Skip to main content

నూతన పారిశ్రామిక విధానం

పెట్టుబడులకు ప్రాధాన్య రంగాలు
  1. జీవశాస్త్రాలు - ముడి ఔషధాలు, ఔషధాల రూపకల్పన, టీకాలు, ఔషధాల తయారీ, జీవశాస్త్ర సంబంధ పరిశ్రమలు, ఇంక్యూబేషన్ కేంద్రాలు, పరిశోధన - అభివృద్ధి సదుపాయాలు (వైద్య సామగ్రి తయారీ సహా).
    ఔషధాల ముడి పదార్థాలు, టీకాల పరిశ్రమకు సంబంధించి హైదరాబాద్ భారతదేశానికే రాజధానిగా ఉంది. అత్యవసర ప్రాణ రక్షక ఔషధాలు, కొత్త టీకాలు, జీవోత్పత్తుల పరిశోధన, తయారీల్లో అనేక నూతన అవకాశాలు వెల్లువెత్తాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం బాగా ఉన్నట్లు గుర్తించింది.
  2. ఐ.టి. హార్డ్ వేర్ - జీవ వైద్య సాధనాలు, ఎలక్ట్రానిక్స్, సెల్యులార్ కమ్యూనికేషన్, ఫ్యాబ్‌లు.
    హైదరాబాద్‌లో ఐ.టి. పెట్టుబడుల ప్రాంతాన్ని భారత ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. దీంతో పాటు రెండు ఎలక్ట్రానిక్ వస్తూత్పత్తి సముదాయాలకు కూడా ఆమోదం లభించింది. జీవ వైద్య సాధనాలు, వైద్య ఎలక్ట్రానిక్స్‌కు ఆరోగ్య పరిశ్రమ దోహదపడుతుంది.
  3. ప్రెసిషన్ ఇంజనీరింగ్ - విమానయానం, గగన, రోదసి సంబంధ సాంకేతిక విషయాలు, రక్షణ పరిశ్రమలు.
    రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రక్షణ, వైమానిక సంస్థలు, రక్షణ పరిశోధన ప్రయోగ శాలలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతోపాటు గగన, రోదసి, జి.ఎం.ఆర్., ఎం.ఆర్.ఒ.లలో టాటా సంస్థలు అయిదు భారీ పెట్టుబడులు పెట్టాయి. అందువల్ల ఈ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి. భారత ప్రభుత్వం రక్షణ రంగంలోనూ 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చిన కారణంగా ఈ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి.
  4. ఆహారోత్పత్తులు, పోషక సాధనాలు - పాడి ఉత్పత్తులు, కోళ్లు, మాంసం, మత్స్య ఉత్పత్తులు.
    కోళ్ల పరిశ్రమ, విత్తనాల వ్యాపారానికి సంబంధించి రాష్ట్రం అగ్రగామిగా ఉంది. అంతేకాకుండా వ్యవసాయోత్పత్తుల్లోనూ తెలంగాణ ఒక పెద్ద ఉత్పత్తిదారు. ఈ ఉత్పత్తులకు కొత్త రూపం ఇచ్చి జాతీయ ఆహారోత్పత్తి ఉద్యమంలో భాగస్వామి కావలసిన అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంది.
  5. ఆటోమొబైల్స్, రవాణా వాహనాలు, ఆటో - విడి భాగాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ సాధనాలు.
    ఆటోమొబైల్ పరిశ్రమ ఇంజనీరింగ్‌కు చెందిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బాగా ఊతమిస్తోంది. ఎం అండ్ ఎం ట్రాక్టర్ కర్మాగారం, ఆటో-విడి భాగాలు, ఎస్.ఎం.ఈ. వీటికి బాసటగా నిలుస్తాయని ప్రభుత్వం గుర్తించింది.
  6. జౌళి, దుస్తులు, తోళ్లు, తోళ్లతో తయారయ్యే పాదరక్షలు, పర్సులు, సంచులు, కృత్రిమ నూలు కలిసే వస్త్రాలు, కాగితం, కాగితం ఉత్పత్తులు.
    పొడుగు పింజ పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కాగితం పరిశ్రమలకు కావలసిన గట్టి పునాది కూడా రాష్ట్రంలో ఉంది. దీంతోపాటు కాగితం, దాని ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశ్రమలకు అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించింది.
  7. ప్లాస్టిక్‌లు, పాలిమర్, రసాయనిక పదార్థాలు, పెట్రో రసాయనాలు, గాజు, పింగాణీ పరిశ్రమలు.
    ప్లాస్టిక్‌లు, పాలిమర్‌లు, దిగువ స్థాయి పెట్రో-రసాయన పరిశ్రమలు ప్రధానంగా ఎం.ఎస్.ఎం.ఇ. రంగంలోకి వస్తాయి. ఇది విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించగలిగే రంగం. అందువల్ల ప్రభుత్వం దీనికి ప్రాధాన్యం ఇస్తోంది.
  8. ఎఫ్.ఎం.సి.జి., గృహోపయోగ సాధనాలు.
    భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం భారతదేశం నడిబొడ్డున ఉంది. ఈ అంశం రవాణా ఖర్చులను ఆదా చేయడానికి అనువుగా ఉంది. పరిశ్రమ ఖర్చులో రవాణా వ్యయం కీలక పాత్ర పోషిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.
  9. ఇంజనీరింగ్, క్యాపిటల్ వస్తువులు, పోతపోసిన వస్తువులు, ఫౌండ్రీ, ఫెర్రో ఎల్లాయెస్, ఇతర లోహ పరిశ్రమలు.
    ఆటోమొబైల్, గగన-రోదసీ, పెట్రో-రసాయనాలు, గృహోపయోగ సాధనాలు, కాగితం, జౌళి రంగాల్లో విలువను జోడించే ఉత్పత్తుల శ్రేణిని రాష్ట్రం సంపూర్ణంగా పుణికిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.
  10. మణులు, ఆభరణాలు.
    సంప్రదాయిక ఉత్పత్తులకు మెరుగులు దిద్దడం; మణులు, ఆభరణాల తయారీలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక నిపుణులు, చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలను ఇతోధికంగా అందించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంది.
  11. వ్యర్థాలను సద్వినియోగం చేసే విధానాలు, కాలుష్యాన్ని నివారించే సాంకేతిక ప్రక్రియలు.
    వ్యర్థాల నిర్వహణలో ఎస్.పి.వి./జె.వి. ప్రయత్నాల ఆచరణాత్మక నమూనాలు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి.
  12. పునరుత్పాదక విద్యుత్ వనరులు, సౌరశక్తి ఉత్పత్తి నిలయాలు.
    సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరులను నెలకొల్పడానికి అనువైన విస్తారమైన నేల రాష్ట్రంలో అందుబాటులో ఉంది.
  13. ఖనిజాలు, కలప ఆధారిత పరిశ్రమలు.
    రాష్ట్రంలో లభిస్తున్న ఖనిజ సంపదలో అధిక భాగం ముడిరూపంలోనే ఎగుమతి అవుతోంది. ఇక్కడ ప్రాసెసింగ్ చాలా తక్కువగా జరుగుతోంది. అందువల్ల ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
  14. ప్రయాణికులు, సరకుల రవాణా, నదీ రేవులు, కంటైనర్ డిపోలు.
    తెలంగాణ రాష్ట్రం ప్రయాణాలు, సరకుల రవాణాకు ప్రధాన కూడలిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక సహకారం
రాష్ట్రంలో ప్రస్తుత పారిశ్రామిక యూనిట్లలో ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తల యాజమాన్యంలో ఉన్నవి చాలా తక్కువ. దీనికి అనేక వ్యవస్థాగతమైన అవరోధాలున్నాయి. సామాజిక న్యాయం హామీ పునాదిగా రాష్ట్రం ఏర్పాటైనందువల్ల తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంలో ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అనేక అదనపు సహకార చర్యలను పేర్కొన్నారు. దీంట్లో భాగంగా టీఎస్-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంక్యూబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్) పథకం ప్రవేశ పెట్టారు.

