TS TET Preparation Tips: టీచర్ కెరీర్‌కు మార్గం.. టెట్!
- టీఎస్ టెట్–2023 ప్రక్రియ ప్రారంభం
- పేపర్–1, 2లుగా టెట్ నిర్వహణ
- డీఈడీ, బీఈడీ అర్హతగా పోటీ పడే అవకాశం
- ఈ నెల 16వరకు దరఖాస్తు అవకాశం
ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టాలనుకుంటే.. టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్ నోటిఫికేషన్ వెలువడిందంటే..రానున్న రోజుల్లో డీఎస్సీ నియామకాలు ఉంటాయని అంచనా. బీఈడీ,డీఈడీ అభ్యర్థులు టెట్‌లో రాణించేందుకు కృషి చేస్తే..అదే ప్రిపరేషన్‌తో భవిష్యత్తులో నిర్వహించే టీచర్ నియామక పరీక్షల్లోనూ విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చు.
రెండు పేపర్లుగా టెట్
- తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం–టెట్ పరీక్షను పేపర్–1, పేపర్–2 పేరిట రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు.
- ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధనకు టెట్ పేపర్–1కు హాజరవ్వాల్సి ఉంటుంది.
- ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించడానికి టెట్ పేపర్–2లో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.
టెట్ పేపర్–1 అర్హతలు
- ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత సాధించాలి.
- 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులవ్వాలి.
- డిసెంబర్ 23, 2015లోపు డీఈడీ, బీఈడీ, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటే.. ఇంటర్మీడియెట్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సరిపోతుంది.
- ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఉత్తీర్ణత మార్కుల్లో అయిదు శాతం మినహాయింపు ఇస్తారు.
టెట్ పేపర్–2 అర్హతలు
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు బీఈడీ లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు పాసవ్వాలి. లేదా నాలుగేళ్ల బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
- లాంగ్వేజ్ పండిట్ కోర్సులకు సంబంధించి నిర్దేశిత లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా సంబంధిత లాంగ్వేజ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజ్ ఉత్తీర్ణులవ్వాలి. లేదా సంబంధిత సబ్జెక్ట్ సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ పాసవ్వాలి. వీటితోపాటు నిర్దేశిత లాంగ్వేజ్‌లో లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్/సంబంధిత లాంగ్వేజ్ మెథడాలజీలో బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
పేపర్–1.. 150 మార్కులు
- ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించేందుకు అర్హతగా పేర్కొన్న టెట్ పేపర్–1ను 150 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం అయిదు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి 30 ప్రశ్నలు–30 మార్కులు, లాంగ్వేజ్1, 30 ప్రశ్నలు–30 మార్కులు, లాంగ్వేజ్ 2(ఇంగ్లిష్) 30 ప్రశ్నలు–30 మార్కులు, గణితం 30 ప్రశ్నలు–30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలు–30 మార్కులకు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
- పరీక్షలో రెండో విభాగంగా పేర్కొన్న లాంగ్వేజ్–1 సబ్జెక్ట్ విషయంలో అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఎంచుకున్న లాంగ్వేజ్‌ను పదో తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్‌గా చదివుండాలి.
- మూడో విభాగంగా పేర్కొన్న లాంగ్వేజ్–2(ఇంగ్లిష్)కు సంబంధించి అభ్యర్థులందరికీ ఈ విభాగం ఉంటుంది.
పేపర్–2 కూడా 150 మార్కులు
- సంబంధిత సబ్జెక్ట్‌లలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు అర్హతగా నిర్దేశించిన టెట్ పేపర్–2ను కూడా 150 మార్కులకు నిర్వహిస్తారు. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి 30 ప్రశ్నలు–30 మార్కులు, లాంగ్వేజ్1, 30 ప్రశ్నలు–30 మార్కులు, లాంగ్వేజ్ 2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు–30మార్కులు, సంబంధిత సబ్జెక్ట్ 60 ప్రశ్నలు –60 మార్కులకు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- రెండో విభాగం లాంగ్వేజ్–1లో అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, సంస్కృతం సబ్జెక్ట్‌లను పదో తరగతి వరకు పస్ట్ లాంగ్వేజ్‌గా చదివుండాలి.
- నాలుగో విభాగంగా ఉన్న సంబంధిత సబ్జెక్ట్‌లో.. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాలి.
- సబ్జెక్ట్ పేపర్‌కు సంబంధించి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, పెడగాజీ నుంచి ఆరు ప్రశ్నలు చొప్పున ప్రతి సబ్జెక్ట్ విభాగం నుంచి అడుగుతారు.
