APPSC Group 1 Ranker Pallem Srirama Chandra Srinivasulu Interview : వరుసగా రెండు సార్లు గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా..నా సక్సెస్ సీక్రెట్ ఇదే
Andhra Pradesh Public Service Commission (APPSC) నిర్వహించే గ్రూప్-1 (2018) ఫలితాల్లో ఎక్సైజ్ డీఎస్పీగా ఉద్యోగం కొట్టాడు. అలాగే ఇటీవలే ప్రకటించిన APPSC Group 1 (2022) ఫలితాల్లోనూ.. సివిల్ డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ యువకుడే.. వైఎస్సార్ జిల్లాలోని గోవవరం మండలం అడుసువారి పల్లెకి చెందిన పల్లెం శ్రీరామ చంద్ర శ్రీనివాసులు. ఈ నేపథ్యంలో పల్లెం శ్రీరామ చంద్ర శ్రీనివాసులుతో సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మాది వైఎస్సార్ జిల్లాలోని గోవవరం మండలంకి చెందిన అడుసువారి పల్లె అనే ఒక మారుమూల గ్రామం. అమ్మా, నాన్న వ్యవసాయ కూలీలు. వాస్తవానికి నేను పుట్టింది శెట్టివారి పల్లె అనే గ్రామం. కానీ నేను పుట్టక ముందే మా గ్రామం సోమశిల ప్రాజెక్ట్ కింద ముంపు ప్రాంతంగా గుర్తించి కొద్దో.., గొప్పో నష్ట పరిహారం ఇచ్చి ఎలాటి పునరావాస కార్యక్రమం లేకుండానే మా గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. కానీ కట్టు బట్టలతో ఉన్న ఊరుని విడిచి వెళ్ళలేక ఒక 50 కుటుంబాలు మాత్రం ఆ ఊర్లోనే ఉండిపోయాయి. అయితే అధికారికంగా మా గ్రామాన్ని గెజిట్ నుంచి తొలగించడంతో రవాణా సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం, బడి, ఆసుపత్రి వంటి వన్ని మా గ్రామానికి రద్దయ్యాయి.
పూరి గుడిసెలోనే.. చదువు..
కిరోసిన్ బుడ్డి వెలుతురులో నా చదువు ప్రారంభమైంది. దట్టమైన అడవుల మధ్యలో అటు తూర్పు మల్లెం కొండ శ్రేణి, ఇటు పడమర శ్రేణి మధ్య పాయలాంటి ప్రాంతంలో మా గ్రామం ఉండేది. అందువల్ల మా మండల ప్రాంతాన్ని పాయకట్టు అని పిలుస్తారు. అలాంటి పరిస్థితులలో పిల్లల చదువుకోసం ఊర్లో వారంతా మాట్లాడుకొని పూసలమ్మే వారి తెగకు చెందిన సుబ్బయ్య అనే మాస్టారును మాకు గురువుగా విద్యను బోధించడానికి ఒప్పించారు.
ఒక చిన్న పూరి గుడిసెలో, నేల మీద నా విద్యాభ్యాసం ప్రారంభం అయింది. 5వ తరగతి వరకు ఆ పూరి గుడిసెలోనే ఏకోపాధ్యాయుని పర్యవేక్షణలో రామాయణం, మహా భారతంలోని పద్యాలు, శ్లోకాలు మరియు పెద్ద బాల శిక్ష అధ్యయనం చేశాను. వీటి అధ్యయనం ద్వారా నాకు చిన్న తనంలోనే సంపూర్ణ మూర్తిమత్వం అభివృద్ధి జరిగింది.
ఆ బడికి వెళ్లాలంటే.. భయం..
మా భవిష్యత్ కోసం ప్రస్తుతం ఉంటున్న అడుసువారి పల్లె గ్రామానికి వలస వచ్చి అమ్మా, నాన్నలు స్థిరపడ్డారు. ప్రక్కనే ఉన్న బ్రాహ్మణ పల్లె పంచాయితీలోని ఒక చిన్న ప్రైవేట్ పాఠశాలలో నన్ను చేర్పించారు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం అదే తొలిసారి. కానీ ఆ పాఠశాల బ్రిటిష్ కాలం నాటి ఒక జైలు భవనం. అది శిథిలా వ్యవస్థలో ఉండేది. గదులన్నీ చీకటి మయంగా ఉండేవి. బడికి వెళ్ళాలంటే భయం అనిపించేది.
