Inter Admissions: బాలికావిద్యకు భరోసా
ఇంటర్‌లో ప్రవేశాలు..
2024–25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని 12 కేజీబీవీ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూపులలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కేజీబీవీల సెక్టోరియల్ అధికారి సలోమి కరుణ తెలిపారు. పది కేజీబీవీ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Longest Serving Lok Sabha Members: లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువసార్లు గెలిచింది వీరే..!
నాలుగు కాలేజీల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు..
మామడ, కడెం, నిర్మల్ అర్బన్, ముధోల్ కేజీబీవీలలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 12 కేజీబీవీ కళాశాలల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున 960 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత శనివారం వరకు జిల్లాలో 650 సీట్లు భర్తీ అయ్యాయని సలోమీ కరుణ తెలిపారు. ఇంకా 310 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆంగ్ల మాధ్యమంలో బోధన..
జిల్లాలోని దస్తూరాబాద్, పెంబి, నర్సాపూర్(జీ) కేజీబీవీల్లో ఆంగ్ల మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని అన్ని కేజీబీవీ విద్యాలయాల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, ల్యాబ్ సౌకర్యం ఉన్నాయి. నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. అధ్యాపకులు అంకితభావంతో నిరంతరం విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
అత్యుత్తమ ఫలితాలు..
ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కేజీబీవీ కళాశాలల విద్యార్థులు 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. 620 మంది పరీక్షలకు హాజరుకాగా, 577 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచారు. మొదటి సంవత్సరంలో 613 మంది పరీక్షలకు హాజరుకాగా, 542 మంది ఉత్తీర్ణత సాధించారు. 88 శాతం ఉత్తీర్ణతతో ఫస్ట్ ఇయర్‌లోనూ రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు.