Skip to main content

వృద్ధి చిత్రణ

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మదింపులో స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) అతి ముఖ్యమైన సూచీ. దీన్నే ‘రాష్ట్ర ఆదాయం’గా వ్యవహరిస్తారు. ఒక రాష్ట్రంలో నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల మొత్తం విలువను ‘స్థూల రాష్ట్ర ఉత్పత్తి’ అంటారు.
రాష్ట్ర మొత్తం జనాభాతో పోల్చి సాపేక్షంగా అధ్యయనం చేసినప్పుడు రాష్ట్రంలో తలసరి (ఒక్కొక్కరి నుంచి జరుగుతున్న) వస్తు లేదా సేవల ఉత్పత్తి వస్తుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రజల సాపేక్ష జీవన ప్రమాణం తెలుసుకోవచ్చు. దీన్నే ‘తలసరి ఆదాయం’ (పీసీఐ) అంటారు.
  • 2004-05 స్థిర ధరల ప్రకారం 2014-15లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి రూ. 2,17,432 కోట్లుగా అంచనా వేశారు. 2013-14లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి రూ. 2,06,427 కోట్లు. 2012-13లో తెలంగాణ 4.1 శాతం అభివృద్ధి సాధించగా, 2013-14లో (స్థిర ధరల ప్రాతిపదికన) 4.8 శాతం అభివృద్ధి సాధించింది.
  • రాష్ట్ర జీఎస్‌డీపీ 2004-05 స్థిర ధరల వద్ద 2005-06 నుంచి 2008-09, 2010-11 సంవత్సరాల మధ్య రెండంకెల స్థాయిలో వృద్ధి చెందింది. కానీ, 2009-10లో కనిష్ట స్థాయిలో 1.1 శాతం మాత్రమే వృద్ధి సాధించింది.
  • వర్తమాన ధరల వద్ద 2014-15 జీఎస్‌డీపీని రూ. 4,30,599 కోట్లుగా అంచనా వేశారు. 2013-14లో ఇది రూ. 3,91,751 కోట్లు మాత్రమే. ఇందులో వృద్ధి 9.9 శాతం.
వర్గాల వారీగా వృద్ధి సరళి
వర్గాల వారీ వృద్ధి సరళి నిర్ణీత కాల వ్యవధిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో జీఎస్‌డీపీ పరిమాణంలో, కూర్పులో వచ్చిన మార్పును తెలుపుతుంది. జీఎస్‌డీపీలో వర్గాల వారీ వాటాల్లో సాపేక్ష మార్పు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణపరమైన మార్పును ఆవిష్కరిస్తుంది. ఆర్థిక వ్యవస్థను వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే మూడు రంగాలుగా వర్గీకరించారు. వ్యవసాయ రంగంలో వ్యవసాయంతో పాటు పశు సంపద, జీవోత్పత్తులు, అటవీ సంపద, మత్స్య సంపదలు కూడా భాగంగా ఉంటాయి. పారిశ్రామిక రంగంలో గనులు, తవ్వకాలు, వస్తూత్పత్తి, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగాలు ఉంటాయి. సేవా రంగంలో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్వేలు, కమ్యూనికేషన్‌లు, రైల్వేయేతర మార్గాల ద్వారా రవాణా, గిడ్డంగులు, బ్యాంకు వ్యవహారాలు, బీమా సేవలు, స్థిరాస్తి వ్యాపారాలు, స్వీయ నివాస వసతి కల్పన, వ్యాపార సేవలు, ప్రజా పరిపాలన తదితర సేవలు వస్తాయి.
  • 2014-15లో జీఎస్‌డీపీ వృద్ధి రేటు 9.7 శాతంతో సేవా రంగం అగ్రస్థానంలో, 4.1 శాతం వృద్ధితో పారిశ్రామిక రంగం రెండో స్థానంలో ఉన్నాయి. వ్యవసాయ రంగం ప్రతికూల దిశలో ఉన్నప్పటికీ జీఎస్‌డీపీ 5.3గా నమోదైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి పతన దిశలో ఉంది. వ్యవసాయ రంగం బాగా దెబ్బతినడంతో -21.3 శాతం పతనం చవిచూసింది. జీవోత్పత్తుల రంగంలో 6.5 శాతం, అటవీ సంపద, కలప ఆదాయాల్లో 2.7 శాతం, మత్స్య సంపదలో 11.4 శాతం వృద్ధి జరిగిన కారణంగా మొత్తం మీద ఈ రంగం కొద్దిగా మెరుగుపడింది.
  • సేవా రంగం వాటా 2013-14లో 60.3 శాతం ఉండగా, 2014-15లో ఇది 62.9 శాతానికి పెరిగింది. వ్యవసాయ రంగం 15.1 శాతం నుంచి 12.8 శాతానికి క్షీణించింది. పారిశ్రామిక రంగం వాటా (24.3 శాతం)లో పెద్దగా మార్పు లేదు.
  • గడిచిన దశాబ్దంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయ మార్పులకు లోనైంది. 2005-06, 2014-15 మధ్య వ్యవసాయ రంగం 2005- 06లో అత్యధిక స్థాయిలో 25.2 శాతం వృద్ధి సాధించగా.. సేవా రంగం 2010-11లో 18.3 శాతం గరిష్ట వృద్ధిని, పారిశ్రామిక రంగం 2006-07లో 17.1 శాతం గరిష్ట వృద్ధిని సాధించాయి. వ్యవసాయ రంగంలో.. మిగిలిన విభాగాలతో పోలిస్తే ఒక జీవోత్పత్తులు మాత్రమే నికరంగా సానుకూల వృద్ధి రేటు చూపాయి.
  • సేవా రంగంలో రైల్వేయేతర రవాణా సాధనాలు, గిడ్డంగులు, కమ్యూనికేషన్‌లు, బ్యాంకింగ్, బీమా, స్థిరాస్తులు, స్వగృహ కల్పన, వ్యాపార సేవలు, ఇతర సేవలు సానుకూల వృద్ధి రేటు సాధించాయి. పారిశ్రామిక రంగంలోనూ 2005-06, 2014-15 మధ్య అన్ని ఉపరంగాల్లో వృద్ధి మిశ్రమంగా ఉంది.
Published date : 19 Feb 2016 06:45PM

Photo Stories