TSBIE: మూల్యాంకన టెండర్ల ప్రక్రియ మార్చి 4కు పూర్తి
ఈసారి వీలైనంత ఎక్కువ మంది బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనువుగా కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తున్నారు. జీఎస్టీ, విద్యాసెస్ నుంచి రాయితీ కల్పించడం ఇందులో ప్రధానాంశాలుగా తెలుస్తోంది. ఇటీవల పిలిచిన టెండర్లలో కేవలం ఒకే ఒక సంస్థ పాల్గొనడంతో టెండర్‌ను రద్దు చేశారు. ఇతర కంపెనీలు ఎందుకు పాల్గొనలేదనే అంశంపై అధికారులు ఆరా తీశారు. దీంతో కొన్ని సవరణలు చేయాలని కంపెనీలు కోరినట్టు తెలిసింది. ఇంటర్ బోర్డులో వచ్చే మూడేళ్లలో వందశాతం ఆన్‌లైన్ మూల్యాంకన విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2023లో 35 లక్షల పేపర్లకు ఆన్‌లైన్ మూల్యాంకనం చేయనున్నారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థలు వార్షిక సాధారణ పరీక్షలతో పాటు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి కూడా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించాల్సి ఉంటుంది.
చదవండి: TSBIE: ఇంటర్ మూల్యాంకనానికి మళ్లీ టెండర్లు
అధ్యాపకులు మూల్యాంకన కేంద్రాలకు రాకుండానే, తమకు వీలైన చోటు నుంచి విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకన చేయాల్సి ఉంటుంది. పూర్తి భద్రతతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను కాంట్రాక్టు సంస్థ అందిస్తుంది. అధ్యాపకులు వేసే మార్కులు ఆన్‌లైన్‌లోనే క్రోడీకరణ చేయడమే కాకుండా, రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ విధానానికి అనువైన రీతిలో ఆన్‌లైన్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఈ మొత్తం విధానం బోర్డులోని అతి ముఖ్యమైన వ్యక్తుల నేతృత్వంలో ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇది ఎటువంటి అక్రమాలకు తావివ్వని పారదర్శక విధానమని.. బోర్డు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత ఓ నిర్ధారణకు వచి్చంది.
చదవండి: మూల్యాంకనంపై అనుమానాలున్నాయి