పారిశ్రామిక జలాలు
అందుబాటులో ఉన్న, నూతన సాగునీటి వనరుల నుంచి 10 శాతాన్ని పారిశ్రామిక వినియోగం కోసం ప్రత్యేకంగా రిజర్వు చేశారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా నీటి లైన్లను వాటికి సమకూర్చనున్నారు.

పారిశ్రామిక విద్యుత్
  • ప్రతి పారిశ్రామిక పార్కులో నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
  • విద్యుత్ ఎక్స్ఛేంజీలు, ఎంఎస్‌ఎంఈలతో పాటు అన్ని రకాల పరిశ్రమలకూ అందుబాటులో ఉండేందుకు ఓపెన్ యాక్సెస్ విద్యుత్ ఆంక్షలను తొలగిస్తున్నారు.
  • పారిశ్రామిక అవసరాల కోసం సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.
  • భారీ పారిశ్రామిక పార్కుల్లో ప్రైవేట్ మర్చెంట్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తున్నారు.
  • చైనా, సింగపూర్‌కు చెందిన పెట్టుబడిదారుల ద్వారా 300-500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. పారిశ్రామిక వినియోగదారులు, విద్యుత్ ఉత్పత్తిదారులూ ధరల విషయంలో సంప్రదింపులు జరుపుకునే వెసులుబాటు కల్పించారు. రవాణా, ట్రాన్స్ మిషన్ బాధ్యతలను టీఎస్‌ట్రాన్స్ కో నిర్వర్తిస్తుంది.

ప్రైవేట్ భూముల్లో పారిశ్రామిక వృద్ధి
ప్రభుత్వ విధులు
  • హెచ్‌ఎండీఏ, తెలంగాణలోని ఇతర పట్టణాభివృద్ధి సంస్థల స్థల వినియోగ ప్రణాళికలో పారిశ్రామిక వినియోగం కోసం గుర్తించిన ప్రైవేట్ భూములను పరిశ్రమలకు కేటాయించడాన్ని ప్రోత్సహిస్తుంది.
  • టీఎస్‌ఐఐసీ ప్రమాణాల మేరకు మెరుగైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి భూములను సమకూర్చుకునే ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల డెవలపర్లను ప్రోత్సహిస్తుంది.
  • భూ వినియోగం తీరును మార్చుకోడానికి అనుమతిస్తుంది.