అక్కడే 10 వ తరగతి వరకు చదివాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా సార్లు ఫీజు కట్టలేక తరగతి గది బయట నిలబెట్టి, ఇంటికి పంపించబడే వాడిని. అయితే 10 వ తరగతి ఫలితాల్లో మా మండలంలో మొదటి స్థానంలో నిలవడం తో ఆ బాధంతా కనుమరుగైంది.
ఎన్నో హేళనలతో.. మానసిక క్షోభ :
పదవ తరగతిలో మంచి మార్కులు రావడంతో బద్వేల్‌లోని ఒక ప్రైవేట్ కాలేజ్ నాకు ఉచితంగా ఇంటర్ విద్యను అందించింది. అయితే అప్పట్లో ఇంజనీరింగ్‌కు విపరీతమైన క్రేజ్ ఉండడంతో అందరితో పాటు నేను బీటెక్ వైపు మొగ్గు చూపాను. చిత్తూరులోని (SITAMS) ఇంజనీరింగ్ కాలేజిలో సీటు వచ్చింది. కానీ బీటెక్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉండడం వల్ల నాకు తరగతులు ఏమి అర్థమయ్యేవి కావు.
రోజురోజుకి ఇంగ్లీష్ పట్ల భయం పెరిగి, నాలో ఒక ఆత్మన్యూనత భావం బలపడి పోయింది. ఒకానొక దశలో ఇంజనీరింగ్‌ను పూర్తి చేయలేనేమో అని భావించి, ఆత్మహత్య కూడా చేసుకోవాలని విఫల ప్రయత్నం చేశాను. తప్పని సరి పరిస్థితుల్లో సమస్యను అధిగమించలేక ఇంజనీరింగ్ మధ్యలోనే మానేశాను. ఆ సమయంలో నా చుట్టుపక్కల వారి నుంచి ఎదుర్కొన్న హేళనలు, మానసిక క్షోభ అంత ఇంత కాదు. అయితే డిగ్రీ చేద్దామనుకున్నప్పటికీ కోర్సు మధ్యలో సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజి యాజమాన్యం అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగేళ్ళ వరకు ఎదురుచూసి, తరువాత సర్టిఫికేట్లు తెచ్చుకున్నాను.
☛ APPSC Group 1 & 2 Syllabus 2023 : ఇవి చదివితే..గ్రూప్ 1 & 2 ఉద్యోగం మీదే..
నా ప్రయాణంలో ఎన్నో..
బిటెక్ డ్రా పౌట్‌గా మానసిక క్షోభను అనుభవించిన నేను మొట్టమొదటి సారి భాద్యతాయుత నిర్ణయం తీసుకున్నాను. డైట్ సెట్ రాసి టీచర్ ట్రైనింగ్‌లో చేరాను. నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు డైట్ (DIET) లో రెండూ సంవత్సరాల నా టీచర్ ట్రైనింగ్ జరిగింది. ఆ సమయంలో తెలుగు అధ్యాపకులుగా ఉన్న సుధాకర్ రావు గారు నన్ను చాలా ఆత్మీయంగా ఆదరించి, ప్రోత్సహించారు. జీవితం విలువను తొలిసారి అక్కడే నేర్చుకున్నాను. ఆ ఆత్మ విశ్వాసంతో 2012 డీఎస్సీలో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే జిల్లా టాప్ ర్యాంక్ తెచ్చుకొని ప్రభుత్వ ఉపాధ్యాయునిగా జీవితంలో కొత్త దశను ప్రారంభించాను.
అమ్మ, నాన్నల కలను చేస్తూ..
