియామకం-అర్హతలు-పదవీకాలం
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజనల్ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి ఉంటుంది. నియామకానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అర్హతలేమీ లేవు. ప్రకరణ 324(5) ప్రకారం ఎలక్షన్ కమిషనర్ల పదవీకాలం, ఇతర సర్వీసు నిబంధనలను పార్లమెంటు చట్టం ప్రకారం నిర్ణయిస్తుంది.  సాధారణంగా సీనియర్ బ్యూరోక్రాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లుగా నియమిస్తారు. వీరి పదవీ కాలం ఆరేళ్లు, పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. పదవిలో కొనసాగే కాలంలో ఈ రెండింటిలో ఏది ముందువస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రత్యేక వివరణ: ప్రస్తుతానికి రీజనల్ కమిషనర్ల నియామకం చేపట్టలేదు.
 
జీతభత్యాలు
వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి జీతాలు చెల్లిస్తారు. సాధారణ పరిస్థితుల్లో వాటిని తగ్గించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తుల వేతనాలతో సమానంగా వీరి వేతనాలుంటాయి. 
 
తొలగింపు
ప్రకరణ 324(5) ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగానే పార్లమెంటు తొలగిస్తుంది. కానీ, ఇతర కమిషనర్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సలహా మేరకు అవినీతి, అసమర్థత అనే కారణాలపై రాష్ట్రపతి తొలగిస్తారు.
 
అధికార విధులు-ప్రకరణ 324(1)
కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో అన్ని ఎన్నికలను (స్థానిక సంస్థల ఎన్నికలు మినహా) నిర్వహిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను నిర్వహిస్తుంది. ఈ అధికారాలను కింది విధంగా వివరించచ్చు.
 1. పరిపాలనా సంబంధ విధులు.
 2. సలహా విధులు
 3. అర్ధ న్యాయ సంబంధ విధులు.
 
పరిపాలనా సంబంధ విధులు
ఓటర్ల జాబితాను రూపొందించడం, నిర్ణీత కాలవ్యవధిలో వాటిని సవరించడం.
పార్లమెంట్ చేసిన డీలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఎన్నికల నోటిఫికేన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ తేదీల ఖరారు, పర్యవేక్షణ.
రాజకీయ పార్టీలను గుర్తించడం, పార్టీలకు, అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించడం.
ఎన్నికల సమయంలో పార్టీలు పాటించా ల్సిన ఎన్నికల నియమావళిని రూపొందించి అమలు చేయడం.
ఎన్నికల్లో జరిగిన అక్రమాల పరిశీలనకు విచారణాధికారులను నియమించడం.
ప్రత్యేక వివరణ: ప్రకరణ 324(6) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేరు. రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని తీసుకుంటుంది. ఆ సమయంలో ఆ సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికే అధికారం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం (లేదా) పదోన్నతులు కల్పించడం వంటివి చేయకూడదు.
 
సలహా విధులు
పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి, గవర్నర్‌కు సలహాలు ఇస్తుంది.
 
అర్ధన్యాయ సంబంధ విధులు
పార్టీల మధ్య వివాదాలను విచారించి, పార్టీల వాదనలను విని పరిష్కరిస్తుంది. ఈ సందర్భంలో ట్రిబ్యునల్‌లా పనిచేస్తుంది. వీటిని Quasi Judicial Powers అంటారు.
ప్రత్యేక వివరణ: ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందు వచ్చిన వివాదాలను మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరిస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వివాదాలకు సంబంధించి బాధితులు హైకోర్టును ఆశ్రయించాలి. 
 
ప్రాంతీయ ఎన్నికల సంఘం
 కొన్ని రాష్ట్రాలకు కలిపి ప్రాంతీయ ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేయొచ్చు. అయితే ఇంతవరకూ ఇలాంటి సంఘాన్ని ఏర్పాటు చేయలేదు.
 
ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్)
ప్రతి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ఈ అధికారిని నియమిస్తుంది. ఈ పదవికి రాజ్యాంగ బద్ధత లేదు. 
 
జిల్లా ఎన్నికల అధికారి
ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణలో ప్రతి జిల్లాలో ఒక ఎన్నికల అధికారిని నియమిస్తారు. సాధారణంగా జిల్లా కలెక్టరే జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. 
 
రిటర్నింగ్ అధికారి
 పార్లమెంటు (లేదా) రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ అధికారిని నియమిస్తుంది. ఇతను సంబంధిత నియోజకవర్గ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. 
 
ఓటర్ల నమోదు అధికారి
ఓటర్ల జాబితాను తయారు చేయడం ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యత. ఇందుకోసం ఇతని పర్యవేక్షణలో కొందరు అధికారులను నియమిస్తారు.
 
ప్రిసైడింగ్ ఆఫీసర్
పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను నియమిస్తారు. ఇతనికి సహాయంగా సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్, కొంతమంది ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. 
 
పరిశీలకులు
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పర్యవేక్షణకు ఎన్నికల సంఘం కొందరు అధికారులను నియమిస్తుంది. వీరు తమ నివేదికను నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తారు.
 
ఇతర ప్రకరణలు
ప్రకరణ 325 ప్రకారం మతం, కులం, జాతి, లింగ ప్రాతిపదికలపై ఏ పౌరుడికీ ఓటు హక్కును నిరాకరించకూడదు. అలాగే ప్రత్యేక గుర్తింపు ఇవ్వకూడదు.
 ప్రకరణ 326 ప్రకారం వయోజన ఓటుహక్కును గుర్తించారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభకు సార్వజనీన ఓటు హక్కు ప్రాతిపదికపై ఎన్నికలు జరుగుతాయి. 18 ఏళ్లకు తక్కువ కాకుండా వయసున్న పౌరులందరూ (ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించిన సంవత్సరం, తేదీ నాటికి) ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు వచ్చిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అయితే  స్థిరనివాసం, మతిస్థిమితం లేకపోవడం, నేరం, అవినీతి, తదితర కారణాల వల్ల ఓటరుగా నమోదుకు అనర్హులుగా ప్రకటించొచ్చు.
ప్రత్యేక వివరణ: మౌలిక రాజ్యాంగంలో ఓటింగ్ వయసు 21 ఏళ్లు ఉండేది. అయితే 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 18 ఏళ్లకు తగ్గించారు. 1989 మార్చి 28 నుంచి ఈ సవరణ అమల్లోకొచ్చింది. 
 
ప్రకరణ 327 ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించిన విషయాలపై పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఉదా: ఓటర్ల జాబితా తయారీ, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ మొదలైన అంశాలు. 
 
ప్రకరణ 328 ప్రకారం పార్లమెంటు చట్టం చేయనంత వరకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చట్టాలు చేసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. 
 
ప్రకరణ 329 ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు.
ఎన్నికల తేదీని ప్రకటించడం మొదలైనవి పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం విశిష్ట అధికారాలు. ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని మక్కల్ శక్తి ఖచ్చిప్ గట ఎలక్షన్  కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో (2011) సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
Published date : 09 Sep 2016 11:57AM

Photo Stories