నైపుణ్యాల అభివృద్ధి
రాష్ట్ర అభివృద్ధి మిషన్ పరిధి కింద పరిశ్రమలు, వాణిజ్య శాఖ ‘తెలంగాణ రాష్ట్ర యాక్సిలరేటెడ్ ఎస్‌ఎస్‌ఐ నైపుణ్యాల శిక్షణ (టీ-అసిస్ట్) కార్యక్రమం’ చేపట్టింది. దీని ద్వారా పారిశ్రామిక రంగ ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది.
రాష్ట్రం విధులు
  • ప్రవేశ స్థాయి ఉద్యోగాలను పొందడానికి అవసరమైన శిక్షణను యువతకు అందిస్తుంది. పరిశ్రమల అవసరాల కోసం నిపుణులైన ఉద్యోగులు అందుబాటులో ఉండేలా చూస్తుంది.
  • పరిశ్రమలను సంప్రదించి వాటి అవసరాలకు సరిపడేలా ప్రస్తుత ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కార్యక్రమాలను రూపొందిస్తుంది.
  • మెగా పరిశ్రమలు వాటి పారిశ్రామిక పార్కుల్లోనే సొంతంగా నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.
  • నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమల్లో పారిశ్రామిక ప్రాంత సొసైటీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసం టీ-ఐడియా (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వాన్స్ మెంట్) పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద పేర్కొన్న ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించారు.
    స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు
    భూమి ధరలో తగ్గింపు
    భూ మార్పిడి ధర
    విద్యుత్ ఖర్చులు తిరిగి చెల్లింపు
    పెట్టుబడి సబ్సిడీ
    వ్యాట్ తిరిగి చెల్లింపు
    వడ్డీ సబ్సిడీ
    మొదటి తరం పారిశ్రామికవేత్తల కోసం మూలధన సమీకరణ
    శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి ఖర్చు తిరిగి చెల్లింపు
    నాణ్యత/ పేటెంట్లకు సహకారం
    స్వచ్ఛమైన ఉత్పాదక చర్యలు
    మౌలిక సదుపాయాల అభివృద్ధి ఖర్చులు తిరిగి చెల్లింపు
పారిశ్రామిక కారిడార్లు
హైదరాబాద్ నుంచి వరంగల్‌ను కలిపే ముఖ్యమైన జాతీయ, రాష్ట్ర రహదారుల పొడవునా పారిశ్రామిక కారిడార్లను ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి చేసిన కారిడార్లను ఆ తర్వాత డీఎంఐసీ లేదా పీసీపీఐఆర్ లాంటి ప్రత్యేక పెట్టుబడి మండళ్లకు నమూనాలుగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రాన్నీ హై స్పీడ్ రైలు, రోడ్డు వ్యవస్థతో అనుసంధానించాలని నిర్ణయించారు.

పారిశ్రామిక భూ నిధి
  • పారిశ్రామిక వినియోగం కోసం సుమారు 2.50 లక్షల ఎకరాల బంజరు భూమిని గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) సహకారంతో ఒక పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
  • కీలక రంగాలకు ప్రత్యేక పారిశ్రామిక పార్కులను టీఎస్‌ఐఐసీ ఏర్పాటు చేస్తుంది.
  • రెడ్ కేటగిరీ పరిశ్రమల స్థాపనకు సురక్షిత ప్రదేశాల్లో ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.
  • బహుళ రంగాల కార్యకలాపాలు, సాధారణ వస్తూత్పత్తి యూనిట్లకు కూడా కొన్ని పారిశ్రామిక పార్కులు అనుమతి ఇస్తాయి.

రాష్ట్రంలో ప్రాథమికంగా అభివృద్ధిచేయబోయే పారిశ్రామిక కారిడార్లు
  • హైదరాబాద్ - వరంగల్
  • హెదరాబాద్ - నాగపూర్
  • హైదరాబాద్ - బెంగళూరు

రెండో దశలో అభివృద్ధి చేసే కారిడార్లు..
  • హైదరాబాద్ - మంచిర్యాల
  • హైదరాబాద్ - నల్లగొండ
  • హైదరాబాద్ - ఖమ్మం
హైదరాబాద్ పరిశోధన, ఆవిష్కరణ సర్కిల్ (ఆర్.ఐ.సి.హెచ్.)
పరిశ్రమలు, పరిశోధన/ విద్యా సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టుల మధ్య అనుసంధానం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిశోధన, ఆవిష్కరణ సర్కిల్ (ఆర్.ఐ.సి.హెచ్.) ‘విపణి పరిశోధన నిధి’ని ఏర్పాటు చేసింది. నూతన ఆవిష్కరణలను, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించడానికి ఇది దోహదపడుతుంది.

షెడ్యూల్డ్ కులాలు/తెగల యాజమాన్యంలోని పరిశ్రమలు
ఎస్సీ/ఎస్టీల పూర్తి యాజమాన్యంలో ఏర్పాటైన పరిశ్రమలు లేదా వారికి స్థిరంగా 100 శాతం వాటా ఉన్న భాగస్వామ్య/ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను ‘ఎస్సీ/ఎస్టీల యాజమాన్యంలోని పరిశ్రమలు’గా పేర్కొంటారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పారిశ్రామికవేత్తలు వివిధ రకాల కార్యకలాపాలను సాగించే సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం దోహదపడుతోంది. ఇందులో భాగంగా కింద పేర్కొన్న ప్రోత్సాహకాలను అందిస్తోంది.
  • పారిశ్రామిక వినియోగం కోసం కొనుగోలు చేసిన భూమికి పరిశ్రమ చెల్లించిన స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీల మొత్తాన్ని 100 శాతం తిరిగి చెల్లిస్తారు.
  • భూమి/షెడ్డు/భవనాల లీజు, తనఖా, తాకట్టుపై 100 శాతం స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లిస్తారు.
  • పారిశ్రామిక వాడలు/ పారిశ్రామిక పార్కుల్లో భూమి విలువపై రూ. 10 లక్షల పరిమితితో 33.33 శాతం తగ్గిస్తారు.
  • పారిశ్రామిక వినియోగానికి 25 శాతం భూమి మార్పిడి ఛార్జీలు.
  • వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన తేదీ నుంచి అయిదేళ్ల వరకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున స్థిర విద్యుత్ ధర తిరిగి చెల్లిస్తారు.
  • తొలి తరం పారిశ్రామికవేత్తలు సూక్ష్మ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా యంత్రాల కొనుగోలు ఖర్చు, మూలధన సమీకరణలో 20 శాతం సహాయం. దీన్ని అర్హమైన పెట్టుబడి సబ్సిడీ నుంచి తగ్గిస్తారు.
  • ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు స్థిర మూలధన పెట్టుబడిలో 35 శాతం సబ్సిడీ (రూ. 75 లక్షల పరిమితికి లోబడి) అందజేస్తారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే యూనిట్లకు అదనంగా 5 శాతం పెట్టుబడి సబ్సిడీ (రూ. 75 లక్షల పరిమితికి లోబడి) అందజేస్తారు.
  • చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు.. అవి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన తేదీ నుంచి అయిదేళ్ల వరకు 100 శాతం నికర వ్యాట్/ సీఎస్‌టీ లేదా రాష్ట్ర వస్తు, సేవల పన్ను (ఎస్‌జీఎస్‌టీ) తిరిగి చెల్లిస్తారు. ఇదేవిధంగా మధ్య తరహా పరిశ్రమలకు 75 శాతం, భారీ స్థాయి పరిశ్రమలకు 50 శాతం నికర వ్యాట్/ సీఎస్‌టీ లేదా రాష్ట్ర వస్తు, సేవల పన్ను తిరిగి చెల్లిస్తారు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన తేదీ నుంచి ఏడేళ్ల కాల పరిమితి వరకు లేదా 100 శాతం స్థిర మూలధన పెట్టుబడి వసూలు కావడం.. వీటిలో ఏది ముందు పూర్తయితే అప్పటి వరకు పైన పేర్కొన్న విధంగా చెల్లిస్తారు.
  • నూతన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థిర మూలధన పెట్టుబడిపై పావలా వడ్డీ పథకం కింద తీసుకున్న నియమిత కాల రుణాలపై వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన తేదీ నుంచి అయిదేళ్ల పాటు ఏడాదికి 3 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ రాయితీ వర్తింపజేస్తారు. ఈ పథకం కింద సేవా రంగంలో ఏర్పాటు చేసే యూనిట్లకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
  • నైపుణ్యాలను పెంచుకోవడానికి, స్థానిక కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చులో వ్యక్తికి రూ. 2,000 పరిమితికి లోబడి 50 శాతం తిరిగి చెల్లిస్తారు.
  • సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు నాణ్యత ధ్రువీకరణ లేదా పేటెంట్ల నమోదుకు అయ్యే ఖర్చులో రూ. 3 లక్షల పరిమితికి లోబడి 50 శాతం సబ్సిడీ ఇస్తారు.
  • నిర్దిష్టమైన పారిశుద్ధ్య ఉత్పత్తి చర్యలపై రూ. 5 లక్షల పరిమితికి లోబడి 25 శాతం సబ్సిడీ అందిస్తారు.
  • షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఐఐడీఎఫ్ ద్వారా మౌలిక సదుపాయాల ఖర్చులో 50 శాతం సమకూరుస్తారు. దీని ద్వారా పరిశ్రమల యూనిట్లకు కోటి రూపాయల పరిమితికి లోబడి రోడ్లు, విద్యుత్, నీరు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇది కింద పేర్కొన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది.
    ఎ. సంబంధిత పరిశ్రమ ప్రస్తుత పారిశ్రామిక వాడలు/ఐడీఏలకు 10 కి.మీ. మించిన దూరంలో ఉండాలి. కేటాయించడానికి ఖాళీ భూమి/ షెడ్లు ఉండాలి.
    బి. పరిశ్రమ కోసం వెచ్చించిన అర్హమైన స్థిర మూలధన పెట్టుబడిలో మౌలిక సదుపాయాల ఖర్చు 15 శాతానికి పరిమితమై ఉండాలి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే యూనిట్లకు సమకూర్చే మౌలిక సదుపాయాల ఖర్చును 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతారు.
  • తవ్వకం యంత్రాల ద్వారా చేపట్టే పనులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక సందర్భం కింద పరిగణించి సేవా కార్యకలాపాల కింద మాత్రమే ప్రోత్సాహకాన్ని అందిస్తారు.
జాతీయ పెట్టుబడి, వస్తూత్పత్తి మండళ్లు (ఎన్‌ఐఎంజెడ్)
మెదక్ జిల్లాలో 5,000 - 6,000 ఎకరాల్లో జాతీయ పెట్టుబడి, వస్తూత్పత్తి మండలి (ఎన్‌ఐఎంజెడ్)ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాతీయ ఉత్పాదక విధానంలో ఎన్‌ఐఎంజెడ్ భావన ఒక భాగం. జీడీపీలో ఉత్పాదక రంగం వాటాను 6 నుంచి 25 శాతానికి పెంచడం దీని లక్ష్యం. అధునాతన మౌలిక సదుపాయాలు, జోనింగ్‌పై ఆధారపడే భూ వినియోగం, పరిశుభ్రమైన, ఇంధన సామర్థ్యం ఉన్న సాంకేతికత వినియోగం, అవసరమైన సామాజిక మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి సౌకర్యాలతో సమగ్ర పారిశ్రామిక టౌన్‌షిప్‌లను ఎన్‌ఐఎంజెడ్ అభివృద్ధి చేస్తుంది. ప్రతి ఎన్‌ఐఎంజెడ్‌లో అంచనా పెట్టుబడి సుమారు రూ.30,000 కోట్లు, ఉద్యోగ కల్పన సామర్థ్యం 3 లక్షలుగా అంచనా వేస్తున్నారు. మెదక్ జిల్లాలో ‘జాతీయ పెట్టుబడి, ఉత్పాదక మండలి’ని ఏర్పాటు చేయనున్నారు.

