TS Police Recruitment: ప్రిలిమ్స్ పరీక్ష విధానం.. విజయం సాధించడానికి మార్గాలు..
తెలంగాణలో అన్ని విభాగాల్లో కలిపి సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ కేడర్స్‌లో మొత్తం 17,516 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వయో పరిమితిలోనూ సడలింపు లభించింది. దీంతో..దాదాపు పన్నెండు లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతటి తీవ్ర పోటీలో నిలదొక్కుకుని..ఎంపిక ప్రక్రియలో తదుపరి దశలకు అర్హత సాధించాలంటే..తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష గట్టెక్కడం తప్పనిసరి. మరోవైపు.. జూలై చివరి వారం లేదా ఆగస్ట్ రెండో వారంలో ప్రిలిమ్స్ పరీక్షలు ఉంటాయని అధికార వర్గాల ప్రకటన. నేటితో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తున్న ఈ నేపథ్యంలో.. పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమ్స్ పరీక్ష విధానం, విజయం సాధించడానికి మార్గాలపై ప్రత్యేక కథనం...
- ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్ట్‌లకు కీలకంగా ప్రిలిమినరీ
- ప్రిలిమ్స్‌లో మెరిట్ ఆధారంగా మలి దశకు ఎంపిక
- జూలై చివరి వారంలో ప్రిలిమ్స్ పరీక్ష
రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో తొలిదశ..ప్రిలిమినరీ పరీక్ష. ప్రస్తుత పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే..అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో గట్టెక్కితే విజయ పథంలో సగం దూరం పయనించినట్లే! కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వ్యూహాత్మక ప్రిపరేషన్ సాగించాలి అంటున్నారు నిపుణులు. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ),కానిస్టేబుల్ తదితర కేటగిరీల్లో 17,516పోస్ట్‌లకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిలో.. ఎస్‌ఐ సివిల్/తత్సమాన కేడర్లు,అదే విధంగా కానిస్టేబుల్ సివిల్/తత్సమాన విభాగాల్లోని పోస్ట్‌లకు మాత్రమే ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు.
16,614 SI & Constable Jobs: పోలీస్ పోస్టులకు సన్నద్ధమవ్వండిలా!
కానిస్టేబుల్–ప్రిలిమినరీ
- కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు.
- మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు.
- వీటిలో ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు.
ఎస్‌ఐ ప్రిలిమ్స్.. రెండు విభాగాల్లో
- సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌లకు నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షను రెండు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు.
- అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి 100ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ స్టడీస్ నుంచి మరో 100 ప్రశ్నలు అడుగుతారు.
- మొత్తం మూడు గంటల వ్యవధిలో పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
- రెండు పోస్ట్‌లకు సంబంధించి కనీసం 30 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా 20 శాతం నెగెటివ్ మార్కుల నిబంధన విధించారు.
- ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు పొందిన మార్కులు,దరఖాస్తుల సంఖ్య ఆధారంగా తదుపరి దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
- ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమ్స్, అదే విధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా జరిపే సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత ఆయా పోస్ట్‌ల స్థాయికి అనుగుణంగా ఉంటుంది.
ఉమ్మడి అంశాలు కూడా
- రెండు పోస్ట్‌లకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో ఉమ్మడి అంశాలు ఉన్నాయి. జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలు రెండు పోస్ట్‌లలోనూ ఉన్నాయి.
- ఎస్‌ఐ పోస్ట్‌లకు మాత్రం ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం,తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం,తెలంగాణ ఉద్యమ దశలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. వాస్తవానికి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలో సైతం తెలంగాణ ప్రాధాన్యం గల అంశాలని క్లుప్తంగా పేర్కొన్నారు. వీటిలోనూ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ దశలకు సంబంధించిన ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది.
- అర్థమెటిక్ కూడా రెండు పోస్ట్‌ల ప్రిలిమ్స్‌లో సిలబస్‌గా పేర్కొన్నారు.
విజయం సాధించాలంటే
కానిస్టేబుల్,ఎస్‌ఐ పోస్ట్‌ల ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు ఇప్పటి నుంచే నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేయాలి. జూలై చివరి వారం లేదా ఆగస్ట్ రెండో వారంలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని అధికారికంగా పేర్కొన్నారు. ముందుగా ఎస్‌ఐ పోస్ట్‌లకు, ఆ తర్వాత మరో రెండు వారాలకు కానిస్టేబుల్ పోస్ట్‌లకు ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు కూడా స్పష్టం చేశారు. అంటే.. అభ్యర్థులకు ఇప్పటి నుంచి రెండు లేదా రెండున్నర నెలల సమయం అందుబాటులో ఉంది.
