Degree Admissions2024 : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
రాయవరం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్ విధానంలో డిగ్రీ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని రామచంద్రపురం, మండపేట, రావులపాలెం, ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, ఆలమూరుల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఒకేషనల్ కోర్సుల్లో సుమారు 2,800 వరకు సీట్ల భర్తీకి అవకాశం ఉంది.
షెడ్యూల్ ఇదే..
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం మొదలైంది. ఈ నెల 10వ తేదీ వరకూ విద్యార్థులు ఆన్‌లైన్‌లో పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిజికల్లీ చాలెంజ్‌డ్ / సీఏసీ / ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ / ఎన్‌సీసీ / గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వంటి స్పెషల్ కేటగిరి వెరిఫికేషన్లు ఆయా యూనివర్సిటీలలో ప్రాంతాల వారీగా నిర్వహిస్తారు. ఈ నెల 5న ఓపెనింగ్ ఆఫ్ హెచ్‌ఎల్‌సీ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఉంటుంది. రాజమహేంద్రవరం, కాకినాడల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కోర్సులను ఎంపిక చేసుకోవడం కోసం ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఈ నెల 19న సీట్లు కేటాయించి, అలాట్ అయిన విద్యార్థులు ఎంపికై న కళాశాలల్లో ఈ నెల 20 నుంచి 22వ తేదీలోగా రిపోర్ట్ చేయాలి. ఈ నెల 22 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
Also Read: TS EAMCET 2024 Counselling
మధ్యలో చదువు మానేసినా..
విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్ చదివి మానేసినప్పటికీ సర్టిఫికెట్ కోర్సు పేరుతో సర్టిఫికెట్ అందజేస్తారు. రెండేళ్లు అయితే డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్లు అయితే డిగ్రీ సర్టిఫికెట్, నాలుగేళ్లు చదివితే డిగ్రీ ఆనర్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. విద్యార్థి డిగ్రీ నాలుగేళ్లలో ఎప్పుడైనా మధ్యలో చదువు మానేసే వెసులుబాటు ఉంది. దానికి అనుగుణంగానే సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఫస్టియర్ నుంచి నాలుగేళ్ల లోపు ఏ దశలో చదువు మానేసినా, ఏడేళ్ల లోపు తిరిగి ప్రవేశం పొంది విద్యాభ్యాసం కొనసాగించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. డిగ్రీ విద్యా విధానంలో ప్రవేశ పెట్టిన నూతన సింగిల్ మేజర్ ఆనర్స్ డిగ్రీ పద్ధతిపై ఇంటర్మీడియెట్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. గత విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం అమలవుతోంది.
సీట్ల కేటాయింపు
డిగ్రీ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి చేశారు. ఇంటర్మీడియెట్‌లో కామర్స్ ఒక సబ్జెక్టుగా చదివిన వారికి బీకాం కోర్సులో 60 శాతం సీట్లు కేటాయిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్‌లో ఇంటర్ పూర్తి చేసిన వారికి బీఏ సీట్లలో 50 శాతం సీట్లు కేటాయిస్తారు. తక్కిన 50 శాతం ఇంటర్‌లో సైన్స్ గ్రూపు పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ (అక్ను) పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ సాధారణ కోర్సులతో పాటుగా, కంప్యూటర్, మార్కెట్ ఓరియంటెడ్, స్కిల్ ఓరియంటెడ్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులు aprche.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు దగ్గర్లో ఉన్న డిగ్రీ కళాశాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌కు చేసుకోవచ్చు. సాధారణ కోర్సులకు రూ.3 వేల వరకూ, కంప్యూటర్ కోర్సులకు రూ.8 నుంచి రూ.10 వేల వరకూ కోర్సును బట్టి ఫీజు ఉంటుంది.
జాతీయ విద్యా విధానం 2020 నిబంధనలను అనుసరించి ఏపీ ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రవేశ పెట్టింది. సంప్రదాయక మూడేళ్ల డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులను అమలు చేస్తున్నారు. ఈ కోర్సుల్లో గతంలో మాదిరిగా మూడు మేజర్ సబ్జెక్టులు కాకుండా, ఒక్కటే మేజర్ సబ్జెక్టు ఉంటుంది. దీన్ని సింగిల్ మేజర్ డిగ్రీ కోర్సుగా పిలుస్తారు. ఉదాహరణకు గతంలో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులుగా బీఎస్సీ చదువుకునే విద్యార్థి సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానంలో బీఎస్సీ బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీల్లో ఏదో ఒక సబ్జెక్టును మేజర్ సబ్జెక్టుగా ఎంచుకుని, తనకు నచ్చిన వేరే సబ్జెక్టును మైనర్ సబ్జెక్టుగా ఎంచుకుని చదువుకుంటాడు. ఇంటర్‌లో ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్టునైనా మైనర్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి
డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. తక్కువ ఫీజులతో, అన్ని రకాల సౌకర్యాలతో చదువుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయాన్ని కూడా ఉంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో అత్యధిక మంది విద్యార్థులు ఎంపికవుతున్నారు.
– డాక్టర్ కేసీ సత్యలత, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామచంద్రపురం
అత్యున్నత ప్రమాణాలు
ఇంటర్, తత్సమాన విద్యార్హత ఉన్న వారు డిగ్రీ కళాశాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఆయా కళాశాలల్లో మౌలిక సదుపాయాలన్నీ సమకూరాయి. అత్యున్నత ప్రమాణాలతో డిగ్రీ కళాశాలల్లో బోధన జరుగుతుంది. అన్ని కళాశాలల్లో జవహర్ నాలెడ్జ్ సెంటర్, ప్లేస్‌మెంట్ సెల్స్ ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ టీకేవీ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, డిగ్రీ కళాశాల, మండపేట
Tags
- Degree Admissions2024
- Admissions 2024
- Admissions in Degree College
- latest notifications
- Rayavaram degree admissions 2024-25
- online application process for degree courses
- government and private degree colleges
- state government notification for admissions
- online admissions in Rayavaram colleges
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024