Pravallika: గ్రూప్–2 వాయిదాతో విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్‌కు చెందిన ప్రవల్లిక(23) అశోక్ నగర్‌లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ప్రవల్లిక తానుంటున్న హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్‌స్పెక్టర్ పి.నరేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు.
మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె సూసైడ్ లెటర్ బయటపెట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోటీ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైన కేసీఆర్ సర్కార్ దిగిపోవాలని డిమాండ్ చేశారు. టీఎస్సీఎస్సీని రద్దుచేసి యూపీఎస్సీకి ఇవ్వాలని, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అర్ధరాత్రి దాటే వరకు నిరసన కొనసాగింది. విద్యార్థుల నిరసనకు కాంగ్రెస్, బీజేపీలతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.