ప్రొద్దుటూరులో టీచర్‌గా పని చేస్తూనే డా.బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ పూర్తి చేసాను. ఈ సమయంలో మాకు ఒక సొంత ఇల్లు ఉండాలన్న అమ్మ, నాన్నల కలను నిజం చేశాను.
గ్రూప్స్ వైపు ఎందుకు వచ్చానంటే..
అత్యంత పేదరిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం, ఏ మాత్రం ఆధునికత తెలియని మారుమూల గ్రామీణ నేపథ్యం కలిగి ఉండడం వల్ల డిగ్రీ తరువాత ఏమి చేయాలి అనే అంశంలో నాకు ఏ మాత్రం అవగాహన ఉండేది కాదు. కానీ, సాక్షి ఎడ్యుకేషన్ వాళ్లు ఇచ్చే మ్యాగజైన్‌లో వచ్చే వివిధ పోటి పరిక్షల అంశాల ఆధారంగా తొలిసారి నాకు గ్రూప్స్ పట్ల ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితోనే 2017 గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఎదుర్కున్నాను.
కానీ సరైన గైడెన్స్, పుస్తకాల ఎంపికలో తెలియని తనం వంటి కారణాల చేత సర్వీస్ సాధించలేక పోయాను. అయితే నన్ను నేను సమీక్షించుకున్న తరువాత, నా బలాలు, బలహీనతలను అంచనా వేసుకున్న తరువాత, నాలోని విశ్లేషణ, రాతనైపుణ్యాలను గుర్తించిన తరువాత నేను గ్రూప్–1 కి ప్రిపేర్ కావాలని స్వతహాగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇది నేను జీవితంలో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం.
నా గ్రూప్-1 ప్రిపరేషన్‌లో..
గ్రూప్-1 కోసం ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. టీచర్ జాబ్‌కి ఒక సంవత్సరం పాటు సెలవు పెట్టి తిరుపతికి వెళ్లి సొంతంగా ప్రిపేర్ అయ్యాను. ప్రతి సబ్జెక్ట్ కు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మొదటి నుంచే ప్రిలిమ్స్, మెయిన్స్ లను ఇంటిగ్రేటెడ్ అప్ప్రోచ్ లో 60:40 (6 గంటలు ప్రిలిమ్స్, 4 గంటలు మెయిన్స్) ప్రిపేర్ అయ్యాను. రోజుకి సగటున 8-10 గంటలు తప్పక చదివే వాడిని. “సాక్షి ఎడ్యుకేషన్” లో వచ్చే ఆర్టికల్స్, సంపాదకీయాలు, తెలుగు వ్యాసాలు క్రమం తప్పకుండా ఫాలో అయ్యే వాడిని. ఈ సందర్భంలోనే సాక్షి ఎడ్యుకేషన్ లో శ్రీరామ్ చంద్ర పేరిట “ఆంధ్రప్రదేశ్ ఆర్థిక – విభజన అంశాలు” కు సంబంధించి ఆర్టికల్స్ రాశాను.
ప్రిలిమ్స్ తరువాత మెయిన్స్ ప్రిపరేషన్ లో నేను పూర్తిగా రైటింగ్ ప్రాక్టీస్ మీదే ఫోకస్ పెట్టాను. ఒక్కో సబ్జెక్ట్ కు సంబంధించి 125 అత్యంత ఖచ్చితమైన ప్రశ్నలు & సమాధానాలు రాసుకున్నాను. వాటినే ఎక్కువగా ప్రాక్టిస్ చేశాను. ఈ సమయంలో నాకు కొన్ని సివిల్స్ వెబ్‌సైట్స్ సమాచారం ఉపకరించింది. కోవిడ్-19 వల్ల సెలవులు అదనంగా కలసి రావడం వల్ల ప్రిపరేషన్ కు అదనపు ప్రయోజనం చేకూరింది.