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
సిలబస్.. వెయిటేజీ
ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు ముందుగా సిలబస్‌లోని అన్ని అంశాలను పరిశీలించి వెయిటేజీపై ఒక అంచనాకు రావాలి. ఇందుకోసం గత ప్రశ్న పత్రాలను పరిశీలించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్ సమయంలో వాటికి నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలి.
ఉమ్మడిగా సాగాలంటే
ఇంటర్ అర్హతగా పేర్కొన్న కానిస్టేబుల్ పోస్ట్‌లకు బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు కూడా పోటీ పడే పరిస్థితి ఉంది.ఇలా రెండు పోస్ట్‌లకు హాజరయ్యే వారు రెండు పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న అంశాలను, ప్రత్యేకంగా ఉన్న టాపిక్స్‌ను గుర్తించి..దానికి అనుగుణంగా తమ సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.
కాన్సెప్ట్‌లపై అవగాహన
అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ఆయా అంశాలను అధ్యయనం చేసేటప్పుడు ప్రధానంగా వాటి కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. గత ప్రశ్న పత్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇన్–డైరెక్ట్ ప్రశ్నలు కూడా కనిపించాయి. కాన్సెప్ట్‌లపై పట్టు సాధించడం ద్వారా.. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!
రివిజన్.. రివిజన్
అభ్యర్థులు ప్రతి రోజు రివిజన్ చేసుకునే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతిరోజు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు.. అంతకుముందు రోజు చదివిన అంశాల అవలోకనానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం కేటాయించాలి. దీనివల్ల ఆయా అంశాల కొనసాగింపుగా ఉండే కొత్త టాపిక్స్ ప్రిపరేషన్ సులభంగా సాగుతుంది. అదే విధంగా రీజనింగ్, అర్థమెటిక్‌కు సంబంధించి ముఖ్యమైన పాయింట్లను, సూత్రాలను షార్ట్‌కట్ మెథడ్స్‌లో నోట్స్ రాసుకుంటే.. తుది దశ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
ప్రతి సబ్జెక్ట్‌కూ.. ప్రత్యేకంగా
- అభ్యర్థులు పరీక్ష సిలబస్‌లో పేర్కొన్న ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రత్యేకంగా అడుగులు వేయాలి.
- భారత చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర గతిని మార్చిన సంఘటనలు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
- జాగ్రఫీలో భారత భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, సముద్ర తీర ప్రాంతాలు, అడవులు, పంటలు, సాగు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
- ఎకానమీకి సంబంధించి కోర్ ఎకనామీ అంశాలతోపాటు సమకాలీన పరిణామాలు, దేశ ఆర్థిక రంగంలో అమలవుతున్న కొత్త విధానాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి.
- పాలిటీకి సంబంధించి రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్తలు, రాజ్యంగంలోని ముఖ్యమైన అధికరణలు వంటి అంశాలతోపాటు తాజా రాజ్యాంగ సవరణలు, వాటి ఉద్దేశం, ప్రభావం గురించి తెలుసుకోవాలి.
- కరెంట్ అఫైర్స్‌లో జాతీయం,అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న తాజా పరిణామాలు(ఉదా:క్రీడలు–విజేతలు,సదస్సులు, సమావేశాలు–తీర్మానాలు తదితర) గురించి సంపూర్ణ పట్టు సాధించాలి. అదే విధంగా జాతీయ భద్రతకు సంబంధించి ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్ ఇదే.. ఇలా చదివితే..
తెలంగాణ ప్రత్యేకంగా
ఎస్‌ఐ పోస్ట్‌లకు ప్రత్యేకంగా పేర్కొన్న తెలంగాణ ఆలోచన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమ దశలకు సంబంధించి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అన్ని ముఖ్య అంశాలను ఔపోసన పట్టాలి. ముల్కీ నిబంధనలు, శ్రీబాగ్ ఒడంబడిక, పెద్ద మనుషుల ఒప్పందం, గిర్‌గ్లానీ కమిషన్, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ నివేదికలను అధ్యయనం చేయాలి. అదే విధంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలోని ముఖ్య ఘట్టాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, పంటలు, రవాణా సౌకర్యాలు, రాష్ట్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, నీటి పారుదల వ్యవస్థలను చదవాలి. దీంతోపాటు తెలంగాణ ఎకానమీపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి చేయూతనిచ్చే రంగాలపై అవగాహన పెంచుకోవాలి. పంటలు–దిగుబడి, తాజా ఆర్థిక సర్వేలో ఈ ప్రాంతం గురించి పేర్కొన్న ముఖ్య అంశాలన్నింటిపై దృష్టి సారించాలి.
