Skip to main content

High Court: కానిస్టేబుల్‌ నియామకాలకు లైన్‌క్లియర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖలో 15,750 కానిస్టేబుల్‌ నియామకాలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఎంపిక పరీక్షలో అభ్యర్థులకు నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు ప్రకటించాలన్న సింగిల్‌ జడ్జి తీర్పును ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
Hyderabad Police Recruitment  15,750 Constables to be Recruited in Hyderabad Police   Lineclear for constable recruitment   Hyderabad Police Constable Recruitment

 అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు సంబంధించి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)ను ధర్మాసనం ఆదేశించింది. ఆ కమిటీల నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించి నాలుగు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 

సింగిల్‌ జడ్జి తీర్పుతో.. 

రాష్ట్రంలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం 2022 ఆగస్టు 30న తుది రాతపరీక్ష జరిగింది. అందులో దాదాపు 23 ప్రశ్నలపై అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు అభ్యర్థులు పేర్కొన్నారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతోపాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్‌ చేశారు. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. ‘‘ఈ పరీక్షలో నాలుగు ప్రశ్నలను మినహాయించి అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలి.

చదవండి: Selection as Police: పోలీస్‌ శాఖలోకి ఎంపికైన యువకులు.. ఇదే వారి ప్రయాణం!

122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదు. 57 ప్రశ్న తప్పుగా ఉంది. వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలి. ఈ మార్పులతో పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేసి, ఫలితాలను ప్రకటించాలి.

తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’’అని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. సింగిల్‌ జడ్జి అన్ని అంశాలను పరిశీలించలేదని, ఆ తీర్పును కొట్టివేయాలని కోరింది. 

ఆ పని నిపుణుల కమిటీలే చేయాలి 

రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశర్వర్‌రావుల ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నట్టు పేర్కొంది. రిక్రూట్‌మెంట్‌ బోర్డులు నిర్వహించే నియామక పరీక్షల్లో తలెత్తే సమస్యల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ప్రశ్నలు తొలగించడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి పనులను నిపుణుల కమిటీలే చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది.

చదవండి: AP SI Job Selected Candidates: ఖాకీ స్టార్స్‌.. ఎస్ఐలుగా ఎంపికైన కానిస్టేబుళ్లు.. వీరే..!

ప్రశ్నల తప్పిదాలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అభ్యర్థులలో విశ్వాసం పెంపొందించేలా పారదర్శకంగా రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఆ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని నియామక బోర్టును ఆదేశించింది.

ఒక కమిటీలో ఉన్న సభ్యులు మరో కమిటీలో ఉండకూడదని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా నియామక ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. 

ఎంపికైన అభ్యర్థులకు ఊరట 

రిక్రూట్‌మెంట్‌ బోర్డు కానిస్టేబుల్‌ పరీక్షలకు సంబంధించి గత ఏడాది అక్టోబర్‌ 4వ తేదీనే ఫలితాలు ప్రకటించింది. మొత్తం 16,604 పోస్టులకు గాను 15,750 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ.. జాబితాను విడుదల చేసింది. ఎంపికైనవారిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. వారందరికీ హైకోర్టు ధర్మాసనం తీర్పుతో ఊరట లభించింది.   

Published date : 05 Jan 2024 01:22PM

Photo Stories