నేను తెలుగు మీడియంలో ఎదుర్కొన్న సవాళ్లు.. :
నేను తెలుగు మీడియంలో గ్రూప్-1 రాయడం వల్ల సమాచార సేకరణ అత్యంత కష్టంగా ఉండేది. ముఖ్యంగా ఎథిక్స్, చట్టాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ కు సంబంధించి సరైన వనరులు దొరకలేదు. అలాంటి సమయంలో ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని తీసుకొని దానిని తెలుగులోకి అనువదించి రాసుకొనే వాడిని. ఈ ఒక్క విషయంలో నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను. క్రమం తప్పకుండా నేను రాసుకున్న సమాధానాలను నేనే స్వయంగా మూల్యాంకనం చేసుకునేవాడిని. నాకు నచ్చకపోతే వెంటనే ప్రత్యామ్నాయ మోడల్ ఆన్సర్ ని రాసుకునే వాడిని. ఎకానమీ, పాలిటి, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ల కు ఎప్పటికప్పుడు వర్తమాన అంశాలను అప్డేట్ చేసుకునే వాడిని.
నా లక్ష్యం ఇదే..:
ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, సొంత అనుభవాలతో, స్వీయ ప్రిపరేషన్ తో ఇక్కడి దాకా సాగిన నా ప్రయాణం నాకు ఎంతో తృప్తినిచ్చింది. ఇంతకంటే గొప్ప విజయానికి నేను బాటలు వేసుకుంటాను.
నా విజయంలో వీరు..
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు వెన్నంటి ఉండి నడిపించిన అమ్మా, నాన్నలకు ప్రేమ పూర్వక కృతజ్ఞతలు. నా స్టడీస్ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నా సిస్టర్స్ (జయ, విజయ, బుజ్జి) లకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నా అధ్యాపకులకు, మిత్రులకు శ్రేయోభిలషులందరికి ధన్యవాదాలు. ప్రిలిమ్స్ దశ నుంచి ఇంటర్వ్యూ దశ వరకు నా ప్రిపరేషన్ లో నాకు బెస్ట్ క్రిటిక్ (విమర్శకురాలు)గా ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ వసుంధర కు కృతజ్ఞతలు. ముఖ్యంగా నాలో గ్రూప్-1 కొట్టాలన్న తపనను ప్రేరేపించిన సాక్షి ఎడ్యుకేషన్ టీమ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
తెలుగు మీడియం వారి కోసం ఒక చిన్న మాట..
గ్రూప్-1 ఫలితాలలో తెలుగు మీడియం వారు తక్కువ మంది ఉన్నా నిరాశ పడనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, తెలుగు అకాడమి గ్రంథాలు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలతో పాటు యోజన, ప్రముఖ పత్రికల ఎడిటోరియల్స్, ఇంటర్నెట్ సంచారం ఆధారంగా ఒక పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయితే గెలుపు సాధ్యం. ముఖ్యంగా రైటింగ్ ప్రాక్టీస్ బాగా సాధన చేయాలి. సొంతంగా ప్రశ్నను డిజైన్ చేసుకొని ఆన్సర్ రాసే ప్రక్రియను అలవాటుగా మార్చుకోవాలి. అన్నింటికి మించి నేను ఖచ్చితంగా సర్వీస్ ని సాధించగలను అనే మనో ధైర్యాన్ని ఎప్పటికి కోల్పోకూడదు.
పల్లెం శ్రీనివాసులు గారి విజయం.. నేటి యువతకు, అలాగే వివిధ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం.
Pallem Srirama Chandra Srinivasulu కుటుంబ నేపథ్యంకు సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ..
Tags
- APPSC Group 1 Ranker
- APPSC Group 1 Ranker Interview
- APPSC Group 1 Ranker Pallem Srirama Chandra Srinivasulu
- APPSC Group 1 Ranker Pallem Srirama Chandra Srinivasulu interview
- appsc group 1 ranker success stories
- appsc group 1 rankers interviews
- appsc group 1 rankers
- APPSC Group 1
- APPSC Group 1 2023 Ranker
- appsc group 1 ranker srirama chandra interview
- APPSC Group 1 2023
- appsc group 1 top ranker 2023
- appsc group 1 ranker srirama chandra dsp interview
- appsc group 1 ranker success story
- APPSC Group 1 Ranker 2022 Success Stories