అర్థమెటిక్.. అప్రమత్తంగా
అర్థమెటిక్ అండ్ రీజనింగ్.. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఈ విభాగం నుంచే వంద ప్రశ్నలు అడుగుతారు. అర్థమెటిక్‌లోని ముఖ్యాంశాలుగా భావించే సగటు, కసాగు, గసాభా, సంఖ్యలు, వర్గ మూలాలు, ఘన మూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయసులు, శాతాలు, లాభ–నష్టాలు, చక్ర వడ్డీ, సరళ వడ్డీ, కాలం–దూరం, కాలం–పని వంటి వాటిపై పట్టు సాధించాలి. అదే విధంగా మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, సెట్స్–రిలేషన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలి.
TS Police Jobs: పోలీసు రాత పరీక్షలో.. ఏవైనా కష్టమైన ప్రశ్నలు వస్తే..
రీజనింగ్
అభ్యర్థులు కాసింత విశ్లేషణాత్మక దృక్పథంతో వ్యవహరిస్తే మంచి మార్కులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉన్న విభాగం..రీజనింగ్.ఇందులో నంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, కోడింగ్–డీకోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్, బ్లడ్ రిలేషన్స్ వంటి వాటిపై పూర్తి పట్టు సాధించాలి. వెన్ డయాగ్రమ్స్, అసెంప్షన్ అండ్ రీజన్, ఆర్గ్యుమెంట్, సిలాజిజమ్, డేటా సఫిషియన్సీ విభాగాల్లో పట్టుతో.. వెర్బల్ రీజనింగ్‌లో రాణించే అవకాశం ఉంది. ఆడ్‌మన్ ఔట్, డైస్ అండ్ క్యూబ్స్, వెన్ డయాగ్రమ్‌లపై పట్టుతో నాన్ వెర్బల్ రీజనింగ్‌లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది.
పదో తరగతి, డిగ్రీ స్థాయి పుస్తకాలు
ఎస్‌ఐ,కానిస్టేబుల్ పోస్ట్‌లకు సంబంధించి అభ్యర్థులు పదో తరగతి, బ్యాచిలర్ డిగ్రీ స్థాయి పుస్తకాలతో తమ ప్రిపరేషన్ ప్రారంభించాలి. దీనివల్ల ముందుగా ఆయా అంశాల ప్రాథమిక భావనలపై అవగాహన లభిస్తుంది. వాటి ఆధారంగా అన్వయ దృక్పథంతో సమకాలీన సమ్మిళితంగా ఉండే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత వస్తుంది. కోర్ అంశాలు ఎక్కువగా ఉండే సైన్స్, మ్యాథమెటిక్స్ విషయంలో ఈ విధానం ఎంతో ఉపకరిస్తుంది.
ప్రతి రోజు నిర్దిష్ట సమయం
ప్రిపరేషన్‌కు ప్రతిరోజు నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రోజూ కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. పరీక్షకు పదిహేను రోజుల ముందు వరకు పూర్తిగా ప్రిపరేషన్‌కే కేటాయించాలి. ఆ తర్వాత సమయం రివిజన్‌కు కేటాయించాలి.
ముఖ్య సమాచారం
- విద్యార్హత: సివిల్ ఎస్‌ఐ/తత్సమాన పోస్ట్‌లకు జూలై 1, 2022 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- సివిల్ కానిస్టేబుల్/తత్సమాన పోస్ట్‌లకు జూలై 1, 2022 నాటికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయో పరిమితి: కానిస్టేబుల్ పోస్ట్‌లు: జూలై 1, 2022 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 27ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు 32ఏళ్లు మించకూడదు.
- ఎస్‌ఐ పోస్ట్‌లు: జూలై 1, 2022 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 30ఏళ్లు,ఎస్సీ/ ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం
- ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ: మే 26, 2022(రాత్రి పది గంటల వరకు)
- ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://www.tslprb.in/account/landing
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.tslprb.in
వెయిటేజీకి ప్రాధాన్యమిస్తూ
అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. అర్థమెటిక్, రీజనింగ్, భారత చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, కరెంట్ అఫైర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా మెటీరియల్ ఎంపికలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
–జి.శ్యామ్, సబ్జెక్ట్ నిపుణులు