Revanth Reddy: వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ.. ఈ పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు
ఈ మేరకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
డిసెంబర్ 15న సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని స్పష్టం చేశా రు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్
పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు
విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఉండే, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
పోలీసు ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలకు చదువుకొనేలా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఆ పాఠశాలలు ఉండాలని.. ఉత్తర, దక్షిణ తెలంగాణలలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
వెంటనే హోంగార్డుల నియామకాలు
పోలీసు శాఖలో ఏడెనిమిదేళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని, సమర్థవంతమైన పోలీసు సేవల కోసం వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారు.
హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం హోంగార్డుల సేవలను మరింతగా వినియోగించుకోవాలన్నారు.
సీఎంను కలిసిన ముస్లిం పెద్దలు
డిసెంబర్ 15న మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలసి సన్మానించారు.
మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలను అందచేశారు.
ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులొద్దు
తన కాన్వాయ్ ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ జామ్‌లతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
రోడ్డు పై మూడు, నాలుగు లేన్లు ఉంటే.. ఒక లేన్‌లో సీఎం కాన్వాయ్ వెళ్లేలా చూడాలని సూచించారు. కాన్వాయ్‌లో ప్రస్తుతమున్న 15 వాహనాల సంఖ్యను 9కి తగ్గించాలన్నారు.
తమది ప్రజా ప్రభుత్వమని, తరచూ సమస్య లున్న చోటుకు వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు.
సీఎం సమీక్ష తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.