పారిశ్రామిక మౌలిక సదుపాయాలు
ప్రత్యేక ఆర్థిక మండళ్లు:
రాష్ట్రంలో ఐటీ/ఐటీఈ, ఏరోస్పేస్, బయోటెక్, ఫార్ములేషన్‌‌స రంగాల్లో ఆరు సెజ్‌లను అభివృద్ధి చేశారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐఐసీ వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో సెజ్‌ను అభివృద్ధి చేసింది.

నూతన పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం భూమి గుర్తింపు: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) 10 జిల్లాల్లో సుమారు 74133.18 ఎకరాల్లో విస్తరించి ఉన్న 150 పారిశ్రామిక పార్కులను గుర్తించింది. ప్రస్తుతం వీటిలో 13165 యూనిట్లు (పరిశ్రమలు) ఉన్నాయి. మొత్తం 74133.18 ఎకరాల్లో పరిశ్రమలకు కేటాయించడానికి 917.30 ఎకరాల భూమి అందుబాటులో ఉంది.

టీఎస్‌ఐఐసీ 2.5 లక్షల ఎకరాల వ్యర్థ/బంజరు భూమిని సర్వే చేసి, పారిశ్రామిక వినియోగానికి సిద్ధంగా ఉన్న 234064.35 ఎకరాలను గుర్తించింది.

మహిళా పారిశ్రామిక పార్కుల అభివృద్ధి: మహిళా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల హరిత పారిశ్రామిక పార్కులో, మెదక్ జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాలు కేటాయించారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో పచ్చదనం కోసం చేపట్టే కార్యకలపాల కోసం మహిళా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

వాణిజ్యం, ఎగుమతులకు ప్రోత్సాహం: సీఐఎస్ డెరైక్టర్ జనరల్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఎగుమతులకు సంబంధించి దేశంలోని అగ్రశ్రేణి పది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. ఐటీఈ అండ్ సీ విభాగం, ఎస్‌టీపీఐ ఎగుమతుల గణాంకాల ప్రకారం సాఫ్ట్‌వేర్, సామర్థ్య సేవా రంగం లాంటివాటిలో భారీ ఎగుమతిదారుగా ఘనత దక్కించుకుంది. 2013-14లో రాష్ట్రం రూ.57,000 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్, సామర్థ్య సేవలను ఎగుమతి చేసింది.

గనులు, భూగర్భ వనరులు
గనుల తవ్వకం: రాష్ట్ర ప్రభుత్వం బంగారం, వజ్రాలు, సాధారణ లోహాల కోసం 3 భూ పరిశీలన పర్మిట్లు, 18 ఖనిజాన్వేషణ లెసైన్సులు, ప్రధాన లోహాల (పారిశ్రామిక లోహాల) కోసం 521 తవ్వకం లీజులు, గ్రానైట్ పలకను కోసి, మెరుగుపెట్టడానికి సంబంధించిన 1186 క్వారీ లెసైన్సులు, చిన్న తరహా ఖనిజాల (భవన నిర్మాణ ఖనిజాలు) కోసం 1429 క్వారీ లెసైన్సులను వరసగా 535805 హెక్టార్లు, 5633 హెక్టార్లు, 79478 హెక్టార్లు, 2764 హెక్టార్లు, 3611 హెక్టార్ల మేర జారీ చేసింది.

బొగ్గు, సున్నపురాయి గనుల తవ్వకాలు భారీ తరహా వాణిజ్య రంగం కిందకి వస్తాయి. గ్రానైట్, డోలమైట్, క్వార్‌‌టజ్, ఫెల్డ్‌స్పార్, క్లేస్, బైరటీస్ తదితరాలు సెమీ యాంత్రీకృత మధ్య తరహా రంగం కిందికి వస్తాయి. మిగిలిన ఖనిజాలు సెమీ వాణిజ్య చిన్న తరహా రంగం కిందకి వస్తాయి. దాదాపు 90 శాతం గనులు చిన్న తరహా రంగం కింద, మిగిలినవి మధ్య, భారీ తరహా రంగాల కింద ఉన్నాయి.

ఖనిజాలు, పరిశ్రమలపై దృష్టి: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు భారీ, మధ్య తరహా ఖనిజ ఆధారిత రంగాలు పరిశ్రమలను ఏర్పాటు చేశాయి. వీటిలో సిమెంట్, ఉక్కు, స్పాంజి ఐరన్, ఫెర్రో-ఎల్లాయీస్, గాజు, సిరామిక్స్, రిఫ్రాక్టరీలు, రసాయనాలను ఉత్పత్తి చేయడానికి గ్రానైట్, మార్బుల్, సున్నపురాయి కోత, పాలిషింగ్ యూనిట్లు, పలకలను కోసే యూనిట్లు, రత్నాలను కోసి, సానపెట్టే యూనిట్లు, గ్రానైట్ విశిష్ట నిర్మాణ యూనిట్లు, పర్వరైజింగ్ యూనిట్లు, స్టోన్ క్రషర్లు, మొజాయిక్, సిరామిక్ పెంకుల యూనిట్లు, సున్నపు బట్టీలు, ఇసుక తయారీ యూనిట్లు మొదలైనవి ఉన్నాయి.

గనుల రంగాన్ని వృద్ధికి చోదకశక్తుల్లో ఒకటిగా గుర్తించారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి దోహదపడే పరిశ్రమగా దీన్ని గుర్తించారు. ఇందులో భాగంగా సిమెంట్, థర్మల్ ప్లాంట్లు, గ్రానైట్‌ను కోసి, మెరుగుపెట్టడం, ఉక్కు, స్పాంజి ఐరన్ లాంటి పరిశ్రమల కోసం సున్నపురాయి, బొగ్గు, ఇనుప ఖనిజం, వజ్రాలు, డోలమైట్, యురేనియం, గార్నెట్, గ్రానైట్ తదితర ఖనిజాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు.

