Skip to main content

హైదరాబాద్ మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రణాళికాబద్ధమైన లక్ష్యంతో హైదరాబాద్ నగర పాలక సంస్థ సమీకృత కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రణాళిక రచన, సమన్వయం, పర్యవేక్షణ, నగర సమగ్ర అభివృద్ధిని హైదరాబాద్ మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (హెచ్‌ఎండీఏ) లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్‌ఎండీఏ అమలు చేస్తున్న ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు..

హుస్సేన్ సాగర్, పరీవాహక ప్రాంతం మెరుగుదల ప్రాజెక్టు

హుస్సేన్ సాగర్ లేక్ అండ్ క్యాచ్‌మెంట్ ఏరియా ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (హెచ్‌సీఐపీ) పేరుతో రూ.370 కోట్ల ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ చేపట్టింది.
ప్రాజెక్టులోని అంశాలు..
  • హుస్సేన్ సాగర్ సరస్సులో ఏడాది పొడవునా నీటి నిల్వ ఉండేలా చూడటం.
  • సరస్సు జలాల నాణ్యతను మెరుగుపరచడం.
  • సరస్సులోకి కాలుష్యాలు ప్రవేశించకుండా నిరోధించడం.
  • నిర్ణీత స్థానాలు, ఇతర స్థానాల్లోనూ కాలుష్యాల ప్రవేశాన్ని అడ్డుకోవడం.
  • సరస్సుతో నాలాలు కలిసే సంగమాల్లో 500 మీటర్ల పరిధిలో పోషక పదార్థాలు ఇతోధికంగా ఉన్న పూడికను తొలగించడం.
  • సరస్సు మొత్తం వాతావరణాన్ని, దాని పరిసరాలను మెరుగుపరచడం.
  • జీవవైవిధ్యం సుసంపన్నం కావడానికి చర్యలు.
  • సరస్సు ప్రాంతంలో జీవావరణ పర్యాటక అవకాశాలు పెంచడం

నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)
హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించింది. వాటిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ఒకటి. 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ పటాన్‌చెరు (ముంబై ఎన్‌హెచ్-65పై ఉంది), మేడ్చల్ సమీపంలోని కండ్లకోయి (నాగపూర్ వైపు వెళ్లే ఎన్‌హెచ్-44), షామిర్‌పేట (రాజీవ్ రహదారిపై), ఘట్‌కేసర్ (వరంగల్ ఎన్‌హెచ్-163), పెద్ద అంబర్‌పేట(విజయవాడ వైపు వెళ్లే ఎన్‌హెచ్-65పై), శంషాబాద్ (శ్రీశైలం వైపు వెళ్లే ఎన్‌హెచ్-44)మీదుగా తిరుగుతుంది. ఓఆర్‌ఆర్ వివిధ జాతీయ రహదారులు, రాష్ర్ట రహదారులు, ఎండీఆర్.లకు దారి కలుపుతుంది. మొత్తం ప్రాజెక్టును రూ.6,696 కోట్ల వ్యయంతో మూడు దశల్లో చేపడుతున్నారు.

రేడియల్ రోడ్ల అభివృద్ధి
  • ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్‌రింగ్ రోడ్డును కలపడానికి 33 రేడియల్ దారులను గుర్తించారు.
  • ఈ 33 రేడియల్ దారుల్లో 53.72 కిలోమీటర్ల నిడివి ఉన్న మొత్తం ఏడింటిని సుమారు రూ. 341.17 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు. 4/6 బాటలుగా వెడల్పు పెంచిన ఈ రేడియల్ దారులు ఓఆర్‌ఆర్ పశ్చిమ, దక్షిణ విభాగాలను ఐఆర్‌ఆర్‌తో కలుపుతాయి.
  • ఓఆర్‌ఆర్ ఉత్తర, పశ్చిమ భాగాలను కలుపుతూ రూ. 287.51 కోట్ల అంచనా వ్యయంతో 54.45 కిలోమీటర్ల పొడవున 5 రోడ్లను మెరుగుపరుస్తున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) రుణ సహాయంతో ఈ పనులు జరుగుతున్నాయి.
  • సుమారు 180 కిలోమీటర్ల నిడివి ఉన్న మిగతా 16 రేడియల్ రోడ్ల అభివృద్ధి పనులను కూడా చేపట్టడానికి ప్రభుత్వం రూ. 304.90 కోట్లు మంజూరు చేసింది.

