Skip to main content

TSBIE: తప్పులు లేకుండా.. ఇంటర్‌ ఫలితాలు.. ఇసారి ఇలా

సాక్షి, హైదరాబాద్‌: ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.
TSBIE
తప్పులు లేకుండా.. ఇంటర్‌ ఫలితాలు

దీనికోసం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఫలితాల వెల్లడి ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఏప్రిల్‌ 26న పరీక్షల విభాగం అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. స్పాట్‌ వ్యాల్యుయేషన్, మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్‌ ప్రక్రియ, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు విధానాలపై చర్చించారు. ప్రతీ సంవత్స రం పరీక్షలు, ఫలితాల వెల్లడిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈసారి ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఇదే స్ఫూర్తిని ఫలితాల వెల్లడిలోనూ కనబరచాలనే ఆలోచనలో ఉన్నారు. ఫలితాల వెల్లడికి అవసరమైతే కొంత సమయం తీసుకోవడానికైనా వెనుకాడవద్దని, అన్ని స్థాయిల్లో పరిశీలించిన తర్వాతే ముందుకెళ్ళాలని అధికారులకు మిత్తల్‌ సూచించారు. ఆన్‌లైన్‌ ఫీడింగ్‌లో గతంలో అనేక పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై అధికారులు లోతుగా అధ్యయనం చేశా రు. మార్కుల నమోదులో గతంలో ఎందుకు సమస్యలొచ్చాయి? సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలా? వ్యక్తుల తప్పిదాలా? అనే అంశాలపై మిత్తల్‌ ఆరా తీశా రు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్‌వేర్‌ను పూర్తిస్థాయిలో నిపుణుల చేత పరిశీలించాలని సూచించారు. 

చదవండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!

పరీక్షలు రాసిన 9 లక్షల మంది విద్యార్థులు 

ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి దాదాపు 9 లక్షల మంది ఈసారి పరీక్ష రాశారు. ఇంతమంది మార్కుల నమోదు విషయంలో ప్రత్యేక పరిశీలనకు అధికారులను నియమించారు. అంతిమంగా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫలితాల వెల్లడికి సిద్ధమవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత ఎక్కడైనా తప్పు జరిగిందని భావిస్తే, మార్కులను మాన్యువల్‌గా తెప్పించి చూడటం ఆలస్యమవ్వొచ్చు. దీన్ని దృష్టి లో ఉంచుకుని ఆన్‌లైన్‌లో వీలైనంత త్వరగా విద్యార్థి రాసిన పేపర్‌ను పరిశీలించే ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క విద్యార్థి కూడా అధైర్యపడకుండా చర్యలు తీసుకోవాలని మిత్తల్‌ సూచించారు. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డుకు సంబంధించిన ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడించాలనే పట్టుదలతో అధికారులున్నారు.

చదవండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

Published date : 27 Apr 2023 04:29PM

Photo Stories