ఖనిజాల ఉత్పత్తి, విలువ: వివిధ పరిశ్రమలను ప్రోత్సహించడం, ఖనిజ ఆధారిత ఉత్పత్తుల తయారీ వల్ల ఖనిజాల వినియోగం పెరిగింది. రాష్ట్రం సుమారు 33 మిలియన్ టన్నుల పారిశ్రామిక ఖనిజాలు, 50 నుంచి 55 టన్నుల బొగ్గు, 54 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణాత్మక రాళ్లూ, భవన నిర్మాణ సామగ్రి ఉత్పత్తి చే స్తోంది.

స్థిరమైన అభివృద్ధి కోసం కొన్ని ప్రాంతాలను మైనింగ్ జోన్లుగా ప్రకటించడానికి నిర్ణయించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ప్రత్యేక మైనింగ్ జోన్లను గుర్తించారు.

2014-15 కోసం నిర్దిష్టమైన చర్యలు
  • విధాన చట్టాల్లో పొందుపరిచిన ఆదేశాలకు అదనంగా కింద పేర్కొన్న నిర్దిష్ట చర్యలపైనా దృష్టి కేంద్రీకరించారు.
  • వ్యర్థాల నిర్వహణతో పాటు చక్కగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలతో కూడిన నూతన ఫార్మా సిటీ, కెమికల్ సిటీ ఏర్పాటు.
  • హైదరాబాద్ - వరంగల్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి.
  • వరంగల్‌ను తెలంగాణకు జౌళీ కేంద్రంగా అభివృద్ధి చేయడం.
  • ఫుడ్ ప్రాసెసింగ్, విత్తన ఉత్పత్తికి చొరవ తీసుకోవడం.
  • పారిశ్రామిక పార్కులకు అనుబంధంగా మినీ పారిశ్రామిక టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయడం.
  • దళిత పారిశ్రామికవేత్తలకు నేరుగా రుణ సౌకర్యాలు కల్పించడం.
  • ‘వెంచర్ క్యాపిటల్/ ఏంజిల్ ఫండ్’ ఏర్పాటు చేయడం.
  • పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పుత్తులపై అంతర్రాష్ట్ర వ్యాట్ హేతుబద్ధీకరణ.
  • కార్మిక చట్టాలతో పాటు అన్ని రకాల పాతకాలపు పారిశ్రామిక రంగ నియంత్రణలపై సమీక్ష, సంస్కరణలు చేయడం.

చేనేత, జౌళి
చేనేత, జౌళి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పరిశ్రమకు భారత ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తోంది.
ప్రాథమిక సొసైటీలు: రాష్ట్రంలో సుమారు 200 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సొసైటీలున్నాయి. వీటిలో 41,491 మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. 2012-13లో ఈ సొసైటీల ద్వారా రూ.5,923 లక్షల విక్రయాలు జరిగాయి.
చేనేత, జౌళి శాఖ రాష్ట్రంలో వివిధ పథకాల అమలు, సహకార సంఘాల సంస్థాగత వ్యవస్థను క్రమబద్ధీకరించడం, మార్కెటింగ్ మద్దతు, నిర్వహణకు పెట్టుబడి సమకూర్చడం, మగ్గాల ఆధునికీకరణ, శిక్షణలు, చేనేత కార్మికుల సంక్షేమం, విద్యుత్ సబ్సిడీ లాంటి ప్రోత్సాహకాలు తదితర అంశాలపై దృష్టి సారిస్తుంది.
దుస్తుల ఎగుమతి, టెక్స్‌టైల్ పార్కులు: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కింద పేర్కొన్న పార్కులను ఏర్పాటు చేసింది.
  • దుస్తుల ఎగుమతి పార్కు - గుండ్ల పోచంపల్లి, రంగారెడ్డి జిల్లా.
  • టెక్స్‌టైల్ పార్కు - సిరిసిల్ల, కరీంనగర్.
  • టెక్స్‌టైల్ పార్కు - పాశమైలారం, మెదక్.
  • టెక్స్‌టైల్ పార్కు - మల్కాపూర్, నల్లగొండ జిల్లా.
సూరత్, కోయంబత్తూర్ తరహాలో వరంగల్ నగర శివార్లలో ఒక మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదన ఉంది.

పారిశ్రామిక సంబంధాలు
పరిశ్రమల అభివృద్ధికి మొదట అవసరమైన అంశం పారిశ్రామిక ప్రశాంతత. యజమానులు, కార్మికుల మధ్య తలెత్తే పారిశ్రామిక వివాదాల కారణంగా పనులు ఆగిపోవడం, కొంతకాలం పాటు వరసగా పనిదినాలు వ్యర్థమవడం లాంటి పరిణామాలు తలెత్తుతాయి. పరిశ్రమల్లో కార్మిక - యాజమాన్య సంబంధాలు పారిశ్రామిక వృద్ధికి ముఖ్యమైన సూచీగా ఉంటాయి. వివాదాలను సామరస్యంగా పరిష్కరించడానికి, పారిశ్రామిక శాంతిని పెంపొందించడానికి, సానుకూల పని వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం సర్దుబాటు యంత్రాంగం ద్వారా ప్రయత్నాలు చేపడుతోంది. పరిశ్రమలను మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దడానికి ఈ శాఖకు చెందిన సర్దుబాటు అధికారులు ఉత్పాదకత సంబంధమైన రాజీ కోసం ప్రయత్నాలు చేస్తారు.

