Skip to main content

TS EAMCET 2024 Counselling : ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు ఈనెల 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

Admission counseling center at SAR and BGNR Degree College, Khammam   ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు  ఈనెల 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం
TS EAMCET 2024 Counselling : ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు ఈనెల 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

ఖమ్మం : ఎప్‌సెట్‌(ఎంసెట్‌)లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థుల కోసం ఖమ్మంలోని ఎస్‌ఆ ర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 4వ తేదీన రిజిస్ట్రేషన్ల నమోదు(స్లాట్‌ బుకింగ్‌) మొదలుకానుండగా, తొలి విడత సర్టిఫికెట్ల పరిశీలన 6వ తేదీన ప్రారంభమవుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం అభ్యర్థులు తమకు నచ్చిన తేదీ, సమయం ప్రకారం కౌన్సలింగ్‌కు స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని హాజరుకావాల్సి ఉంటుంది. జిల్లాలో ఎనిమిది ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. అయితే, జిల్లా విద్యార్థులు రాష్ట్రంలో ఎక్కడి కళాశాలనైనా వెబ్‌ ఆప్షన్ల ద్వారా ఎంచుకునే అవకాశం ఉంది. 2024–25వ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్‌ ప్రవేశాల వివరాల కోసం http://tgeapcet.nic.in వెబ్‌సైట్‌లో సమీపంలోని కౌన్సెలింగ్‌ కేంద్రంలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read:  TS EAMCET 2024 (Engg) College Predictor (1st Phase)

దశల వారీగా కౌన్సెలింగ్‌ ఇలా...

మొదటి విడత కౌన్సిలింగ్‌ కోసం ఈనెల 4వ తేదీ గురువారం నుంచి 12వ తేదీ వరకు స్లాట్‌ బుక్‌ చేసుకుంటే 6నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ఆతర్వాత 8నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, 19వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆపై 19నుంచి 23వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలల్లో రిపోర్ట్‌చేయాల్సి ఉంటుంది. ఇక రెండో విడతలో ఈనెల 26న స్లాట్‌ బుకింగ్‌, 27వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన, 27, 28వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదు, 31వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆపై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. అలాగే, చివరి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆగస్టు 8న స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను 9వ తేదీన పరిశీలిస్తారు. ఆయా విద్యార్థులు 9, 10వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేస్తే 13న సీట్ల కేటాయింపు జరుగుతుంది. అనంతరం 13నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించి కళాశాలల్లో రిపోర్ట్‌చేయాల్సి ఉంటుంది. ఇక మూడు దశల్లో విద్యార్థులు కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశాక కళాశాల మార్చుకోవాలనుకుంటే ఆగస్టు 16, 17వ తేదీల్లో అవకాశం కల్పించారు.

అభ్యర్థులు ఏమేం తీసుకురావాలి..

నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్‌ హాజరయ్యే విద్యార్థులు అన్ని ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్‌ సెట్లు వెంట తెచ్చుకోవాలి. ఈమేరకు టీజీఎప్‌సెట్‌ హాల్‌ టికెట్‌, ర్యాంక్‌ కార్డు, ఆధార్‌కార్డు, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలు, ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్‌ టీసీ, ఈ ఏడాది ఏప్రిల్‌ 01వ తేదీ తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్లాట్‌ బుక్‌ చేసుకున్న రశీదుతో పాటు ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులైతే ఈ ఏడాదికి తీసుకున్న సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది.

మధ్యవర్తుల మాటలు నమ్మెద్దు

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు. ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో నేరుగా సంప్రదించవచ్చు. వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే సమయాన జాగ్రత్తలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన ఽఫోన్‌ నంబర్‌ ఉపయోగంలో ఉండేలా చూసుకోవాలి.

                                                                   – మాదాల సుబ్రహ్మణ్యం, ఎప్‌సెట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌, కో ఆర్డినేటర్‌

Published date : 03 Jul 2024 12:24PM

Photo Stories