మౌలిక సదుపాయాల కల్పన

రంగారెడ్డి జిల్లాలోని ఉప్పల్ భగత్ , ఉప్పల్ వద్ద 413.32 ఎకరాల విస్తీర్ణంలో రూ. 143.51 కోట్లతో నివాస గృహ సముదాయాల లే అవుట్ల అభివృద్ధిని హెచ్‌ఎండీఏ చేపట్టింది. ఈ లేఅవుట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రంగం సిద్ధమైంది.
 
ఇంటర్ సిటీ బస్ టెర్మినల్
మియాపూర్‌లో హెచ్‌ఎండీఏకు చెందిన 55 ఎకరాల భూమిలో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్‌ను ప్రతిపాదించారు. ప్రయాణికులు, ప్రైవేట్, ప్రభుత్వ బస్ ఆపరేటర్లకు ప్రాథమిక అవసరాలను సమకూర్చే ఇంటిగ్రేటెడ్ వన్ స్టాఫ్ ఫెసిలిటీగా దీన్ని రూపొందిస్తారు. ప్రభుత్వపరంగా పెట్టుబడి ఏమీ లేకుండానే దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
 
లాజిస్టిక్స్ పార్కులు
విజయవాడ హైవే (ఎన్‌హెచ్- 9) మీద బాటసింగారం వద్ద 40 ఎకరాల్లో, నాగార్జున సాగర్ హైవే మీద మంగళపల్లి వద్ద 22 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్కుల నిర్మాణాన్ని హెచ్‌ఎండీఏ చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో రూపకల్పన చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ వన్ స్టాప్ సదుపాయంలో సరకు రవాణా నిర్వాహకులకు, థర్డ్ పార్టీ లాజిస్టిక్ (3పీఎల్) సర్వీస్ ప్రొవైడర్లకు, రవాణా నిర్వహణ కంపెనీలకు, ట్రక్కు డ్రైవర్లకు, గిడ్డంగులకు, పార్కింగ్ మొదలైన వాటికి అవకాశం కల్పిస్తారు.
 
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్
హైదరాబాద్‌లో సౌకర్యాల కల్పన, నిర్వహణ నగర ప్రణాళిక కార్యకలాపాలను చూసే వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్. 5 రూపాయలకు భోజన పథకం లాంటి అనేక సంక్షేమ పథకాలను జీహెచ్‌ఎంసీ అమలు చేస్తుంది.
 
విశ్వ నగరంగా హైదరాబాద్
హైదరాబాద్‌ను విశ్వ నగరంగా అభివృద్ధి  చేయడానికి తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ తోడ్పాటుతో హైదరాబాద్‌ను మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది. దీనికి గానూ ఇప్పుడున్న మురికి వాడల్లో జీవన పరిస్థితులను మెరుగుపరుస్తుంది. కొత్త మురికి వాడలు రాకుండా నిరోధిస్తుంది. వ్యూహాత్మకమైన రహదారి అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ)ని అమలు చేసి తొక్కిసలాట లేని నగరంగా మలుస్తుంది. హరితహారాన్ని అమలు చేస్తుంది.  ఈ స్థాయిని సాధించడానికి తగిన భాగస్వాములతో అనేక కొత్త ప్రయత్నాలను చేపట్టింది. వాటిలో కొన్ని కార్యక్రమాలు..

మురికివాడలు లేని నగరం
హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా చేయాలనే లక్ష్యంతో స్లమ్ ఫ్రీ సిటీ హైదరాబాద్ ప్రాజెక్టును ప్రారంభించారు.  ఈ ప్రాజెక్టు కింద రెండు పడక గదులు, హాలు, వంటగది  ఉన్న అపార్ట్ మెంట్లు నిర్మించి మురికి వాడల్లోని పేదలకు కేటాయిస్తారు. ప్రాథమికంగా నగరంలోని 10 కాలనీలను గుర్తించి పనులు చేపట్టారు.

వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ)
నగరంలోని రద్దీని తగ్గించి సాఫీగా రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఎస్‌ఆర్‌డీపీ. దీని కింద రూ. 21,684 కోట్ల అంచనా వ్యయంతో ఆకాశదారులు (స్కైవేలు), పెద్ద పెద్ద కారిడార్లు -రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మించాలని నిర్ణయించారు.

జీవావరణ నగరం
జీవ వైవిధ్య పరంగా నగరాన్ని సుసంపన్నం చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రారంభించింది.
హరితహారం
హరితహారం ప్రాజెక్టు కింద 2015లో 50 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని  జీహెచ్‌ఎంసీ చేపట్టింది. 10,000 ఎకరాల్లో హరిత భరితం, చెరువులు, శ్మశానాల సంరక్షణకు చర్యలు చేపట్టారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రీన్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జీవావరణ ఆధారిత మరుగుదొడ్లను మద్రాస్ ఐ.ఐ.టి. అభివృద్ధి చేసింది. నగరంలో చాలా ప్రాంతాలను గుర్తించి అక్కడ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన బహిరంగ స్థలాల వద్ద పూర్తిగా మహిళల కోసం మొట్టమొదటి సారిగా షీ-టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఎక్కువ మంది బాలికలున్న పాఠశాలలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ  100 మరుగుదొడ్లను నిర్మించాలని తలపెట్టారు.
గ్రీన్ కర్టెన్
నగరాన్ని హరిత భరితం చేసే లక్ష్యసాధనలో భాగంగా హరితహారంతో పాటు గ్రీన్ కర్టెన్  పథకాన్ని కూడా చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద 1,000 కిలోమీటర్ల పరిధిలో మొక్కలు పెంచాలని నిర్ణయించారు. ఇందుకు 50  ప్రాంతాలను గుర్తించి,  వాటిలో 15 ప్రాంతాల్లో మొక్కలు నాటారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగు నీటిపారుదల బోర్డు
నగరంలో ప్రస్తుతం 8,31,163 నల్లా కనెక్షన్లు, 913 సంచార ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నెలకు 152 రూపాయల ధరతో, మురికి పారుదల సెస్సుతో కలిపి గృహ వినియోగం కోసం 5కేఎల్ సంచార ట్యాంకర్‌ను రూ.400కు అందిస్తున్నారు.
 
గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు
ప్రధాన పథకానికి రూ.3,375 కోట్లు, రింగ్ మెయిన్స్ ప్రాజెక్టుకు రూ.350 కోట్లు  కలిపి మెత్తం రూ.3,725 కోట్ల వ్యయంతో 172 ఎంజీడీల నీటిని పంపిణీ చేయడానికి గోదావరి తాగునీటి సరఫరా పథకం ఒకటో దశను హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ చేపట్టింది. మొత్తం 186 కిలోమీటర్ల పైప్‌లైన్  పనుల్లో సుమారు 175 కిలోమీటర్ల మేర పూర్తయింది. అన్ని సివిల్ పనులు, డబ్ల్యూటీపీ, పంప్స్ అండ్ మోటార్స్ మొదలైన పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. గోదావరి రింగ్ మెయిన్స్ ప్రాజెక్టు కూడా పురోగతిలో ఉంది. 67.23 కిలోమీటర్ల నిడివిలో  35.38 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. ప్రధాన ప్రాజెక్టు, రింగ్ మెయిన్స్ ప్రాజెక్టు పూర్తి కావడంతో నగరానికి అదనంగా 172 ఎంజీడీల శుద్ధి చేసిన జలాలు అందుబాటులోకి వస్తున్నాయి.
 