సేవల రంగం
అభివృద్ధి చెందుతున్న దశలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఊపందుకుంటున్న దశలో పారిశ్రామిక వాటా కంటే సేవల రంగం అందించే వాటా వేగంగా పెరుగుతోంది. విస్తారమైన వ్యవసాయ, పారిశ్రామిక రంగాల విభాగాలను మినహాయిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని అన్ని సామాజిక, ఆర్థిక రంగాల్లోకి ఈ రంగం సేవలు విస్తరించాయి. వ్యవసాయ లేదా పారిశ్రామిక వస్తువులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన వాటి కంటే సాపేక్షంగా తక్కువ సహజ మూలధనం, ఎక్కువ మానవ వనరుల పెట్టుబడి ఈ సేవా రంగం ఉత్పత్తులకు అవసరమవుతాయి.
సేవల రంగం సమ్మేళనంలో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వ, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, నివాస స్థలాల యాజమాన్యం, వ్యాపార సేవలు, రైల్వేలు, పౌర పరిపాలన, ఇతర సేవలు తదితర ఉప రంగాలు ఉంటాయి. అభివృద్ధి మార్గాలు, ఆర్థికరంగంలోని వ్యవస్థాగత మార్పుల ద్వారా సేవల రంగం నుంచి లభించే వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన భౌతిక ఉత్పాదకత నిర్మాణం, సమ్మేళనంలో మార్పుల ద్వారా వ్యవస్థాగత మార్పును వివరించవచ్చు. 2014-15లో వాస్తవ కోణంలో జీఎస్‌డీపీలో ఈ రంగం వాటాను 57.1 శాతంగా అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో ఇది ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన, విస్తృత రంగంగా కొనసాగనుంది. దశాబ్ద కాలంగా 9 శాతానికి మించిన పటిష్టమైన వార్షిక సగటు వృద్ధి రేటును ఈ రంగం నమోదు చేసింది.
సేవల రంగం వాటా: 2014-15 సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత ధరల ప్రకారం సేవల రంగ సమ్మేళనాన్ని ఆ రంగానికి చెందిన వివిధ విభాగాల కింద పరిశీలించినప్పుడు.. ముందస్తు అంచనాల ప్రకారం రియల్ ఎస్టేట్, నివాస స్థలాల యాజమాన్యం, వ్యాపార సేవలు 15.6 శాతం వాటాతో అగ్రగామి ఉప రంగంగా నిలుస్తున్నాయి. తర్వాతి స్థానాల్లో 13.1 శాతంతో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు; 9 శాతంతో ఇతర సేవలు; 6.6 శాతంతో బ్యాంకింగ్, బీమా; 6.3 శాతంతో ఇతర పద్ధతుల ద్వారా రవాణా, నిల్వ; 4.6 శాతంతో ప్రజా పరిపాలన, 1.5 శాతంతో కమ్యూనికేషన్లు; 0.5 శాతంతో రైల్వేలు ఉన్నాయి.
ప్రతి ఉప-రంగం వాటా జీఎస్‌డీపీకి అది నేరుగా అందిస్తున్న వాటాను ప్రతిఫలిస్తోంది. వీటిలో కొన్ని పరోక్ష వాటాను, బహుళ ప్రభావాలను కూడా కలిగి ఉన్నాయి. ఉదాహరణకు.. రవాణా, కమ్యూనికేషన్లు మౌలిక సదుపాయాలకు దోహదపడుతున్నాయి. ఇది ఏ ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత ప్రధానమైన అంశం. లిక్విడిటీని అందించడం ద్వారా బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు వివిధ వ్యాపారాలకు మద్దతు అందిస్తూ ఆర్థిక కార్యకలాపాలకు ఇంజన్లుగా వ్యవహరిస్తున్నాయి. విస్తృత అర్థంలో వీటిని మౌలిక సదుపాయాలుగానూ పరిగణించవచ్చు. నిర్మాణాలు వాస్తవిక పెట్టుబడి నిల్వలకు తోడవుతున్నాయి. ఇది వివిధ రంగాల్లో ఉత్పాదకత వృద్ధికి భారీ పెట్టుబడిగా తోడ్పడుతోంది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే.. 2013-14 గణాంకాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మొత్తం సేవల జీఎస్‌డీపీలో వరసగా 26.2, 17.5 శాతం వాటాను అందించాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో జీడీడీపీ (స్థూల జిల్లా ఉత్పత్తి)కి ప్రధాన వాటాను సేవల రంగమే అందించడం ఆసక్తికరమైన అంశం. ఉదాహరణకు 2013-14లో హైదరాబాద్ జీడీడీపీలో 81.6 శాతాన్ని సేవల రంగం సమకూర్చింది. అదేవిధంగా రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సేవల రంగం వాటా వరసగా 56.3 శాతం, 52.5 శాతంగా ఉంది.

సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అత్యంత వాంఛనీయమైన ఐటీ గమ్యంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తోంది. రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ‘ఐసీటీ విధానం 2010-2015’ను అమల్లోకి తీసుకువచ్చారు.

ఐసీటీ విధానం ప్రధాన లక్ష్యాలు:
  • రాష్ట్రంలో ఎలాంటి అవరోధాలు లేని పరిస్థితుల్లో అత్యంత పోటీ తత్వంతో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకొని, వృద్ధి సాధించి, నిలదొక్కుకోవడం కోసం ఐటీ కంపెనీలకు అనుగుణమైన పారిశ్రామిక అనుకూల, ప్రగతిశీల వాతావరణాన్ని అందించడం.
  • అన్ని ప్రాంతాల్లో సమాజంలోని అన్ని వర్గాల్లో విద్యావంతులైన యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం.
  • ఉత్పాదకతను పెంచడం, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిని వృద్ధి చేసి తద్వారా అత్యధిక స్థాయిలో ఎగుమతుల టర్నోవర్ సాధించడం.
  • రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతానికీ ఐటీని విస్తరించడం.
  • సమాచార సాంకేతికత సామర్థ్యాన్ని రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక వృద్ధికి ఒక సాధనంగా వినియోగించుకోవడం.
ఐసీటీ విధానం 2010-15 అత్యుత్తమ ప్రోత్సాహకాలు, సౌకర్యాలను అందిస్తోంది. స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వేగంగా విస్తరిస్తున్న, ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇంజనీరింగ్ సేవలు, ఉత్పత్తి/ఆర్ అండ్ డీ కంపెనీలు, యానిమేషన్, గేమింగ్ లాంటి రంగాల వృద్ధికి కృషి చేస్తోంది.

