Government Teachers TET Eligibility 2023 : ఈ టీచర్లకు చెక్.. మూడేళ్లలో 'టెట్' అర్హత సాధించాల్సిందే.. నిబంధనపై..
ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని..
టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత సాధించి ఉండాలన్న నిబంధనపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు గడువు ఇస్తూ.., పదోన్నతుల ప్రక్రియపై స్టే విధించింది. ఇప్పటికే మొదలైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు ఉత్తర్వుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
తమిళనాడు కోర్టు కూడా టెట్ తప్పనిసరి అంటూ..
2011 ముందు టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2011కు ముందున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2017లో టీచర్లుగా చేరిన వారు ఈ అంశంపై కోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు కోర్టు కూడా టెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో టీచర్ల పదోన్నతి అంశానికి టెట్ ముడిపడి ఉంది.
మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా..
రాష్ట్రంలో దాదాపు 1.03 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 2017 తర్వాత నియమితులైన వారికే టెట్ అర్హత ఉంది. ఈ లెక్కన టెట్ అర్హత ఉన్నవాళ్లు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టీచర్ల సంఘాలతో అధికారులు సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు.
మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా ప్రభుత్వపరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.టీచర్లకు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించి, టెట్ అర్హత పొందేలా చూడాలనే యోచనలో ఉన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వర లో ఉన్నతస్థాయి సమావేశం జరిగే వీలుందని, అందులో నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు.
Tags
- TS TET 2023
- telangana government teacher
- telangana government teachers tet exam eligibility
- ts government teacher promotion
- ts government teacher promotion break
- Telangana Government Schools
- School Education
- ts government
- Sakshi Education Latest News
- new government teachers
- telangana teacher recruitment 2023
- Education System in Telangana