కృష్ణా తాగునీటి సరఫరా పథకం (మూడో దశ)
కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్ జలాశయం నుంచి రూ.1,670 కోట్ల వ్యయంతో 90 ఎంజీడీల నీటి కోసం కృష్ణా తాగునీటి సరఫరా పథకం మూడో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టును 2015 కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో నగరానికి అదనంగా 90 ఎంజీడీల నీరు అందుతుంది. జీహెచ్‌ఎంసీ శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా మెరుగవుతుంది.
 
జాతీయ నదీ పరిరక్షణ ప్రాజెక్టు
మూసీ నది కాలుష్యం తొలగింపునకు ఉద్దేశించిన ప్రాజెక్టును ఎన్‌ఆర్‌సీడీ కింద రూ. 335.66 కోట్లతో చేపట్టారు.  హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఇప్పటికే ప్రాజెక్టు మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు 600 ఎంఎల్‌డీల మురుగును శుద్ధి చేసే వ్యవస్థను జాతీయ నదీ సంరక్షణ ప్రణాళిక కింద ప్రారంభించింది. ప్రాజెక్టు రెండో దశ ప్రతిపాదనలకు రూపకల్పన చేశారు. మరో 610 ఎంఎల్‌డీల మురుగును రూ.923 కోట్ల ఖర్చుతో కొత్త ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను జాతీయ నదీ సంరక్షణ ప్రాజెక్టుకు, పర్యావరణ-అడవుల మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికీ ఆమోదాల నిమిత్తం పంపారు. ఈ ప్రాజెక్టును అమలు చేయడం వల్ల హైదరాబాద్ నగర మధ్యలో మూసీ నది పొడవునా ఆరోగ్య పరిస్థితులు, పరిసరాలు చాలావరకు మెరుగుపడతాయి.
 
మల్కాజ్‌గిరి నీటి సరఫరా ప్రాజెక్టు
జీహెచ్‌ఎంసీలో మల్కాజ్‌గిరి సర్కిల్ కోసం సమగ్ర నీటి సరఫరా సేవల మెరుగుదల ప్రాజెక్టును 338.54 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టారు. మొత్తం మల్కాజ్‌గిరికి నీటి నిల్వకు అవసరమైన జలాశయాలు ఏర్పాటు చేయడానికి, నీటి  పంపిణీ యంత్రాంగాల కల్పన, మీటర్లు అమర్చడం మొదలైన పనులు ఈ ప్రాజెక్టులో ఉంటాయి.
 
శివారు ప్రాంతాలకు కొత్త నీటి సరఫరా ప్రాజెక్టులు
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ పరిధిలో రూ.1632.32 కోట్లు ఖర్చయ్యే 7 నీటి సరఫరా పథకాలున్నాయి. వీటిని రామచంద్రాపురం, పటాన్‌చెరు, ఎల్.బి.నగర్, శేరిలింగంపల్లి, అసిఫ్‌నగర్, కాప్రా, కూకట్‌పల్లి ప్రాంతాల్లో చేపట్టనున్నారు.
 
విశ్వవ్యాప్త గుర్తింపు
దేశంలోకెల్లా ఉత్తమ నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ ముందు వరుసలోకి వచ్చింది. రాజకీయ, సామాజిక వాతావరణం, వైద్య, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, ప్రజా సేవలు, విశ్రాంతి సౌకర్యాలు, సహజమైన పరిసరాలు తదితర అనేక అంశాలను లెక్కలోకి తీసుకుని, జీవన నాణ్యతా నివేదిక- 2015 అనే అంశంపై సలహా సంస్థ మెర్సర్ నిర్వహించిన ప్రపంచ వ్యాప్త సర్వేలో హైదరాబాద్ ఆణిముత్యంగా తేలింది. విశ్వనగరంగా హైదరాబాద్ పరివర్తన అంతా పైన పేర్కొన్న అనేక అంశాల సమాహారంతోనే సాధ్యమవుతుంది. క్రియాశీలమైన విధాన నిర్ణయాలతో ఈ ప్రక్రియకు అవకాశం కల్పించడమే రాష్ర్ట ప్రభుత్వ ధ్యేయం.
Published date : 31 Dec 2015 05:24PM

Photo Stories