ముఖ్యాంశాలు:
  • తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు మార్గదర్శిగా నిలిచింది.
  • జాతీయ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.5 శాతం. 2013-14లో రాష్ట్రం నుంచి ఎగుమతైన ఐటీ ఉత్పత్తుల మొత్తం విలువ రూ.57,257.97 కోట్లు.
  • ఐటీ రంగం ప్రత్యక్షంగా 3,27,444 ఉద్యోగాలను సృష్టించింది.
  • రాష్ట్రంలో కొత్తగా నమోదైన/ ఆమోదం పొందిన యూనిట్లు 36.
  • మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్, డెల్, మోటరోలా, డెలాయిట్, కన్వర్జెస్, యూబీఎస్, కంప్యూటర్ అసోసియేట్స్, అమెజాన్, క్యాప్ జెమిని, కంప్యూటర్ సైన్స్ కార్పొరేషన్, సీమెన్స్, జెపీ మోర్గాన్, ఫేస్‌బుక్ తదితర భారీ ఎంఎన్‌సీలు, ఫార్ఛ్యూన్ 500 కంపెనీలు, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పోలారిస్, టెక్ మహీంద్రా, సియెర్రా అట్లాంటిక్, ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రెజైస్, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ తదితర ఐటీ దిగ్గజాలకు నిలయంగా ఉంది.

రాష్ట్రంలో ఖనిజ సంపద విస్తరణ, వినియోగం తీరుతెన్నులు

ప్రధాన ఖనిజాలు

విస్తరణ

ఖనిజాధార పరిశ్రమలు

అమెథిస్ట్ వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ ఆభరణాలు
బైరటీస్ ఖమ్మం డ్రిల్లింగ్, పెయింట్లు, టైర్ల ఫిల్లర్, రబ్బరు వస్తువులు, కాగితం, రసాయనిక పదార్థాలు
ఫైర్ క్లే ఆదిలాబాద్ రిఫ్రాక్టరీ, ఫెర్రో-ఎల్లాయెస్
బొగ్గు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ ఇనుము, ఉక్కు, థర్మల్ విద్యుత్ కర్మాగారాలు, సిమెంట్, రైల్వేలు, ఇళ్లలో వంట ఇంధనం
కోరండమ్ ఖమ్మం ఎబ్రేసివ్‌లు, ఆభరణాలు
డోలమైట్ ఖమ్మం ఇనుము, ఉక్కు, ఫెర్రో ఎల్లాయెస్, ఎరువులు, గాజు, ఫౌండ్రీ, సౌందర్య సాధనాలు
ఫెల్డ్‌స్పార్ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం సిరామిక్స్, గాజు, అబ్రేజివ్, ఎనామిల్స్, విద్యుత్, రిఫ్రాక్టరీలు
ఫుల్లర్స్ ఎర్త్ రంగారెడ్డి వంటనూనెల రంగు తొలగించే సాధనం, చమురుశుద్ధి కర్మాగారాలు
ముడి ఇనుము, హెమటైట్, మాగ్నటైట్ వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ ఉక్కు, పెల్లటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్
క్యానైట్ ఖమ్మం అబ్రేజివ్, రిఫ్రాక్టరీ
లాటరైట్ మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ సిమెంట్
సున్నపురాయి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ సిమెంట్, కార్బైడ్, ఇనుము, ఉక్కు, సోడాయాష్, రసాయనాలు, చక్కెర, కాగితం, ఎరువులు, గాజు
మాంగనీస్ ఆదిలాబాద్ పొటాషియం పర్మాంగనేట్, ఫెర్రో ఎల్లాయెస్, ఇనుము, ఉక్కు, బ్యాటరీలు, రసాయనిక పదార్థాలు, పింగాణీ, గాజు పరిశ్రమ
క్వార్‌‌ట్జ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్ గాజు, ఫౌండ్రీ, ఇనుము, ఉక్కు, రిఫ్రాక్టరీ, పింగాణీ, విద్యుత్, ఆబ్రేసివ్, పెయింట్లు, ఎలక్ట్రానిక్స్
స్టియటైట్ ఖమ్మం కాగితం, జౌళి, రబ్బర్, పింగాణీ, సబ్బులు, డిటర్జెంట్‌లు, ఎరువులు
స్టోవింగ్ శాండ్ ఖమ్మం సిరామిక్స్, ఫౌండ్రీ, రిఫ్రాక్టరీ
చలువరాయి ఖమ్మం ఫ్లోరింగ్, అలంకరణ సాధన, ప్యానళ్లు
సున్నపురాయి పలకలు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ ఫ్లోరింగ్, కాలి బాటలు
గ్రానెట్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, నిజామాబాద్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమ, అలంకరణ, ప్యానళ్లు, విశిష్ట నిర్మాణాలు, గచ్చు
కట్టడపు రాళ్లు తెలంగాణలోని అన్ని జిల్లాలు నిర్మాణ సామగ్రిలో భాగంగా నిర్మాణ ప్రయోజనాల నిమిత్తం
Published date : 03 Dec 2015 04:50PM

Photo Stories