TGBIE: పాఠాలే కాలేదు.. పోటీ పరీక్షల శిక్షణా?.. మ్యాథ్స్, సైన్స్‌లో కదలని సిలబస్ ..
రోజువారీ క్లాసులు పూర్తయ్యాక పోటీ పరీక్షలపై శిక్షణ ఇవ్వాలంటూ అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లను విద్యాశాఖ తాజాగా ఆదేశించింది. వాస్తవానికి ఏటా కాలేజీకి కొంతమందిని ఎంపిక చేసి, జిల్లా కేంద్రంలో పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు.
ఈసారి అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ దీనిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,64,892 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. వీరిలో 2.85 లక్షల మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులుంటారు. వీరిలో 80 వేల మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్నారు. వీరంతా ఇంటర్ తర్వాత ఏదో ఒక పోటీ పరీక్ష రాయాల్సినవారే.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | టిఎస్-ప్రివియస్ పేపర్స్ | గెస్ట్ కాలమ్
సిలబస్ పూర్తవ్వకుండా ఎలా?
రాష్ట్రవ్యాప్తంగా 422 ప్రభుత్వ ఇంటర్ కాలేజీలున్నాయి. ఇప్పటికీ ఈ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. దాదాపు 120 కాలేజీల్లో ఇంటర్ సెకండియర్ పాఠాలు ఇంకా మొదలవ్వలేదు. ప్రతీచోట అధ్యాపకుల కొరత వేధిస్తోంది. 1,654 మంది అతిథి అధ్యాపకులతో ఏటా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈసారి గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. రెగ్యులర్ అధ్యాపకుల్లో కొంతమందే సబ్జెక్టు లెక్చరర్లు. ఎక్కువమంది భాషాపండితులే ఉన్నారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
ఈ కారణంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ క్లాసులు ఇంకా మొదలవ్వలేదు. గత ఏడాది నుంచి ఇంగ్లిష్‌లోనూ ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి ఇంగ్లిష్‌లో మాట్లాడటం, సెమినార్లు నిర్వహించడం చేయాలి. ఇవి ఎక్కడా నిర్వహించడం లేదని విద్యార్థులు అంటున్నారు. సైన్స్ ప్రాక్టికల్స్ గురించి ఏ కాలేజీ పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ కాలేజీల్లో అసలు ప్రాక్టికల్స్ ఊసే ఉండటం లేదని, అలాంటప్పుడు ప్రభుత్వ కాలేజీలపై ఒత్తిడి పెంచలేమని అధ్యాపకులు అంటున్నారు.
వాస్తవానికి దసరా నాటికి సగానికిపైగా సిలబస్, సంక్రాంతి నాటికి మొత్తం సిలబస్ పూర్తవ్వాలి. ఆ తర్వాత రివిజన్ చేయాలి. 220 కాలేజీల్లో ఇప్పటికీ ఒక్క చాప్టర్ కూడా మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో పూర్తవ్వలేదని ఇటీవల ఇంటర్ బోర్డు సమీక్షల్లో తేలినట్టు అధికారవర్గాల సమాచారం. గత ఏడాది ఫస్టియర్ సిలబస్‌ను హడావుడిగా పూర్తి చేశారని విద్యార్థులు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో తప్పలేదని అధ్యాపకులూ అంటున్నారు.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
పోటీ పరీక్షలెలా..?
నవంబర్‌లో జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ వెలువడుతుంది. జనవరిలో తొలివిడత, ఏప్రిల్, మేలో రెండోవిడత మెయిన్ పరీక్షలు జరుగుతాయి. నీట్ కూడా ఏప్రిల్‌లోనే జరుగుతుంది. రాష్ట్ర ఇంజనీరింగ్ సెట్ కూడా మేలో చేపట్టొచ్చు. ఇంత వరకూ సిలబస్ పూర్తవ్వకపోవడంతో పోటీ పరీక్షలకు క్లాసులు నిర్వహించినా పెద్దగా ప్రయోజనం ఉండదని అధ్యాపకులు అంటున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
పోటీ పరీక్షల కోసం కనీసం 90 రోజుల ప్రిపరేషన్ అవసరమని, పరీక్షల సమయంలో జేఈఈ, నీట్ సన్నద్ధత సాధ్యం కాదని చెబుతున్నారు. ఏదేమైనా ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు షెడ్యూల్ ఇచ్చి ఉండాల్సిందని అధ్యాపక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక్కసారిగా క్లాసులు పెంచడం వల్ల కూడా విద్యార్థులు ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని అధ్యాపకులు తెలిపారు.
Tags
- TGBIE
- JEE Coaching
- NEET Coaching
- EAPCET Coaching
- Govt Junior Colleges
- Entrance Exams
- Academic year
- Telangana Government
- TS Inter Board
- Department of Education
- Inter Syllabus
- burra venkatesham
- Competitive Examinations
- Special Training for Competitive Exams
- Department of Higher Education
- Telangana News