- సైన్స్ సబ్జెక్ట్‌లో ఫిజికల్ సైన్స్ నుంచి 12, బయలాజికల్ సైన్స్ నుంచి 12 చొప్పున కంటెంట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. మిగతా ఆరు ప్రశ్నలు సైన్స్ పెడగాజీ నుంచి అడుగుతారు.
- సోషల్ విభాగంలో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్‌ల నుంచి 48 కంటెంట్ ప్రశ్నలు, 12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు.
- ఈ సబ్జెక్ట్ విభాగం విషయంలో.. రెండు అర్హతలు ఉన్న వారు తమకు ఆసక్తి ఉన్న విభాగంలో పరీక్ష రాసే అవకాశం అందుబాటులో ఉంది.
- రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షకు లభించే సమయం రెండున్నర గంటలు.
60 శాతం మార్కులు సాధిస్తేనే
టెట్ పేపర్–1, పేపర్–2లలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులు(90 మార్కులు) సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో(70 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో (60 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. ఈ మార్కులు సాధించిన వారికే టెట్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 16.08.2023
- హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: సెప్టెంబర్ 9 నుంచి
- టెట్ తేదీ: సెప్టెంబర్ 15 (పేపర్–1 : ఉదయం 9:30 నుంచి 12:00 వరకు; పేపర్–2: మధ్యాహ్నం 2:30 నుంచి 5:00 వరకు)
- ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 27, 2023
- వెబ్‌సైట్: https://tstet.cgg.gov.in/
మంచి మార్కులకు మార్గాలివే
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ
రెండు పేపర్లలోనూ మొదటి విభాగం చైల్డ్ డెవలప్‌మెంట్, పెడగాజీ. ఇందులో బోధన, అభ్యసనానికి సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీపై ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. ప్రధానంగా శిశువు సైకాలజీ సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు–సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. పెడగాజిలో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం –గైడెన్స్–కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి.
లాంగ్వేజ్–1, 2కు ఇలా
భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకుని సిద్ధం కావాలి. పెడగాజికి సంబంధించి టీచింగ్ మెథడ్స్,అప్రోచెస్, టెక్నిక్స్, లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లిష్ నేపథ్యంపై ప్రశ్నలు వస్తాయి.
మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
పేపర్–1లో ఉండే ఈ సబ్జెక్ట్‌లలో మంచి మార్కుల కోసం అభ్యర్థులు.. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. 30 ప్రశ్నల్లో 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి ఉంటే.. 6 ప్రశ్నలు పెడగాజిపై అడుగుతారు. ఇక పేపర్–2లో మ్యాథమెటిక్స్, సైన్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలోనే ఉంటుంది. ఎన్విరాన్‌మెంటల్ పేపర్‌లో సైన్స్, తెలంగాణ నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు తెలంగాణ ప్రాధాన్యమున్న అంశాలను ప్రత్యేక దృష్టితో చదవడం లాభిస్తుంది.
సైన్స్: టెట్ పేపర్–2లో సైన్స్ సబ్జెక్ట్ అభ్యర్థులు మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు ఔపోసన పట్టాలి. ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటి వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
సోషల్ స్టడీస్.. సక్సెస్ ఇలా
ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదవాలి. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్‌ను సమకాలీన అంశాలతో అప్‌డేట్ చేసుకుంటూ అధ్యయనం చేయాలి.
మెథడాలజీ
ఇందులో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్–1, పేపర్–2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి.
ఇప్పటి నుంచి అడుగులు వేస్తే
- టెట్–2023ను సెప్టెంబర్ 15న నిర్వహించనున్నారు. అంటే.. నెల రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుత సమయంలో అభ్యర్థులు గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఇంగ్లిష్, తెలుగు, పెడగాజి విభాగాన్ని అధ్యయనం చేసి బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. కంటెంట్ విభాగంలో పేపర్–1 రాసే అభ్యర్థులు మూడు నుంచి అయిదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలను రివిజన్ చేయాలి.
- పేపర్–2 అభ్యర్థులు 6, 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని కీలకాంశాలను చదవాలి. కంటెంట్‌కు సంబంధించి ఎక్కువగా సమాచార ఆధారిత ప్రశ్నలే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీంతోపాటు ప్రస్తుతం అభ్యర్థులు వీలైనన్ని మోడల్ పేపర్లను సేకరించి, సాధన చేయాలి.